iDreamPost
android-app
ios-app

ఇతర కాలుష్యాల మాటేంటి..?

  • Published Nov 09, 2020 | 1:23 PM Updated Updated Nov 09, 2020 | 1:23 PM
ఇతర కాలుష్యాల మాటేంటి..?

వాయు కాలుష్యం విషయంలో ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం మంది ప్రజలు సాధారణ కాలుష్యం కంటే ఎక్కువగా ఉన్న గాలినే పీలుస్తున్నారని ఒక అంచనా. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) ప్రచారం 60 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే వాయి నాణ్యత అత్యంత దారుణంగా ఉందని లెక్కిస్తారు. మన దేశం విషయానికొస్తే దాదాపు అన్ని పట్టణాల్లో ఏక్యూఐ నిర్ణీత పాయింట్లకంటే అత్యంత ఎక్కువగా ఉంటుందని నిపుణులు తేల్చేస్తున్నారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 240 పాయింట్లకు కూడా చేరిపోయి, ప్రజలు ఇళ్ళ నుంచి బైటకు రాలేని పరిస్థితులు నెలకోవడం కూడా మనకు పరిచయమే.

ఇందుకు ప్రధాన కారణంగా వాహన, పరిశ్రమలు, చెత్తన, పంట వ్యర్ధాలను తగలబెట్టడం, ప్లాస్టిక్‌ దహనం.. ఇలా అనేక కారణాలుంటున్నాయి. అయితే వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నాయని నిపుణులు కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఏ పర్యావరణ దినోత్సవం రోజునే వీటి గురించి మాట్లాడడం తప్పితే, పకడ్భంధీ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు. కాలపరిమితి మించిపోయిన వాహనాలను రోడ్లమీద తిరగనీయకుండా చర్యలు తీసుకునేందుకు అప్పుడెప్పుడో నిర్ణయించారు.

అయితే ఇదిప్పుడు ఏ స్టేజ్‌లో ఉందన్నది ఎవ్వరికీ అంతుబట్టని విషయంగా మారిపోయింది. అంతే కాకుండా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం విషయంలో నియంత్రణలు కరువైపోయాయని జనం ఆరోపిస్తున్నారు. వాయు సంబంధిత కాలుష్యం కారణంగా ఏర్పడే వ్యాధుల వల్ల దాదాపు ఏడు మిలియన్‌ల ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా చనిపోయేందుకు ఆస్కారం ఉంటుందని సంబంధిత రంగంలోని పరిశోధకులు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇంత ఆందోళన కరంగా ఉంటున్నప్పటికీ నియంత్రణ చర్యలపై చిత్తశుద్ది కరువైపోతోందన్న వాదన విన్పిస్తోంది.

ఇదిలా ఉండగా దీపావళి కారణంగా కాలుష్యం పెరిగిపోతుందని, కరోనా రోగులకు ఇబ్బంది కరమన్న ప్రచారం ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియా వేదికగా జోరందుకుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా తమ రాష్ట్రంలో దీపావళిని నిషేధిస్తున్నట్లు ప్రకటనలు కూడా చేసేసాయి. అదే సమయంలో ఈ వాదనను వ్యతిరేకించే వర్గం కూడా తన మెస్సేజ్‌ల జోరుపెంచేసింది. ఇప్పటికే ఉన్న కాలుష్యం నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, కేవలం దీపావళినే టార్గెట్‌ చేసే విధంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు.

నిజానికి సంప్రదాయకంగా తయారు చేసే దీపావళి సామాగ్రి కారణంగా పెద్దగా నష్టం ఉండదనేది ఈ వర్గం వారి అభిప్రాయంగా ఉంది. కానీ విదేశాల నుంచి దిగుమతి అవుతున్న కొన్ని ప్రమాదకర రసాయనాలు వినియోగించిన టపాసులే కాలుష్యానికి అతిపెద్ద కారకాలుగా ఉంటున్నాయంటున్నారు. అసలు సమస్యపై దృష్టి పెట్టకుండా దీపావళినే నిషేధించడం సరికాదంటున్నారు.

కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే దీపావళి కాలుష్యానికి ఒక విధంగాను, ఇతర కాలుష్యాలకు మరో విధంగాను స్పందిస్తున్న వారి కారణంగానే సోషల్‌ మీడియాలో ఉద్రిక్త పోస్టులకు దారితీస్తోంది. పర్యావరణానికి ఇబ్బంది కలిగించే ఎటువంటి చర్యనైనా కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇది అన్ని వేళలా, అందరి పట్ల ఒకే విధంగా ఉంటే పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చన్నది పలువురు తటస్థ నెటిజన్ల అభిప్రాయంగా చెబుతున్నారు.