Idream media
Idream media
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎవరో తేలిపోనుందా? ప్రకటన వెలువడే సమయం ఆసన్నమైందా? అంటే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తుంది. ఆ పీఠం కోసం పోటీపడుతున్న వారందరూ అక్కడే మకాం వేశారు. చివరి క్షణం వరకూ ఎవరి స్థాయిలో వారు పైరవీలు చేస్తూనే ఉన్నారు. ఈ హడావిడి అంతా చూస్తే టీపీసీసీ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయనే ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమయ్యేలా కనిపిస్తోంది. దాదాపు ఏడాది కాలంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న టీపీసీసీ చీఫ్ ఎంపిక కసరత్తు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది.
అందరూ ఢిల్లీలోనే
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న సమాచారంతో ఆశావహ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు హస్తినలో పైరవీల పనిలో బిజీ బిజీగా ఉన్నారు. వీరిలో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, మధు యాష్కీ, భట్టి విక్రమార్క, ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అయితే రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. అటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలో ఉన్నారు. వీరంతా పీసీసీ చీఫ్ కోసం పోటా పోటీ లాబీయింగ్ చేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ దాదాపు ఖరారు చేశారని.. అనే హామీతో ఓ నేత ఫ్యామిలీ సహా ఢిల్లీకి పయనమయ్యారని సమాచారం.
తుది దశకు కసరత్తు
ఎన్నో రోజులుగా టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రకటన పెండింగ్ పడుతూ వస్తోంది. హై కమాండ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడించకపోతుండడంతో నేతలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. తమను ఎంపిక చేయాలంటూ.. లాబీయింగ్ కూడా చేపట్టారు. ఎవరికి వారే.. ప్రకటనలిస్తూ గందరగోళానికి తెరతీశారు. పార్టీ హైకమాండ్ ఎవరి పేరూ ప్రకటించకముందే పీసీసీ తమదంటే తమదేనని ఎవరికి వారు ప్రకటనలు ఇచ్చేశారుకూడా. ఢిల్లీలో మకాం వేసిన టీకాంగ్రెస్ నేతలు రాష్ట్ర పార్టీ చీఫ్ మాణిక్కం ఠాగూర్‌తో మంతనాలు జరుపుతున్నారు. సోమవారం టీపీసీసీ కొత్త చీఫ్ ప్రకటన వెలువడే అవకాశం దాదాపు కనిపిస్తోంది. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ తుది కసరత్తు చేస్తోంది.
మాణిక్కం ఠాగూర్ కు అధిష్ఠానం పిలుపు
అధిష్టానం ఆదేశాల మేరకు తమిళనాడులో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్ శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఇతర ముఖ్య నేతలతో తుది విడత సంప్రదింపులు జరిపి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని తేల్చేందుకు కసరత్తు చేస్తున్నారు మణిక్కం. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం రేవంత్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రేవంత్‌కు పీసీసీ ఇచ్చే పక్షంలో మిగతా నాయకులకు ఏఐసీసీలో కీలక పదవులిచ్చి శాంతిపచేసే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉంది.
Also Read : కేంద్ర కేబినెట్ విస్తరణ : ఏపీ నుంచి ప్రాతినిధ్యం ఉంటుందా?