iDreamPost
iDreamPost
అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోగా కాళిదాస్ తో పరిచయమై ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్లు లేకపోయినా గత ఏడాది చిలసౌతో డీసెంట్ హిట్ అందుకున్న సుశాంత్ ఆ తర్వాత కొత్త సినిమా కోసం చాలా టైం తీసుకున్నాడు. ఈలోగా త్రివిక్రమ్ బన్నీల కాంబినేషన్ లో సినిమా అనగానే ఇంకో ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాడు. పేపర్ మీద కథగా చదువుకుంటే సుశాంత్ ది కీలకమైన పాత్రే. అల్లు అర్జున్ స్థానంలో తాను గొప్పింటి బిడ్డగా పెరుగుతాడు. అందరిలో ఏమి చేతకానివాడిగా మాటలు పడుతూ ప్రీ క్లైమాక్స్ లో నోరు విప్పుతాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ నిజానికి సుశాంత్ కు సినిమా మొత్తం మీద ఒక్క పేజీ డైలాగులు కూడా లేవు. సీన్లు కూడా పరిమితమే. అలాంటప్పుడు ఎందుకు ఒప్పుకున్నాడనే అనుమానం రావడం సహజమే. బహుశా స్క్రిప్ట్ వినేటప్పుడు ఎక్కువ చెప్పారో లేదో కానీ మొత్తానికి అల వైకుంఠపురములోకి ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా అది సుశాంత్ కు ఉపయోగపడటం అనుమానమే. గతంలో త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ చేసినప్పుడు సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న ఈషారెబ్బకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. మొక్కుబడి పాత్ర దక్కింది. అఆ లో అనుపమ పరమేశ్వరన్ కొంతమేర పర్వాలేదు అనిపించుకుంది.
మాములుగా పాత్రలకు వెయిట్ ఇవ్వడంలో జాగ్రత్తలు తీసుకునే త్రివిక్రమ్ ఇప్పుడు సుశాంత్ విషయంలో ఎలాంటి ప్రత్యేకత చూపలేకపోయాడు. దానికి తోడు సినిమా అంతా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో కావడంతో ఉన్న ఒకటి రెండు సీన్లు కూడా సుశాంత్ కు పండకుండా పోయాయి. ఇటీవలే ఇక్కడ వాహనములు నిలుపరాదు అనే సినిమా మొదలుపెట్టిన సుశాంత్ మరో సాలిడ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. సినిమా హిట్ అయినా అది అల వైకుంఠపురములో మాత్రం దక్కలేదు