iDreamPost
android-app
ios-app

అదే కేసీఆర్ ధైర్యమా..?

అదే కేసీఆర్ ధైర్యమా..?

38 రోజులు, 50 వేల మంది కార్మికులు, పల్లెలు, పట్టణాలు, నగరం అనే తేడా లేకుండా యావత్ తెలంగాణ ప్రజలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసేలా ఆర్టీసీ సమ్మె జరుగుతోంది. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారుల నుంచి బడా  వ్యాపారుల వరకూ, కూరలు అమ్మే వారి నుంచి కార్పొరేట్ ఆస్పత్రుల దాకా ప్రతి ఒక్కరూ, ప్రతి సంస్థ ఆర్టీసీ సమ్మె వల్ల ఆర్ధికంగా నష్టపోతోంది. ప్రతి రోజూ 50 వేల మంది కార్మికులు, రాజకీయ పార్టీలు, ప్రజా,విద్యార్థి సంఘాలు పలు రూపాల్లో రోడ్ల పైకి వస్తున్నారు. తమ ఆందోళనకు వెలుబుచ్చుతున్నారు. తమ తో చర్చలు జరపాలని ఆర్టీసీ కార్మికులు వేడుకుంటున్నారు. కార్మికులతో చర్చలు జరపాలంటూ ప్రజా, రాజకీయ నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నారు.

అయినా.. కేసీఆర్ లో ఎందుకు చలనం లేదు..? ఆర్టీసీ సమ్మె పరిస్కారం దిశగా ఎందుకు ఆలోచన చేయడం లేదు..? 50 వేల ఆర్టీసీ కార్మికులు అంటే వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 2 లక్షల మంది. ఏ రాజకీయ పార్టీ కైనా ఓట్లే ముఖ్యం, అధికారమే లక్ష్యం. అందు కోసం ప్రజలు అడగకుండానే వేల కోట్ల రూపాయల విలువైన ఎన్నో హామీలు ఇస్తారు. ఆ హామీలు అమలుకు ఎందాకైనా వెళతారు. ఇందుకు కేసీఆర్ ఏమీ మినహాయింపు కాదు. 2,016  రూపాయల చొప్పున పింఛన్లు, డబుల్ బెడ్ రూము ఇళ్లు, రైతు బంధు పధకం పేరిట అన్నదాతలకు ఆర్థిక సహాయం, వివాహ జంటలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పధకాల పేరిట నగదు ప్రోత్సహకం వంటి అనేక సంక్షేమ పధకాలు కేసీఆర్ అమలు చేస్తున్నారు. మొదటి సారి సీఎం ఐనప్పటి కన్నా రెండో దఫా సీఎం అయిన తర్వాత సీఎం కేసీఆర్ కొత్త సంక్షేమ పధకాలు అమలు చేశారు. అప్పటికే ఉన్న పధకాల పేర ఇస్తున్న మొత్తాలను పెంచారు. 

మరి ఇప్పుడు ఏమైంది..? అన్ని వర్గాల వారికి సంక్షేమ పధకాలు అందిస్తున్న కేసీఆర్ 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల పట్ల ఎందుకు ఇంత కఠిన్యం ప్రదర్శిస్తున్నారు. వారి ఓట్లు అవసరం లేదా? అంటే కావాలి. ఆర్టీసీ సమ్మె వల్ల ఇబ్బదులు పడుతున్న ప్రజల్లో వ్యతిరేకత రాదా..? అంటే వస్తుంది. మరో 15 ఏళ్ళు తానె సీఎం అంటున్న కేసీఆర్ ఇలా సమస్యను పరిష్కరించకుండా ఉంటే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు కదా..?  

