Idream media
Idream media
రాజకీయ నాయకులు వ్యవహరించే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. కొంత మంది నేతలు ఎప్పుడు..? ఎలా..? ప్రవర్తిస్తారో ఊహించలేం. తమ వ్యవహారశైలితో ఆయా నేతలు అందరినీ ఆశ్చర్యకితులను చేస్తుంటారు. ఇప్పుడు టీడీపీ నేత, ఈ నెల 12వ తేదీన మాజీ ఎమ్మెల్సీ అయిన బీద రవిచంద్ర కూడా అకస్మాత్తుగా అజ్ఞాతవాసం వీడి ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో దాదాపు ఏడాది పాటు మౌనంగా ఉన్న బీద రవిచంద్ర.. మాజీ అయిన వెంటనే మీడియా ముందుకు రావడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం విశేషం.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర.. టీడీపీ నుంచి రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆ పార్టీలో వివిధ పదవులు అలంకరించారు. గత ఏడాది ఏపీ టీడీపీ అధ్యక్షుడు రేసులోనూ నిలిచారు. అయితే ఆ పదవి వరించలేదు. జాతీయ కార్యదర్శి పదవితో సరిపెట్టుకున్నారు. చంద్రబాబు హయాంలో గవర్నర్ కోటాలో పెద్దల సభకు వెళ్లారు. 2019 సాధారణ ఎన్నికలకు ముందు ఆయన అన్న, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు టీడీపీని వీడి.. వైసీపీలో చేరినా.. తమ్ముడు రవిచంద్ర మాత్రం టీడీపీలోనే ఉన్నారు.
టీడీపీ వ్యవస్థాగత ఎన్నికల తర్వాత బీద రవిచంద్ర సైలెంట్ అయ్యారు. పదవి రాలేదనా..? లేక.. అన్నతో కలసి నడవాలనా..? కారణాలేమైనా..రవి మౌనంపై ఆసక్తికర చర్చ జరిగింది. ఇటీవల జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ రవి కనిపించలేదు. నెల్లూరు జిల్లాలోనే నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నా.. జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కూడా అయిన రవి పాత్ర ఆ ఎన్నికల్లో శూన్యం. అప్పుడే రవి రాజకీయపరమైన నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ సాగింది.
తిరుపతి బైపోల్ తర్వాత కూడా రవి కనిపించలేదు. ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసిన తర్వాత రవి టీడీపీని వీడి, అన్నతో కలసి నడుస్తారనే చర్చ ఇటీవల ఊపందుకుంది. ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసిన రెండో రోజే రవి మీడియా ముందుకు వచ్చి.. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో జగన్ సర్కార్‌పై విమర్శలు చేయడం గమనార్హం. అజ్ఞాతవాసం వీడిన రవి.. ఇక టీడీపీలో యాక్టివ్‌గా ఉంటారా..? లేక మళ్లీ సైలెంట్ అవుతారా..? వేచి చూడాలి.
Also Read : మాన్సస్ ట్రస్ట్ వివాదం.. అశోక్‌గజపతి రాజుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు