iDreamPost
android-app
ios-app

జగన్‌.. జెట్‌ వేగం

జగన్‌.. జెట్‌ వేగం

పరిస్థితులకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు.. అంతే వేగంగా వాటి అమలు.. ఇలా సాగుతోంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ పాలన. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యమే లక్ష్యంగా సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో ప్రజల ఆరోగ్యానికే జగన్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనేందుకు ఆదివారం ప్రారంభమైన ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమమే నిదర్శనం.

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ నడుస్తోంది. మొదటి వేవ్‌లో కన్నా సెకండ్‌ వేవ్‌లో కేసులు, మరణాలు అధికంగా నమోదయ్యాయి. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టింది. జూలై 15 నాటికి కొత్త కేసుల నమోదు పూర్తిగా తగ్గుతాయనే అంచనాలున్నాయి. థర్ట్‌ వేవ్‌ కూడా వస్తుందనే హెచ్చరికలున్నాయి. ఈ దశలో చిన్నారులు ఎక్కువగా వైరస్‌ బారినపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిపుణుల హెచ్చరికల మేరకు థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ఏపీలో మూడు ప్రాంతాలలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రులను నిర్మిస్తోంది. వైరస్‌ సోకిన తర్వాత చికిత్స అందించడం కన్నా.. వైరస్‌ సోకకుండా నివారించడమే ఉత్తమం. ఈ విధానాన్నే ఏపీ ప్రభుత్వం పాటిస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారులు తమ ఆరోగ్యస్థితిని చెప్పలేరు. పిల్లలకు వారి తల్లిదండ్రుల ద్వారా మాత్రమే వైరస్‌ సోకే అవకాశం ఉంది. ఒక వేళ చిన్నారులు వైరస్‌ బారినపడితే.. వారిని చూసుకునేందుకు తల్లి అవసరం ఉంటుంది. అందుకే ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఏపీ తప్పా మరే రాష్ట్రం ఇప్పటి వరకూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు.

చిన్నారుల తల్లులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలనే నిర్ణయం సీఎం జగన్‌ మూడు రోజుల క్రితం తీసుకున్నారు. తల్లులను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. వారికి తక్షణమే వ్యాక్సిన్‌ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీల వద్ద తల్లుల సమాచారం సిద్ధంగా ఉండడంతో.. వెంటనే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జగన్‌ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రోజు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో చిన్నారుల తల్లులకు వ్యాక్సిన్‌ తొలి డోసు ఇచ్చారు. నిర్ణయం తీసుకున్న 72 గంటల్లోనే దాన్ని అమలు చేసింది జగన్‌ ప్రభుత్వం.

Also Read : కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ‌ : ఏపీ నుంచి ప్రాతినిధ్యం ఉంటుందా?