మరి ఎందుకు కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారు..? అంటే రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం..  కేసీఆర్ తనకు తానే పోటీ అని, తెలంగాణాలో తనకు సరితూగగల నాయకుడు ఏ పార్టీ లోనూ లేడన్నభావన కేసీఆర్ లో నెలకొంది. పరికించి చూస్తే ఒకరకంగా ఇది నిజమేననిపిస్తుంది. టిఆర్ఎస్ కు తెలంగాణాలో పోటీ కాంగ్రెస్ పార్టీనే. గ్రామ స్థాయి లో ఆ పార్టీకి బలమైన క్యాడర్, ఓట్లు ఉన్నాయి. ఐతే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ కు సరైన నాయకుడు కరువయ్యాడు. పార్టీ ని, నేతలను, క్యాడర్ ను ఒక్క తాటి పై నడిపించే నాయకుడు లేకపోవడం తో 2014 ఎన్నికల్లోను, 2019 ఎన్నికల్లోనూ చతికిలపడింది. 

తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఐతే .. ఇచ్చింది కాంగ్రెస్ అని 2014 ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళింది. 119 సీట్లకు గాను 2014 ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి 63 సీట్లే వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 3 సీట్లే ఎక్కువ. ఈ సారి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను గెలిపించాం, వచ్చే సారి ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపిద్దాం అని తెలంగాణ సమాజం భావించింది. ఐతే కేసీఆర్ ఎత్తుల ముందు ప్రతిపక్షాలు చిత్తైపోయాయి. కేసీఆర్  ఎత్తులకు పై ఎత్తులు వేసే నాయకుడే తెలంగాణ రాజకీయ పార్టీలలో కనపడడం లేదు. కాంగ్రెస్ లో అందరూ నాయకులే అన్నట్లు గా పరిస్థితి తయారైంది. టిపిసిసి పదవి కోసం పైరవీలు జరిగాయి. అధ్యక్షులను మార్చినా కాంగ్రెస్ తల రాత మాత్రం మారలేదు. నడిపించే నాయకుడు లేకపోతె ఎలాంటి ఫలితాలు వస్తాయో 2018 ఎన్నికల్లో మరోసారి రుజువైంది. ఆ ఎన్నికల్లో టిడిపి తో కలసి పోటీచేసిన కాంగ్రెస్ కు కేవలం 19 సీట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో ఈ సంఖ్య 21. అధికార టిఆర్ఎస్ 88 సీట్లు గెలిచింది. అంతకు ముందు ఎన్నికల కన్నా 25 సీట్లు ఎక్కువ సాధించింది. 

2018 ఎన్నికల తర్వాత కూడా ప్రతిపక్షాలలో కేసీఆర్ కు పోటీనివ్వగల నాయకుడు తెలంగాణ సమాజానికి కనిపించడం లేదు. కాంగ్రెస్ లో నేతల మధ్య కుమ్ములాటలు షరా మాములే. కేసీఆర్ కు నేనే ప్రత్యామ్నాయం అనే స్థాయిలో ఏ నాయకుడు ఎదగలేదు. అందుకే కేసీఆర్ లో ఈ ధైర్యం. యావత్ తెలంగాణ లో తనకు పోటీ ఎవరు లేరని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సమయంలోనే జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి 40 వేల పై చిలుకు ఓట్ల తో టిపిసిసి అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పై గెలవడం కేసీఆర్ లో మరింత జోష్ నింపింది. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతు తెలిపిన సిపిఐ.. ఎన్నికల సమీపిస్తుండగా ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా టిఆర్ఎస్ కు తన మద్దతును ఉపసంహరించుకుంది. ఐనా ఫలితం లో మార్పు లేకపోగా.. ప్రజలు టిఆర్ఎస్ ను మినహా ఇతర పార్టీలను పట్టించుకోనట్లుగా తీర్పునిచ్చారు. 

కేసీఆర్ కు ప్రత్యామ్నాయం లేనంత వరకు తెలంగాణలో కేసీఆర్ కు ఎదురు లేకపోవచ్చు. భవిష్యత్ లో ఆర్టీసీ సమ్మె లాంటి వ్యవహారాల్లో కేసీఆర్ వైఖరి కఠినంగా ఉండే అవకాశం ఉంది. కేసీఆర్ ను ఢీ కొట్టే నాయకుడు వచ్చినప్పుడే.. పరిపాలన లో కేసీఆర్ వైఖరిలో మార్పు వస్తుంది.  ప్రత్యామ్నాయ నాయకుడు ఉన్నప్పడే ప్రజలు మార్పు గురించి ఆలోచిస్తారు.