iDreamPost
android-app
ios-app

పంచాయ‌తీ పోరు ఎలా ఉండ‌బోతోంది…!

పంచాయ‌తీ పోరు ఎలా ఉండ‌బోతోంది…!

ఏపీలో పంచాయ‌తీ పోరుకు రంగం సిద్ధ‌మైంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నిక‌లు జ‌రుగుతాయా..? లేదా..? అన్న హైడ్రామాకు తెర‌ప‌డ‌డంతో పార్టీల‌న్నీ హోరాహోరీకి సిద్ధ‌మ‌వుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల త‌ర్వాత రెండేళ్ళు తిరగకుండానే మరో రాజకీయ సమరానికి రాజకీయ పార్టీల‌న్నీ సిద్ధ‌మవుతున్నాయి. ఈసారి పోటీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మార‌నుంది. వాస్త‌వానికి పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు, పార్టీలకు అతీతం. కానీ అందుకు విరుద్ధంగానే ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం సాధార‌ణంగా మారింది. పార్టీల ప్ర‌మేయం త‌ప్ప‌నిస‌రిగా ఉంటోంది. అయితే అభ్యర్థుల‌కు వెనక నుంచి సపోర్ట్ చేస్తాయి. కాగా, ఇప్పుడు రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఒక్కో జిల్లాలోనూ నాలుగు విడ‌త‌లుగా ఎన్నిక‌లు జ‌రుగుతాయి.

రాష్ట్రంలో 68 రెవెన్యూ డివిజన్లలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు విడతల్లో కలిపి 659 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 14 రెవెన్యూ డివిజన్లలో 146 మండలాల్లో, రెండో విడతలో 17 రెవెన్యూ డివిజన్లలోని 173 మండలాల్లో, మూడో విడతలో 18 రెవెన్యూ డివిజన్లలోని 169మండలాల్లో, నాలుగో విడతలో భాగంగా 19 రెవెన్యూ డివిజన్లలోని 171మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. పరిపాలనాపరమైన, న్యాయపరమైన వివాదాల కారణంగా 17 మండలాల్లో ఈసారి ఎన్నికలు నిర్వహించడం లేదు. అదే విధంగా విజయనగరం జిల్లాలో మూడో విడతలో, ప్రకాశం జిల్లాలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమవుతాయి.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ 1995, 2001, 2007-08, 2013-14 సంవ‌త్స‌రాల‌లో నాలుగు సార్లు స్థానిక ఎన్నిక‌లను ఎస్ ఈసీ నిర్వ‌హించింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత పంచాయతీ, మున్సిప‌ల్, జిల్లా- మండ‌ల ప‌రిష‌త్ పాల‌క‌వ‌ర్గాల‌కు 2018లోనే గ‌డువు ముగిసింది. అయినా, ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ వివిధ కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. గ‌తేడాది మార్చిలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రంగం సిద్ధమైంది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌మైంది. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు ముగిసిన త‌ర్వాత ప‌రిశీలిస్తే ఏపీలో 125 మండ‌లాల్లో జెడ్పీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు ఏక‌గ్రీవం అయిన‌ట్టు ప్ర‌క‌టించారు. 652 జెడ్పీటీసీ స్థానాల‌కు గానూ సుమారు నాలుగో వంతు సీట్లు ఏక‌గ్రీవం కావ‌డం విశేషంగా మారింది. ఇక ఎంపీటీసీల‌లో కూడా సుమారు 2080 స్థానాల్లో ఏక‌గ్రీవం జ‌రిగాయి. వాటితో పాటుగా మున్సిపల్ వార్డుల్లో కూడా 159 చోట్ల ఏక‌గ్రీవం అయిపోయాయి. వాటిలో అత్య‌ధికంగా పులివెందుల‌, మాచ‌ర్ల వంటి చోట్ల ఉన్నాయి. ఈ క్ర‌మంలో హ‌ఠాత్తుగా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ క‌రోనా పేరు చెప్పి ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఏడాది వ‌ర‌కూ దానిపై ఆ వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో చెక్ ప‌డి ఎన్నిక‌ల‌కు మార్గం సుగ‌మ‌మైంది.

ఏపీలో 2013 స్థానిక ఎన్నికలను ఒకసారి గుర్తు చేసుకుంటే నాడు టీడీపీ, వైసీపీ రెండూ విపక్షంలోనే ఉన్నాయి. కానీ పెద్ద ఎత్తున పంచాయతీలను టీడీపీ గెలుచుకుంది. దానికి ప్రధాన కారణం అప్ప‌ట్లో టీడీపీకి క్షేత్ర స్థాయిలో మంచి బలం ఉంది. ఇపుడు ఆ ప‌రిస్థితి లేదు. 2019లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో చారిత్ర‌క పంథా అవ‌లంబిస్తున్నారు. ఫ‌లితంగా గ్రామాల్లో కూడా వైసీపీకి ప‌ట్టు పెరిగింది. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా ఆ పార్టీ స‌పోర్ట్ చేసే అభ్య‌ర్థుల‌దే విజ‌య‌మ‌న్నట్లుగా మారింది. తెలుగుదేశం నేత‌లు మాత్రం సుప్రీం తీర్పు ముందు వ‌ర‌కూ ఎన్నిక‌లంటే వైసీపీకి భ‌య‌మ‌ని చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేసింది.

సుప్రీం తీర్పును గౌర‌విస్తూ పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్ప‌టికే స్పష్టం చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యానే ఎన్నికలు వాయిదా వేయాలని కోరామన్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. వైఎస్సార్‌సీపీకి ఎన్నికలు కొత్తకాదని, పంచాయతీ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగిస్తుందని తెలిపారు. మ‌రోవైపు.. కోల్పోయిన ప‌ట్టు సాధించేందుకు తెలుగుదేశం ఈ ఎన్నిక‌ల‌ను అనువుగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఎన్నిక‌ల‌య్యే వ‌ర‌కూ నిద్రపోకుండా మెజార్టీ స్థానాల‌ను కైవ‌సం చేసుకోవాల‌ని ఆ పార్టీ అధినేత‌ చంద్ర‌బాబునాయుడు శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండ‌గా.. భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన కూట‌మి కూడా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటి భ‌విష్య‌త్ కు రాజ‌కీయ బాట వేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో పంచాయ‌తీ పోరు ఎలా ఉండ‌బోతుంద‌న్న ఆస‌క్తి అంత‌టా ఏర్ప‌డింది.