iDreamPost
android-app
ios-app

అన్నాడీఎంకే, బీజేపీ కటీఫ్ -మున్సిపల్ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ

  • Published Feb 01, 2022 | 1:15 PM Updated Updated Mar 11, 2022 | 10:20 PM
అన్నాడీఎంకే, బీజేపీ కటీఫ్  -మున్సిపల్ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ

ఎన్డీయే భాగస్వాములుగా ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు పెటాకులైంది. తమిళనాడు రాష్ట్రం వరకు ఎవరిదారి వారిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చర్చలు విఫలం కావడంతో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు అన్నామలై వెల్లడించారు. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే, బీజేపీ మధ్య మైత్రి ఏర్పడింది. గత ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల నుంచి విభేదాలు మొదలై మున్సిపల్ ఎన్నికల నాటికి తెగదెంపులకు దారితీశాయి. అయితే రాష్ట్రం వరకే వేరుపడ్డామని, జాతీయ స్థాయిలో అన్నాడీఎంకే ఎన్డీయే భాగస్వామిగా కొనసాగుతుందని అన్నామలై వివరించడం విశేషం.

కుదరని సీట్ల సర్దుబాటు

రాష్ట్రంలో ఈ నెల 19న నగరపాలక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు అన్నాడీఎంకే, బీజేపీల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. చివరికి అన్నాడీఎంకే సమన్వయకర్తలు పన్నీరు సెల్వం, పళనిస్వామిలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆన్నామలై సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో బీజేపీ పెద్ద పార్టీగా ఎదిగినందున 30 శాతం సీట్లు ఇవ్వాలని తొలుత అన్నామలై కోరారు.

అయితే 5 శాతం ఇవ్వడానికి అన్నాడీఎంకే ముందుకొచ్చింది. చర్చల్లో బీజేపీ క్రమంగా 18 శాతానికి దిగిరాగా.. అన్నాడీఎంకే 8 శాతం వరకు వచ్చి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తర్వాత 11 శాతం సీట్లు ఇస్తామని అన్నాడీఎంకే నేతలు కబురు పంపగా 18 శాతం నుంచి తగ్గేది లేదని బీజేపీ స్పష్టం చేసింది. ఈ ప్రతిష్టంభన కొనసాగుతుండగానే అన్నాడీఎంకే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించడంతో బీజేపీ నేతలు అవాక్కయ్యారు. దానికి తోడు చర్చలకు ఆస్కారం లేకుండా పళనిస్వామి సేలం వెళ్లిపోయారు. సోమవారం రోజంతా ఎదురుచూసిన అన్నాడీఎంకే నుంచి చర్చలకు పిలుపురాలేదు. దాంతో అన్నామలై తమ పార్టీ నేతలతో సమావేశమై ఒంటరి పోరుకు సిద్ధం అయ్యారు. ఇరుపార్టీల మధ్య పొత్తు చెడినట్లు ప్రకటించారు.

పంచాయతీ ఎన్నికల నుంచే పెరిగిన దూరం

ఇరు పార్టీల మధ్య ఇటీవలి పంచాయతీ ఎన్నికల నుంచే విభేదాలు మొదలై దూరం పెరుగుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని నాలుగు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బీజేపీ తొలిసారి తమిళ అసెంబ్లీలో ప్రాతినిథ్యం సంపాదించింది. ఆ ఉత్సాహంతో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఖాతరు చేయకుండా ఏకపక్షంగా పలు చోట్ల పోటీ చేసి దెబ్బతింది. అదే కాకుండా అసెంబ్లీలో అన్నాడీఎంకేతో ఎడమోహం పెడమోహంగా వ్యవహరిస్తోంది. ఈ పరిణామాలన్నీ రెండు పార్టీల మధ్య దూరం పెంచాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరకపోవడం పొత్తు విచ్ఛిన్నానికి దారితీసింది.