iDreamPost
android-app
ios-app

ఆది పురుష్ – ఆదిలోనే ఇన్ని చర్చలా?

  • Published Oct 03, 2022 | 2:16 PM Updated Updated Oct 03, 2022 | 2:16 PM
ఆది పురుష్ – ఆదిలోనే ఇన్ని చర్చలా?

నిన్న ఎంతో భారీగా అయోధ్య వేదికగా విడుదలైన ప్రభాస్ ఆది పురుష్ టీజర్ ఇరవై నాలుగు గంటలు దాటకముందే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇందులో ఎక్కువ పాజిటివ్ కంటే నెగటివ్ ఉండటమే విచారకరం. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పేరుతో యానిమేషన్ జొప్పించారని, అవి కూడా సహజంగా లేవని, కార్టూన్ నెట్వర్క్ స్థాయిలో సినిమాను తీసి అయిదు వందల కోట్ల బడ్జెట్ పేరుతో మోసం చేస్తారని నెటిజెన్లు గట్టిగానే తగులుకుంటున్నారు. నేపధ్య సంగీతం, థీమ్, కంటెంట్ గురించి కన్నా ఎక్కువగా విఎఫ్ఎక్స్ గురించే చర్చ జరుగుతోంది. అంతగా ఆది పురుష్ మీద పెట్టేసుకున్న అంచనాలు ఇబ్బంది పెట్టాయన్న మాట.

నిజానికి దర్శకుడు ఓం రౌత్ లైవ్ మోషన్ టెక్నాలజీ ఉపయోగించి నిజమైన నటీనటులతో ఆది పురుష్ తీశారనే పాయింట్ అర్థమైపోయింది. అదేదో ముందే చెప్పుంటే ఇప్పుడే ట్రోలింగ్ జరిగేది కాదు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో కొచ్చాడయన్ (తెలుగులో విక్రమసింహ)ని ఈ తరహా సాంకేతికతతోనే తీశారు కానీ సరైన క్వాలిటీ లేకపోవడం వల్ల జనం మెచ్చలేదు. ఆది పురుష్ కు ఆ సమస్య లేదు. టి సిరీస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ అండదండలు ఉన్నాయి. బడ్జెట్ విషయంలో ఎలాంటి హద్దులు లేవు. అయినా ఇలా జరగడం ఆశ్చర్యకరం. రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ గెటప్, హెయిర్ స్టైల్ మీద సైతం చాలా విమర్శలు వచ్చి పడుతున్నాయి.

ఇదంతా టీమ్ దృష్టికి వెళ్లకుండ ఉండదు. ఇప్పుడైనా మించి పోయింది లేదు. ఫైనల్ వెర్షన్ కి తుదిమెరుగులు దిద్దడానికి ముందే ఇవన్నీ వీలైనంత సరిచూసుకుంటే చిక్కులు ఉండవు. ఎందుకంటే ఎంత ప్రభాస్ ఉన్నా సరే జనం గుడ్డిగా సినిమాలు హిట్ చేయరని సాహో, రాధే శ్యామ్ లు ఋజువు చేశాయి. ఇప్పడు రాముడి సెంటిమెంట్ తో వస్తున్న ఆది పురుష్ కు అలాంటి పరిస్థితి రాకూడదు. అయినా తొంభై రోజుల్లో టాకీ పార్ట్ తీశామన్నప్పుడే కొందరికి అనుమానం కలిగిన మాట వాస్తవం. దాన్ని నిజం చేస్తూ ఇప్పుడీ టీజర్ కాస్తా ఫ్యాన్స్ లో భయానికి మొదటి కారణం అయ్యింది. 2023 సంక్రాంతి జనవరి 12 ఆది పురుష్ థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు