iDreamPost
android-app
ios-app

Actress Suryakantham Birth Anniversary – గ‌య్యాళి గుండ‌మ్మ జ్ఞాప‌కం

Actress Suryakantham Birth Anniversary – గ‌య్యాళి గుండ‌మ్మ జ్ఞాప‌కం

చిన్న‌ప్పుడు , బాగా చిన్న‌ప్పుడు , నిప్పు కాలుతుంద‌ని తెలుస్తున్న‌ప్పుడు మ‌నుషుల్లో చెడ్డ‌వారు ఉంటార‌ని గుర్తిస్తున్న‌ప్పుడు , కార‌ణం లేకుండా సాటి మ‌నిషిని హింసించే వాళ్లు వుంటార‌ని గ‌మ‌నిస్తున్న‌ప్పుడు, మొద‌ట క‌నిపించింది సూర్య‌కాంత‌మే. ఆమెని చూస్తేనే ఏదో భ‌యం. గుండ‌మ్మ క‌థ‌లో NTR క‌నిపిస్తే చ‌ప్ప‌ట్లు కొట్టేవాన్ని. సూర్య‌కాంతం క‌నిపిస్తే జ‌డుసుకునేవాన్ని. అంజి కామెడీ ఎంత న‌చ్చేదో గుండ‌మ్మ పొగ‌రు అణ‌చ‌డం అంత‌కంటే న‌చ్చేది. సావిత్రిని జీవిత‌మంతా క‌ష్టాలు పెట్టింది. ఆమె చెడ్డ‌ని త‌ప్ప మంచిని ఎప్పుడూ కోర‌ని సూర్య‌కాంతాన్ని క్ష‌మించిన సావిత్రి ఎంత గొప్ప‌ది. ఇంత మంచి వాళ్లు క్ష‌మాగుణం ఉన్న వాళ్ల‌ని జీవితంలో చాలా త‌క్కువ మందిని చూస్తాం.

సినిమా టైటిల్స్‌లో సూర్యకాంతం క‌న‌ప‌డ‌క‌పోతే రిలీఫ్‌. ఛాయాదేవి కూడా గొప్ప న‌టే కానీ, సూర్య‌కాంతంని రిప్లేస్ చేయ‌డం ఎవ‌రి వ‌ల్లా కాదు, ఇప్ప‌టికీ కాలేదు కూడా. సూర్య‌కాంతం ఒక వేళ మంచి పాత్ర వేసినా మ‌న‌కి ఎక్క‌డో అనుమానం. ఏదో సంద‌ర్భంలో అడ్డం తిరుగుతుంద‌ని. మాయ‌బ‌జార్‌లో మాత్రం సూర్య‌కాంతం ప్ర‌శాంతంగా క‌నిపించింది.

గ‌య్యాళి సూర్య‌కాంతాల్ని చాలా మందినే చూశాను. మాకు తెలిసిన ఒకావిడ‌, ఆమె పేరు కూడా విచిత్రంగా సూర్య‌కాంత‌మే. ఆమె ఎక్క‌డికి వ‌చ్చినా గొడ‌వ‌లు పెట్టి వెళ్లేది. బాగా స్నేహంగా ఉన్న వాళ్లు కూడా కొట్టుకు చ‌చ్చేవాళ్లు. చివ‌రికి ఆమె శుభ‌కార్యాలకి పిల‌వ‌డం కూడా మానేశారు. అయినా ఎలాగో తెలుసుకుని వ‌చ్చేది. పెళ్లిలో ఇరువ‌ర్గాల వారు ఆమె చ‌లువ వ‌ల్ల యుద్ధాలు చేసుకున్న సంద‌ర్భాలు ఎన్నో!

ఆమె బ‌తికి వుండ‌గానే , కూతురు వార‌సురాలిగా ఎదిగింది. వేధిస్తున్నాడ‌ని భ‌ర్త‌ని త‌ల్లితో క‌లిసి చావ‌బాదింది. మ‌ళ్లీ వాడు ఎవ‌రికీ క‌న‌ప‌డ‌లేదు. అహంకారం, ఆధిప‌త్యం మ‌నుషుల జీన్స్‌లోనే వుంటాయి. జాగ్ర‌త్త‌గా వెతికితే సూర్య‌కాంతం అంశ చాలా మందిలో క‌నిపిస్తుంది. మ‌న ఇంట్లో విల‌న్ల‌ని గుర్తు ప‌ట్ట‌డం క‌ష్టం. మ‌నింటి సూర్య‌కాంతం, ఛాయాదేవిల‌ని, శాంతకుమారి, అంజ‌లీదేవి అని పొర‌ప‌డుతూ వుంటాం.

గ‌య్యాళి ఆడ‌వాళ్ల వెనుక విషాదం ఉంటుంది. చిన్న వ‌య‌సులోనే భ‌ర్త చ‌నిపోయిన గుండ‌మ్మ అంత క‌రుగ్గా ఉండ‌క‌పోతే సొసైటీలో బ‌త‌క‌లేదు.

ఇప్పుడు మారిందే కానీ, ఒక‌ప్పుడు ప‌ల్లెటూర్ల‌లో ఆడ‌వాళ్లు అత్త హోదాలోకి రాగానే సూర్య‌కాంతంలా ప‌రావ‌ర్త‌నం చెందేవాళ్లు.

ఆ పేరు పెట్టుకోడానికే తెలుగు వాళ్లు భ‌య‌ప‌డే స్థితి తెచ్చిన సూర్య‌కాంతం లాంటి న‌టి ఇంకో నూరేళ్ల త‌ర్వాత కూడా పుట్ట‌దు.

(అక్టోబ‌ర్ 28 , సూర్య‌కాంత‌మ్మ పుట్టిన రోజు)