Idream media
Idream media
మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ చిక్కుల్లో పడబోతున్నారు. రాజకీయంగా అంతంత మాత్రంగా ఉన్న ఆమె పరిస్థితి.. తెలంగాణలో నమోదైన కిడ్నాప్ కేసు వల్ల మరింత దిగజారే పరిస్థితులు నెలకొన్నాయి. ఓ భూమి వివాదంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువు, బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారులు ప్రవీణ్, ఆయన సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ఈ కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌తో సహా 30 మందిపై బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు 75 పేజీల ఛార్జిషీట్‌ను సిద్ధం చేశారు. మరో నెల రోజుల్లో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
ఈ ఏడాది జనవరి 5వ తేదీన భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌లు.. ఓ భూమి వివాదంలో ప్రవీణ్, ఆయన సోదరులను కిడ్నాప్ చేయించారు. ఐటీ అధికారులమని రాత్రి పూట ప్రవీణ్ రావు ఇంటికి వెళ్లిన అఖిల ప్రియ అనుచరులు.. వారిని తమ వెంట తీసుకెళ్లారు. నగర సివారులోని ఓ ఫాం హౌస్‌కు తీసుకెళ్లి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకుని.. నార్సింగి వద్ద వదిలిపెట్టారు. ఇంటికి చేరుకున్న ప్రవీణ్, అతని ఇద్దరు సోదరులు.. పోలీసులు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు ఈ తంతంగం అంతా నడిపించింది భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ అని తేల్చారు. అఖిల ప్రియను అరెస్ట్ చేయగా.. ఆమె భర్త చాలా కాలం పాటు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం అందరూ బెయిల్‌పై ఉన్నారు.
చిక్కులు తప్పవా..?
కిడ్నాప్ కేసులో అఖిల ప్రియకు చిక్కులు తప్పవనే చర్చ సాగుతోంది. తప్పించుకునే అవకాశం లేకుండా పోలీసులు పక్కా ఆధారాలతో ఛార్జిషీట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ సమీప బంధువునే కిడ్నాప్ చేయడం, తప్పు చేసినట్లు అంగీకరించే విధంగా ఆమె భర్త పరారీ అవడంతో.. అఖిల ప్రియ పూర్తిగా ఇరుక్కుపోయారు. కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత అఖిల ప్రియ, ఆమె భర్తకు శిక్ష తప్పదనే మాట బలంగా వినిపిస్తోంది.
బాబు మద్ధతు కరువు..
ఏపీలో టీడీపీ నేతలు, మాజీ మంత్రులపై చీటింగ్, మర్డర్, అవినీతి అభియోగాలపై కేసులు నమోదై, జైలుకు వెళ్లిన సమయంలో.. ఆయా నేతలకు మద్ధతుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అఖిల ప్రియ విషయంలో మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. అఖిలపై నమోదైన కేసు తెలంగాణాలోది కావడం, పైగా బాధితులు తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులు కావడమే ఇందుకు ప్రధాన కారణం. 2015లో ఓటుకు నోటు కేసు నమోదైనప్పటి నుంచి చంద్రబాబు.. తెలంగాణతో తనకున్న అన్ని బంధాలను వదులుకున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా.. ఆయన ఎప్పుడూ తెలంగాణ విషయాల్లో కలుగుజేసుకోలేదు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు.. ఈ తరహాలో కేసీఆర్‌తో రాజీ చేసుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఈ నేపథ్యంలో భూమా అఖిల ప్రియ విషయంలోనూ బాబు మౌనాన్ని ఆశ్రయించకతప్పలేదు.
Also Read : Former Minister Kuthuhalamma – చంద్రబాబుకు షాక్ .. సొంత జిల్లాలో టీడీపీకి మాజీమంత్రి రాజీనామా