iDreamPost
iDreamPost
మండపేట కు చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు బుధవారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. మండపేట రాజకీయాల్లో తనదైన శైలిలో గుర్తింపు పొందారు. మండపేట ను సర్దార్ వేగుళ్ళ వీర్రాజు ఏకఛత్రాధిపత్యం గా ఏలుతున్న సమయం లో వల్లూరి నారాయణరావు ఆయన తో ఢీ కొట్టారు.1981 లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో వేగుళ్ళ వీర్రాజు ఫ్యానల్ కు వ్యతిరేకంగా వల్లూరి నారాయణ రావు అన్ని వార్డుల్లో తమ ప్యానల్ తో పోటీపడ్డారు. హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి.
సర్దార్ వేగుళ్ళ వీర్రాజు ఫ్యానల్ గెలుపొందగా నారాయణ రావు ప్రత్యామ్నాయ శక్తి గా ఎదిగారు.పేద మధ్యతరగతి వర్గానికి నాయకత్వం వహించారు. సాదా సీదాగా సైకిల్ పై వార్డుల్లో తిరిగి ప్రజల మన్ననలు పొందేవారు. అదే సమయంలోఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన వెంటనే ఆ పార్టీ లో నారాయణరావు చేరారు.1983 లో అప్పటి ఆలమూరు నియోజకవర్గ టీడీపీ టికెట్ ఎన్టీఆర్ ఆయన కు ఇచ్చారు. మాజీ మంత్రి సంగీత వెంకట రెడ్డి (చిన కాపు) కాంగ్రెస్ నుండి పోటీ పడగా నారాయణ రావు గెలుపొంది తొలి సారి శాసనసభ లో అడుగుపెట్టారు.
1984 సంక్షోభం లో ఎన్టీఆర్ వెన్నంటి వున్నారు. 1985 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి టిడిపి అభ్యర్థి గా నారాయణ రావు బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్ధి వాలిన సూర్యభాస్కరరావు పై విజయం సాధించారు. 1989 లో టీడీపీ అభ్యర్థి గా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సంగీత చేతిలో ఓడిపోయారు. అనంతరం 1994 లో టీడీపీ టికెట్ వివి ఎస్ ఎస్ చౌదరి కి ఇవ్వగా నారాయణరావు ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుండి సంగీత వెంకట రెడ్డి పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో చౌదరి విజయం సాధించారు. 2005 లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో నారాయణ రావు కోడలు వల్లూరి విమలకుమారి చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.
1994 లో కొంతకాలం పార్టీ ని వీడినా ఆయన టీడీపీ లోనే చివరి వరకు కొనసాగారు.2009, 2014, 2019 ఎన్నికల్లో మండపేట టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు కు కుడి భుజం గా మారి ఆయన విజయానికి కృషి చేసారు.పార్టీ పట్ల నిబద్ధత గల నేత గా పేరు గడించారు. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు నాయకుడిగా గుర్తింపు పొందారు.ఆయన తండ్రి దివంగత వల్లూరి రామస్వామి(బోజ్జియ్య) వారసత్వాన్ని పుణికి తెచ్చుకొని నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి పనిచేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన మృతి సమాచారం అందుకున్న ప్రజలు, పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు మండపేట వల్లూరి వారి వీధి లోని ఆయన స్వగృనికి చేరుకొని నివాళులర్పించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు.