iDreamPost
android-app
ios-app

కేరళ వెళ్తున్న ఏజెంట్ ఆత్రేయ

  • Published Sep 04, 2020 | 9:00 AM Updated Updated Sep 04, 2020 | 9:00 AM
కేరళ వెళ్తున్న ఏజెంట్ ఆత్రేయ

ఎంతసేపూ మళయాలం సినిమాలను మనం ఎగబడి కొనుక్కుని రీమేక్ చేయడమే కానీ మనవి వాళ్ళు కొనుక్కోవడం చాలా అరుదు. మహా అయితే డబ్బింగ్ చేసుకుని చూస్తారు తప్ప హక్కుల కోసం రావడం తక్కువే. అలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. నవీన్ పోలిశెట్టి హీరోగా కొత్త దర్శకుడు స్వరూప్ రూపొందించిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా సూపర్ హిట్ అందుకుంది. డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్ ని తీసుకుని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడిది కేరళలో రీమేక్ కానుంది. ‘కడవుల్ సాకయం నటన సభ’ టైటిల్ తో అక్కడా జీతూ వయల్ అనే న్యూ కమర్ దీనికి డైరక్షన్ చేయనుండటం విశేషం.

హిట్ సినిమాల రచయితగా పేరున్న బిపిన్ చంద్రన్ స్క్రిప్ట్ అందిస్తుండటం మరో ప్రత్యేకత. కొన్ని స్వల్ప మార్పులతో మన కథలోని సోల్ ని అలాగే వాడుకోబోతున్నారు. ఇందులో ఏజెంట్ గా ధ్యాన్ శ్రీనివాసన్ నటిస్తున్నాడు. మూవీలో పాత్ర పేరు సత్యనేసన్ నాడార్ గా ఫిక్స్ చేశారు. కార్తీ ఖైదీకి అద్భుతమైన సంగీతం అందించిన సామ్ సిఎస్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఇవాళ కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఉంది. గత కొన్నాళ్లలో తెలుగు నుంచి మలయాళంలో రూపొందిన రీమేకులు దాదాపుగా లేవు. మనవాళ్ళు మాత్రం పదుల సంఖ్యలో ఇబ్బడిముబ్బడిగా హక్కుల కోసం లక్షలు కోట్లు ధారపోశారు. అందుకే ఏజెంట్ ఆత్రేయ అక్కడికి వెళ్లడం మంచి పరిణామంగానే చెప్పాలి.

మర్డర్ మిస్టరీ చుట్టూ సరదాగా సాగుతూనే సీరియస్ కాన్సెప్ట్ ని డిస్కస్ చేసే ఈ ప్లాట్ అక్కడ కూడా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియాలిస్టిక్ చిత్రాలను బాగా ఆదరించే మల్లు వుడ్ లో ఇలాంటి వాటికి ఆదరణ ఖాయం. ఇదొక్కటే కాదు మరికొన్ని తెలుగు సినిమాలు ఇతర భాషల్లోకి వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. అక్కడ బాగా తీస్తున్నారు, సహజత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నారని సోషల్ మీడియాలో గొప్పలు పోకుండా ఒరిజినల్ కథలతో ప్రేక్షకులను అలరిస్తే ఆటోమేటిక్ గా ఇతర రాష్ట్రాల నుంచి రీమేక్ కోసం ఎగబడతారు. అందుకే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటివి మరికొన్ని వస్తే ఇక్కడా కంటెంట్ కు డిమాండ్ పెరిగి నిర్మాతలకు ఆదాయం కూడా మెరుగుపడుతుంది