iDreamPost
android-app
ios-app

విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకి అంతా సిద్ధం

  • Published Feb 07, 2022 | 4:58 AM Updated Updated Mar 11, 2022 | 10:19 PM
విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకి అంతా సిద్ధం

ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా నిర్ణయించిన విశాఖలో అత్యున్నత సంస్థ ఏర్పాటుకి అంతా సిద్ధమయ్యింది. అదానీ సెంటర్ ఏర్పాటు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గతంలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటు విషయంపై కొంత సందిగ్ధం ఏర్పడింది. దాంతో జగన్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు తరలిపోయిందంటూ టీడీపీ అండ్ కో విష ప్రచారం కూడా సాగింది. కానీ తాజాగా విశాఖతో పాటుగా హైదరాబాద్, నవీ ముంబై, చెన్నై, నోయిడాలలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని అదానీ సంస్థ నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా కొత్తగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.

అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎడ్జ్ కనెక్స్ యూరప్ బీవీ సంయుక్తంగా అదానీ కనెక్స్ పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఈ డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. అందులో విశాఖ నగరం ఉండడం విశేషం. ఇప్పటికే ముంబై డేటా సెంటర్ లిమిటెడ్ పేరుతో కార్యకలాపాలకు సిద్ధమయ్యారు. విశాఖలో కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఏర్పాటు జరుగుతుందని అదానీ సంస్థ తెలిపింది.

వచ్చే దశాబ్దకాలం నాటికి గిగావాట్ డేటా సామర్థ్యానికి చేరుకునేలా అభివృద్ధి చేయబోతున్నట్టు తెలిపింది. దానికి అనుగుణంగా డేటా సెంటర్ సామర్థ్యం ఉండాలనే లక్ష్యంతో ఎడ్జ్ కనెక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. అదానీ కనెక్స్ పేరుతో జాయింట్ వెంచర్ గా వీటిని ఏర్పాటు చేసేందుకు రంగంలో దిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో విపక్షం, పచ్చమీడియా తీరు మరోసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదానీ సొంతంగా ప్రతిపాదించిన డేటా సెంటర్ ఏర్పాటు జాయింట్ వెంచర్ గా మార్చుకునే క్రమంలో కొంత జాప్యం జరగడంతో ఇక అదానీ సంస్థ ఏపీని వదిలిపోయిందని, అందుకు జగన్ కారణమని నిందలు మోపింది. విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు అదానీ కనెక్స్ ఏర్పాటుకి అంతా సిద్ధమవుతున్న తరుణంలో టీడీపీ నేతలు ఏమంటారో చూడాలి. ఇప్పటికే ఏపీలో అదానీ గంగవరం,కృష్ణపట్నం పోర్టుల నిర్వహణను చూస్తున్నారు. తాజాగా డేటా సెంటర్ వ్యవహారం కొలిక్కి వస్తోంది. దాంతో ఏపీలో అదానీ కార్యకలాపాలు పెరుగుతున్న తీరుని ఇది చాటుతోంది. విపక్షాలు జీర్ణం చేసుకోలేకపోయినా రాష్ట్రాభివృద్ధిలో ఈ ప్రాజెక్టులు కీలకంగా మారే అవకాశం ఉంది.