iDreamPost
android-app
ios-app

చేత‌ల్లో చూపుతున్న కేసీఆర్..!

చేత‌ల్లో చూపుతున్న కేసీఆర్..!

జీహెచ్ఎంసీ ఫ‌లితాల అనంత‌రం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం జోరు త‌గ్గుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు భావించాయి. కానీ ప్ర‌స్తుత ప‌రిణామాలు త‌ద్విరుద్ధంగా ఉన్నాయి. ఇచ్చిన హామీల‌న్నింటినీ నెర‌వేరుస్తూ కేసీఆర్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మాట‌ల్లోనే కాకుండా ఇచ్చిన హామీల‌ను చేత‌ల్లో నెర‌వేరుస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. జీహెచ్ ఎంసీలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధానంగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల అమ‌లుకు వేగంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గతంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీంతో పాటు కేసీఆర్‌ కొత్త వరాలూ ప్రకటించారు. నల్లగొండ జిల్లా పరిధిలోని రెండు ప్రధాన ఎత్తిపోతల పథకాలతో పాటు మరికొన్ని ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నియోజకవర్గంలోని హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఎత్తిపోతల పథకాల మంజూరుపై నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ నదిపై కేశవాపురం వద్ద కొండ్రపోల్‌ ఎత్తిపోతల పథకానికి రూ.75.93 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద 5875 ఎకరాలకు సాగు నీరు అందనుంది. సాగర్‌ ఎగువన ఉన్న నెల్లికల్‌ ఎత్తిపోతల పథకానికీ అనుమతినిచ్చారు. రూ.72.16 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. తద్వారా 4175 ఎకరాలు సాగులోకి రానుంది. దీంతో పాటు చిట్యాల వద్ద బల్నేపల్లి- చంప్లాతండా ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా చేపట్టనున్నారు. రూ.219.90 కోట్లతో దీన్ని చేపట్టనున్నారు. వాడపల్లి ఎత్తిపోతల పథకం రూ.229.25 కోట్లతో నిర్మాణం జరగనుంది. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్‌పీ) హైలెవెల్‌ కెనాల్‌, లో లెవెల్‌ కెనాల్‌ల పునరుద్ధరణకు రూ.2.47 కోట్లను మంజూరు చేశారు.

సిద్దిపేటలో డ‌బుల్ ఇళ్ల‌ను ప్రారంభించిన కేసీఆర్ మ‌రిన్ని కార్య‌క్ర‌మాల కోసం అడ‌క్కుండానే నిధులు మంజూరు చేశారు. రంగనాయకసాగర్ పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.80 కోట్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే సిద్దిపేట-ఇల్లంతకుంట నాలుగు లైన్ల రోడ్డు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేటకు మరో వెయ్యి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేట దేశానికే రోల్‌మోడల్‌గా ఉందన్నారు. అలాగే త్రీటౌన్ పోలీస్ స్టేషన్, బస్తీ దవాఖానా మంజూరు చేశామన్నారు.

ఇక జీహెచ్ఎంసీలోనూ అభివృద్ధి ప‌నుల్లో వేగం పెరిగింది. ఎల్బీన‌గ‌ర్ లో డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను పేద‌ల‌కు అందుబాటులోకి తెచ్చారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం బీజేపీయే స‌త్తా చాటింది. టీఆర్ఎస్ ఘోర ప‌రాజ‌యం పాలైంది. అయిన‌ప్ప‌టికీ పేద‌ల కోసం ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తామ‌నే సంకేతాల‌ను ప్ర‌భుత్వం ఇస్తోంది. వచ్చే ఏడాది తొలి వారంలోనే హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి కార్యక్రమాన్నిప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ఉచితంగా అందిస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇందుకు కావాల్సిన కార్యాచరణపైన దృష్టి పెట్టాల‌న్న ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు అధికారులు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. దాదాపు 9 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఉచితంగా తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్ర‌తి నెలా రూ. 70 కోట్ల భారం ప్ర‌భుత్వంపై ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉచిత తాగునీరు అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జ‌న‌వ‌రి నుంచే ఈ ప‌థ‌కం అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను అన్నింటినీ వీలైనంత త్వ‌ర‌గా అందుబాటులోకి తెచ్చేందుకు కూడా సీఎం కేసీఆర్ త‌గిన ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల అనంత‌రం అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో దూకుడు పెంచ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.