iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ కాలం తర్వాత జిల్లాల విభజన ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్యాబినెట్ లో చర్చించారు. ఉన్నతాధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ పనికి సహాయం కోసం మరో బృందం కూడా రంగంలో దిగింది. ఒకేసారి కొత్త జిల్లాలతో పాటుగా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు కూడా రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ఎన్నికల హామీని పూర్తి చేసేందుకు జగన్ ప్రభుత్వం పట్టుదలతో ప్రయత్నం చేస్తోంది.
అదే సమయంలో తెలుగుదేశం నేతలు ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజనను అంగీకరించబోమని తాజాగా టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు తేల్చేశారు. అయితే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని జగన్ మూడున్నరేళ్ల క్రితమే ప్రకటించారు. 2017 ఆరంభంలోనే జగన్ చేసిన ప్రకటన చివరకు ఆయన పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఉంది. ప్రచార సభల్లో కూడా జగన్ పలుమార్లు ఈ అంశం ప్రస్తావించారు. దానికి తగ్గట్టుగానే ప్రజలు తీర్పునిచ్చారు. విజయం సాధించిన తర్వాత మ్యానిఫెస్టో అమలుకి కట్టుబడి ఉంటామని చె్ప్పిన జగన్ దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.
జిల్లాల విభజన అంశంలో పలు ప్రతిపాదనలున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటు పై కొందరికి ఆకాంక్షలున్నాయి. తమ పట్టణాన్నే జిల్లా కేంద్రం చేయాలని పట్టుబడుతూ ఇప్పటికే రోడ్డెక్కిన వారు కూడా ఉన్నారు. ఇక తాము ఫలానా జిల్లాల్లో ఉంటామని, తమ జిల్లాకు ఫలానా పేరు పెట్టాలనే ప్రతిపాదనలు కూడా పలువురు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అలాంటి వాదనలు ముందుకొస్తున్న సమయంలో ప్రభుత్వం విస్తృత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. వ్యక్తుల అభిప్రాయాలు, ఆలోచనల కన్నా సమూహం ప్రయోజనాలే మిన్నగా సర్కారు సాగాల్సి ఉంటుంది.
దానికి తగ్గట్టుగానే జగన్ ప్రభుత్వం జిల్లాల విభజనకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని బృందానికి బాధ్యత అప్పగించింది. ఆ కమిటీలో రెవెన్యూ సహా పలు కీలక శాఖల సీనియర్ అధికారులున్నారు. సీఎంవో నుంచి కూడా సభ్యులుండడంతో ఎప్పటికప్పుడు కమిటీ పనితీరుని పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ తుది అంకానికి చేరుకున్నట్టు చెప్పవచ్చు. వాస్తవానికి తాను 25 పార్లమెంట్ స్థానాలను 25 జిల్లాలుగా మార్చుతామని జగన్ ఎన్నికల ముందు ప్రకటించినప్పటికీ అరకు పార్లమెంట్ స్థానంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. క్యాబినెట్ ఆమోదం మేరకు రంగంలో దిగిన కమిటీకి కూడా 25 లేదా 26 జిల్లాలుగా రాష్ట్రాన్ని పునర్వవ్యస్థీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
తాజాగా సోషల్ మీడియాలో 32 జిల్లాల పేరుతో రకరకాల ప్రచారాలు సాగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తన ప్రకటనకు అనుగుణంగా ముందుకెళుతోంది. వచ్చే జనవరిలో కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ వంటి వారు ప్రకటనలు కూడా చేశారు. తాజాగా పలు జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటు, ఇతర ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. సీఎంఎలో కీలక అధికారి ప్రవీణ్ ప్రకాష్ కూడా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ప్రత్యక్షంగా పర్యటనలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేసి తుది నిర్ణయం త్వరలోనే వెలువడబోతోంది. ఏపీలో కొత్త జిల్లాలు మాత్రం 26కి మించే అవకాశం కనిపించడం లేదని అధికారిక సమాచారం.