Idream media
Idream media
వందకు కొట్టు.. ఇదీ ఇప్పటి వరకు పెట్రోల్ బంకుల వద్ద వాహనాదరుల నుంచి వినిపించే మాట. పెట్రోల్ ధర 70, 80, 90 రూపాయలున్నప్పుడు లీటర్ కాకుండా.. వంద రూపాయలకు పెట్రోల్ పోయించుకునే వాహనాదారులకు ఇకపై ఆ అవకాశం ఉండబోదు. ఎందుకంటే పెట్రోల్ ధర ఇకపై వంద రూపాయలు దాటబోతోంది. ఈ రోజు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పెట్రోలియం ఉత్పత్తులపై వ్యవసాయ సెస్‌ను విధిస్తున్న ప్రకటించారు. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉన్నా.. వ్యయసాయ సెస్ పెట్రోల్‌పై 2.50 రూపాయలు, డీజిల్‌పై 4 రూపాయలు చొప్పున ఇకపై వడ్డించబోతున్నారు.
ఇక సెంచరీ పైనే..
పెట్రోల్, డీజిళ్ల ధరలను గతంలో కేంద్ర ప్రభుత్వం పెంచేది. ఏడాదిలో రెండు, మూడు సార్లు మాత్రమే ధరలు పెరిగేవి. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానానికి స్వస్తి పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిసమురు ధరలను బట్టీ ఏ రోజుకారోజు పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించుకునే అధికారాన్ని చమురు సంస్థలకు కట్టబెట్టింది. దీంతో ప్రస్తుతం ప్రతి రోజు ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రీమియం పెట్రోల్ రాజస్థాన్‌లో 100 రూపాయలను దాటింది. తాజాగా వ్యవసాయ సెస్ విధించడంతో సాధారణ రకం పెట్రోల్ కూడా వంద మార్క్‌ను దాటడం ఖాయమైంది.
దేనికి ఖర్చు పెడతారు..?
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయం పేరు చెప్పి పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న సెస్.. తిరిగి వ్యవసాయానికే ఖర్చు పెడతారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కరోనా పేరు చెప్పి పారిశ్రామిక రంగానికి రాయితీలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. అదే సమయంలో వ్యవసాయానికి మాత్రం కోతలు పెట్టింది. కరోనా వల్ల ఆదాయం తగ్గిందని చెబుతూ.. ఎరువులపై ఇచ్చే సబ్సిడీ మొత్తంలో 22 వేల కోట్ల రూపాయలకు కోత వేసింది. పంట రుణాలపై ఇచ్చే 3 శాతం వడ్డీ రాయితీని గత ఏడాది అక్టోబర్‌లో ఎత్తి వేసింది. ఇప్పుడు రవాణా వాహనాలకు, వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు వాడే డీజిల్‌పై 4 రూపాయల వ్యవసాయ సెస్‌ను విధిస్తోంది. వ్యవసాయ సెస్ పేరుతో వసూలు చేసే మొత్తాన్ని వ్యవసాయానికే ఖర్చు పెడతారా..? లేదా..? అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది.
ప్రభావం విసృత్తం..
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కేవలం వాహనాదారులపైనే కాదు… యావత్ ప్రజలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పడుతుంది. పెరిగే పెట్రోల్ ధరల వల్ల.. వాహనదారులపై ప్రత్యక్షంగా బారం పడుతుంది. ప్రజా రవాణా ఛార్జీలు పెరుగుతాయి. బస్, క్యాబ్, ఆటో ఛార్జీలు పెట్రోల్ ధరలకు అనుగుణంగా మారతాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లు పడుతుంది. డీజిల్ ధరలు పెరగడం వల్ల సరుకు రవాణా చేసే లారీల యజమానులు ఛార్జీలు పెంచుతారు. పెరిగిన రవాణా ఖర్చు వల్ల.. నిత్యవసర వస్తువులు, కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. అంతిమంగా ఇది పేద, మధ్యతరగతి, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రజలందరిపై ప్రభావం చూపుతుంది.