iDreamPost
iDreamPost
కమెడియన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన ఆలీకి మరో అవకాశం ఖాయమయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత నుంచి ఆశీస్సులు లభించడంతో ఆలీ ఆనందంగా కనిపిస్తున్నారు. అమరావతి వచ్చి సీఎం జగన్ తో వారం వ్యవధిలో రెండోసారి భేటీ అయిన ఆలీకి వక్ఫ్ బోర్డు గానీ మైనారిటీ కమిషన్ లో గానీ పదవి దక్కుతుందనే ప్రచారం సాగింది. అయితే ఆయనకు రాజ్యసభ సీటు దక్కనున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో ఈ జూన్ నెలాఖరుతో నలుగురు ఎంపీలకు పదవీకాలం ముగుస్తోంది. అందులో టీడీపీ తరుపున గెలిచి బీజేపీలో చేరిన నేతలిద్దరున్నారు. సీఎం రమేష్, టీజీ వెంకటేష్ త్వరలోనే మాజీలు కాబోతున్నారు. వారితో పాటుగా ఏపీ నుంచి అవకాశం దక్కించుకున్న సురేష్ ప్రభుకి కూడా గడువు ముగుస్తోంది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ విభాగం నేత వి విజయసాయిరెడ్డి కి కూడా పదవీకాలం ముగుస్తోంది. ఈ తరుణంలో ఈ నాలుగు సీట్లు వైసీపీ ఖాతాలో చేరబోతున్నాయి.
ఇప్పటికే 2020లో కూడా నాలుగు సీట్లు వైఎస్సార్సీపీకి దక్కాయి. అప్పట్లో కూడా అనూహ్యంగా ఇద్దరు బీసీలకు (పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకట రమణ) అవకాశం ఇచ్చి ఆ సామాజిక వర్గాలకు తొలిసారి రాజ్యసభలో ప్రాతినిథ్యం వహించే అవకాశం జగన్ ఇచ్చాడు.
ఈసారి మాత్రం నాలుగుసీట్లలో ఒకటి విజయసాయిరెడ్డికి రెన్యువల్ ఖాయంగా చెప్పవచ్చు. మిగిలిన మూడు స్థానాల్లో మైనార్టీ నేతగా ఆలీకి ఒకటి కట్టబెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి ఆలీకి 1996 నుంచి రాజకీయాలతో అనుబంధం ఉంది.చంద్రబాబు సీఎం అయిన తరువాత పలు ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేశారు.ఒకదశలో నరసరావుపేట ఎంపీ లేదా సత్తెనపల్లి ఎమ్మెల్యే సీట్ వస్తుందన్న ప్రచారం జరిగింది.తొలి రోజుల్లో సినిమా కెరీర్ ముఖ్యం అనుకున్న ఆలీ 2014 ఎన్నికల నుంచి రాజకీయ అవకాశాల కోసం గట్టి ప్రయత్నం చేసినా చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు.
మరోవైపు పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర ఉన్నా కూడా ప్రజారాజ్యం, జనసేన రాజకీయాలకు ఆలీ దూరంగా ఉన్నారు. ఆయన గడిచిన ఎన్నికలకు ముందు వైసిపి లో చేరి ప్రచారం చేశాడు. ప్రతిఫలంగా ఇప్పుడు రాజ్యసభ స్థానం ఆయన దక్కించుకోబోతున్నట్టు చెబుతున్నారు.
మిగిలిన రెండు స్థానాల్లో దేశంలోనే ప్రముఖ కార్పోరేట్ సంస్థ ప్రతినిధికి ఒకటి కేటాయించే అవకాశం ఉందని సమాచారం. మిగిలిన స్థానంలో ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ కి గానీ, ఎస్టీ మహిళా నేతకు గానీ అవకాశం ఉంటుందని అంచనా. దాంతో మొత్తంగా మరోసారి పదవుల పంపిణీలో జగన్ తనదైన పంథా అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. మైనార్టీలు సహా సామాన్యులకు పెద్దపీట వేసే ధోరణి కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read : ఆలీని జగన్ అందుకే రమ్మన్నారా?