iDreamPost
android-app
ios-app

టీడీపీ జిల్లా సమావేశం.. నియోజకవర్గ ఇంఛార్జిలందరూ ఎందుకు డుమ్మా కొట్టారు..?

టీడీపీ జిల్లా సమావేశం.. నియోజకవర్గ ఇంఛార్జిలందరూ ఎందుకు డుమ్మా కొట్టారు..?

చతికిలపడిన పార్టీని పైకి లేపేందుకు టీడీపీ అధినేత చేస్తున్న మైండ్‌ గేమ్‌ ప్రయత్నాలకు నియోజకవర్గ ఇంఛార్జిలు దెబ్బకొడుతున్నారు. లోకేష్‌ తీరుతో పార్టీ పుంజుకుందని టీడీపీ సోషల్‌ మీడియా ప్రచారం ఒకవైపు, రెండేళ్లలోనే పార్టీని బాబు నిలబెట్టుకున్నారని అనుకూల పత్రికల్లో వార్తలు రాయిస్తూ ఏవో తంటాలు పడుతున్న చంద్రబాబుకు తమ్ముళ్ల నుంచి ఏ మాత్రం సహకారం రావడం లేదు. పైగా తన ప్రయత్నాలను దెబ్బతీసే వ్యవహరిస్తుండడంతో చంద్రబాబు విలవిలలాడుతున్నారు. ప్రకాశం జిల్లాలో నియోజకవర్గ ఇంఛార్జిలు వ్యవహరించిన తీరు ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశమవుతోంది.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడే.. పార్టీ లేదు.. తొక్కలేదని అన్న మాటలను వంటబట్టించుకున్నారేమో ఏమోగానీ ప్రకాశం జిల్లా నియోజకవర్గ ఇంఛార్జిలు పార్టీ నిర్వహించిన సమావేశాన్ని లైట్‌ తీసుకున్నారు. పార్లమెంట్‌ జిల్లా వారీగా కమిటీలు వేసిన తర్వాత నిర్వహించిన సమావేశానికి ఒక్క ఇంఛార్జి కూడా హాజరుకపోవడం ప్రకాశం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతోంది. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యనిర్వాహకవర్గ సమావేశాన్ని పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వివిధ విభాగాల నేతలకు, నియోజకవర్గ ఇంఛార్జిలకు ఆహ్వానాలు అందాయి.

ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలో ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. పార్టీ వివిధ విభాగాల నేతలు కొంత మంది వచ్చారు. నియోజకవర్గ ఇంఛార్జిలు రాగానే సమావేశాన్ని ప్రారంభిద్దామని అధ్యక్షుడు ఎదురుచూస్తున్నారు. సమయం గడుస్తోంది.. గడయారంలో గంటల ముల్లు మారుతోంది. ఒకరిద్దరి ఇంఛార్జిలు వచ్చినా చాలు.. సమావేశం మొదలుపెడదామని అధ్యక్షుడు నూకసాని బాలాజీ ఆశిస్తున్నారు. మరో గంట గడిచింది. అయినా ఒక్కరంటే ఒక్క ఇంఛార్జి సమావేశానికి రాలేదు. ఇక అధ్యక్షుడే సమావేశాన్ని మమ అనిపించేశారు.

ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలైన ఒంగోలు ఇంఛార్జిగా మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, కొండపికి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి, దర్శికి పమిడి రమేష్‌ , కనిగిరికి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, గిద్దలూరుకు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి, యర్రగొండపాలెంకు గూడూరి ఎరిక్షన్‌ బాబు, మార్కాపురానికి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిలు ఇంఛార్జిలుగా వ్యవహరిస్తున్నారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడుగా పని చేసిన దామచర్ల జనార్థన్‌ కూడా హాజరుకాకపోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. సీనియర్ల ఇలా ఉన్నారనుకుంటే.. తొలిసారి నియోజకవర్గ ఇంఛార్జి అయిన గూడూరి ఎరిక్షన్‌బాబు కూడా సమావేశానికి డుమ్మా కొట్టడం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. నేతలు ఈ తీరున వ్యవహరించడం టీడీపీ క్యాడర్‌కు మింగుడుపడడం లేదు.

Also Read : దర్శిలో పావులు కదుపుతున్న బూచేపల్లి.. రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా..?