తీరని అప్పే కొంప ముంచింది… అదానీ సొంతం కానున్న NDTV!

  • Published - 02:24 AM, Thu - 25 August 22
తీరని అప్పే కొంప ముంచింది… అదానీ సొంతం కానున్న NDTV!

NDTV అదానీ పరమైపోతోంది. అనుబంధ కంపెనీ ద్వారా NDTVలో 29.18 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. మరో 26 శాతం వాటాలు కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నట్లు తెలిపింది. దీంతో NDTVలో సగానికి పైగా వాటా అదానీ సొంతమవుతుంది. మొత్తానికి ప్రభుత్వాన్ని విమర్శించే అతి కొన్ని న్యూస్ ఛానెల్స్ లో ఒకటైన NDTV, ప్రధాన మంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరు పడ్డ అదానీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. NDTV నిర్వహిస్తున్న NDTV 24/7, NDTV ఇండియా, NDTV ప్రాఫిట్ అనే మూడు చానెల్స్ అదానీ అధీనంలోకి వచ్చి చేరతాయి. అయితే తమను సంప్రదించకుండానే ఈ ప్రకటన వెలువడినట్లు NDTV వ్యవస్థాపకులైన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ఆరోపిస్తున్నారు.

అసలేం జరిగింది?

2009లో విశ్వప్రదాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (VCPL) అనే కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ NDTV ప్రమోటర్ కంపెనీ అయిన RRPR హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి వడ్డీ లేకుండా 403.85 కోట్లు రుణం ఇచ్చింది. RRPRకి NDTVలో 29 శాతం వాటా ఉంది. అప్పు తీర్చలేకపోతే రుణాన్ని RRPRలో 99.9 శాతం వాటాగా మార్చుకోవచ్చన్న నిబంధన ఒప్పందంలో ఉంది. క్రమంగా VCPL యాజమాన్యం చేతులు మారుతూ వచ్చింది. చివరికి ఇది అదానీ గ్రూప్ కి చెందిన AMG మీడియా నెట్ వర్క్స్ లిమిటెడ్ (AMNL) కంట్రోల్ లోకి వచ్చింది. ఒప్పందం ప్రకారం అప్పును వాటాగా మార్చుకోవడంతో AMNL, NDTVలో 29.18 షేర్ దక్కించుకుంది. అంటే 13 ఏళ్ళ క్రితం ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ తీసుకున్న రుణమే ఇప్పుడు NDTV టేకోవర్ కి ప్రధాన కారణంగా మారింది.


రాయ్ లను సంప్రదించాల్సిన అవసరముందా?

ఒప్పందం ప్రకారం VCPL తన రుణాన్ని వాటాగా మార్చుకోవాలంటే ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ లను సంప్రదించాల్సిన అవసరం లేదు. కాల పరిమితి లోపైనా ఆ తర్వాతైనా అదనపు చర్యలు, ఒప్పందాలు లేకుండానే రుణాన్ని RRPRలో 99.9 శాతం వాటాగా మలుచుకోవచ్చన్న నిబంధన ఒప్పందంలో ఉన్నది. ఇప్పటికీ రాయ్ జంటకు NDTVలో 32.27 శాతం వాటా ఉంది. కానీ ఓపెన్ ఆఫర్ ప్రకటించాక NDTVలో షేర్లున్న LTS ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సహా ఐదు కంపెనీలు అదానీ గ్రూప్ కే తమ వాటాలు అమ్మే అవకాశముంది. దీంతో అదానీ వాటా 46 శాతానికి చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

అంబానీ కనెక్షన్

ఈ మొత్తం వ్యవహారానికి బీజం వేసింది అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ అనే చెప్పుకోవాలి. 2009లో ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ లకు రుణం ఇచ్చిన VCPL, ఆ రుణాన్ని షినానో రీటెయిల్ ప్రయివేట్ కంపెనీ లిమిటెడ్ నుంచి పొందింది. ఇది కూడా వడ్డీ లేని రుణమే! ఇక షినానో కంపెనీ రిలయన్స్ గ్రూప్ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ నుంచి వడ్డీ లేకుండా రుణాన్ని తీసుకుని దాన్ని VCPLకి ఇచ్చింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డుల ప్రకారం ఈ కంపెనీలన్నీ చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నవే.

Show comments