చైనా భారత్‌ల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ చైనాకు చెందిన పలు అప్లికేషన్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా అలా నిషేధం విధించిన అప్లికేషన్లలో బహుళ ప్రజాదరణ పొందిన టిక్ టాక్ మరియు పబ్‌జీ కూడా ఉన్నాయి. ఇటీవల 118 అప్లికేషన్లు నిషేధించిన భారత్ చైనాకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో
పబ్‌జీ లవర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. అలాంటి వారికి బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ ఒక తీపికబురు చెప్పారు.
పబ్‌జీకి బదులుగా త్వరలో మల్టీ ప్లేయర్ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు అక్షయ్ కుమార్ వెల్లడించారు. దీనికి ‘ఫౌజీ’ (ఫియర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్) అని పేరుపెట్టారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ ఉద్యమంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్లు అక్షయ్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఈ మల్టీ ప్లేయర్ గేమ్ ద్వారా వినోదం పంచడం మాత్రమే కాకుండా సైనికుల త్యాగాలను కూడా ప్రజలకు తెలియజేస్తామని,ఈ గేమ్ ద్వారా సమకూరే ఆదాయంలో 20 శాతం ‘భారత్‌కా వీర్ ట్రస్ట్’కు అందజేస్తామని అక్షయ్ కుమార్ వెల్లడించారు.
కాగా ఫౌజీ గేమ్ ను బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్ గేమ్స్ రూపొందించగా అక్షయ్ కుమార్ ఫౌజీకి మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. గేమ్ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. స్వదేశీ గేమ్ ను రూపొందుతున్న నేపథ్యంలో గేమ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేశారు.