iDreamPost
iDreamPost
ఆలు లేదు చూలు లేదు అని అదేదో సామెత చెప్పిన తరహాలో ఇంకా షూటింగే మొదలుపెట్టని ఆది పురుష్ సినిమా మీద అప్పుడే వివాదాల మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఇటీవలే సైఫ్ అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో రావణుడి మానవీయ కోణం చూపబడుతుందని, రాముడితో ఎందుకు యుద్ధం వచ్చిందనే కారణాన్ని కూడా పాజిటివ్ గా తెరకెక్కిస్తారని ఇలా ఏదేదో తన చిత్తానికి చెప్పుకుంటూ పోయాడు. దీంతో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. బిజెపి ముఖ్యనాయకుడు ఒకరు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ విమర్శలు వచ్చి పడ్డాయి.
దీంతో జరిగిన పొరపాటుని గుర్తించిన సైఫ్ వెంటనే సారీ చెప్పేసాడు. ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించమని అడిగేశాడు. దీని వల్ల ఈ వివాదం కొంత చల్లారినట్టు ఉంది కానీ ముందు ముందు దర్శకుడు ఓం రౌత్ కి చాలా సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. రామాయణం ఇప్పటికే కొన్ని వందల సార్లు సినిమాలు సీరియల్స్ రూపంలో ప్రేక్షకులు చూశారు, చూస్తున్నారు. ప్రభాస్ ని ఏదో కొత్తగా చూపాలన్న తాపత్రయంతో లేనిపోని ప్రయోగాలు చేస్తే చాలా ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అయితే యూనిట్ అలాంటివి ఏమి ఉండవని హామీ ఇస్తోంది. సైఫ్ పూర్తి స్క్రిప్ట్ ని ఇంకా అవగాహనా చేసుకోలేదని వాళ్ళ వెర్షన్.
ఆ మధ్య ఆర్ఆర్ఆర్ కూడా ఇదే తరహా కాంట్రావర్సీని ఎదురుకున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ టీజర్ లో కొమరం భీం పాత్ర ముస్లిం టోపీ ధరించడం పట్ల చాలా కామెంట్స్ ఎదురు కోవాల్సి వచ్చింది. అయితే రాజమౌళి లైట్ తీసుకుని దాన్ని పట్టించుకోలేదు. అయితే విడుదల సమయంలో ఇలాంటివి చికాకు పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఇది ఫాంటసీ కథ అని చెబుతున్నా సరే అల్లూరి, కొమరరం భీంల బయోపిక్కులుగా చాలా మంది భావిస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్ ని మేనేజ్ చేయడం కాదు ఇలాంటి సమస్యలనూ చాలా ఎదురుకోవాల్సి ఉంటుంది. అందులోనూ రాముడి బ్యాక్ డ్రాప్ కాబట్టి ఆది పురుష్ కు ఇది కాస్త ఎక్కువగానే వచ్చేలా ఉంది.