iDreamPost
android-app
ios-app

స్టేజిల మీద అడిగేస్తే సరిపోదు

  • Published Jan 07, 2020 | 7:03 AM Updated Updated Jan 07, 2020 | 7:03 AM
స్టేజిల మీద అడిగేస్తే సరిపోదు

సినిమా రంగంలో విశేష సేవలు అందించిన వారికి అత్యున్నత పురస్కారాలు దక్కడం సముచితం. ఆ పని ప్రభుత్వాలు చేయాలి. తగిన సమయంలో గుర్తించి అందజేస్తే సినిమా ప్రేమికులు సంతోషిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వ విచక్షణ మీద నడిచే వీటిని అందుకోవడం అంత సులభంగా ఉండదు. అవి రావడంలో రాకపోవడంలో చాలా తెరవెనుక కారణాలు ఉంటాయి.ఇప్పుడు ఈ ప్రస్తావన రావడానికి కారణం ఉంది.

నిన్న అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్ లో అల్లు అర్జున్ బాగా ఎమోషనల్ అవుతూ తన తండ్రి అల్లు అరవింద్ కు పద్మశ్రీ దక్కాలనే కోరిక వెలిబుచ్చాడు. అంతకు ముందు రోజు సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ కృష్ణగారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండూ సమంజసమైన కోరికలా కాదా అనేది పక్కన పెడితే నిజంగా పరిశ్రమ పెద్దలు పూనుకుని ప్రభుత్వాలకు విన్నవిస్తే ఏదో ఒక స్పందన రాకపోదు. అంతే తప్ప ఇలా స్టేజిల మీద దిగ్గజాలకు ఇవి దక్కాలి అని చెప్పినంత మాత్రాన అవి నేరుగా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలకు చేరవు.

గతంలోనూ ఎన్టీఆర్ కు ఇలాంటి గౌరవమే దక్కాలని ఆయన వర్ధంతి జయంతులు సందర్భంగా కుటుంబ సభ్యులు చెప్పడం ఆ తర్వాత దాని ఊసే ఎక్కడా తీసుకురాకపోవడం ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇది మాములే అనుకుని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలా కాకుండా సదరు ప్రముఖులు బ్రతికి ఉండగానే వాళ్లకు ఆ పురస్కారాలు అందజేస్తే వాళ్ళతో పాటు మూవీ లవర్స్ అందరూ సంతోషిస్తారు. కాబట్టి స్టేజిల మీదే అడిగేయడం అంటే ఏదో ప్రమోషన్ కోసం మాట్లాడినట్టు ఉంటుంది కాని కార్యరూపం దాల్చేలా మా అసోసియేషన్ కాని ప్రొడ్యూసర్స్ గిల్డ్ కాని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. చిరంజీవి, అల్లు అర్జున్ చెప్పిన వాళ్ళే కాదు ఇంకా ఎందరో అర్హత కలిగిన ప్రతిభావంతులు అనుభవజ్ఞులు న్యాయంగా దక్కాల్సిన గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారు. అది నెరవేరాలంటే చేయాల్సింది చాలా ఉంది.