Krishna Kowshik
Krishna Kowshik
ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమలోని మహిళా సెలబ్రిటీలకు..వారి సొంత ఇంట్లోనే చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి. మొన్నటి మొన్న రజనీ కాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లో దొంగలు చొరబడిన సంగతి విదితమే. ఇంట్లో పని చేస్తున్న వ్యక్తులు బంగారం, వజ్రాభరణాలు దోచుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే సీనియర్ నటి, భరత నాట్య కళాకారిణి శోభన ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. ఆ వెంటనే మరో సీనియర్ నటి నిరోషా ఇంట్లో నగలతో పాటు ఆస్తికి సంబంధించిన పత్రాలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ ఇంటి దొంగల పనేనని పేర్కొన్నారు పోలీసులు. ఇప్పుడు ఏకంగా ఓ నటికి బెదిరించి మరీ నగలు, డబ్బులు దోచుకెళ్లారు.
బాలీవుడ్ ప్రముఖ నటి, హాట్ బ్యూటీ నికితా రావత్ కు ఇటీవల దారుణమైన అనుభవం ఎదురైంది. ఆమె ఇంట్లో పని చేస్తున్న వ్యక్తులు.. తలకు గన్ గురిపెట్టి.. రూ. 3.5 లక్షలు దోచుకెళ్లారు. అయితే ఈ ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసిన నికిత.. ప్రాణాలతో బయటపడినందుకు ఆనందపడుతోంది. పక్కా ప్లాన్ ప్రకారం ఈ దోపిడీ చోటుచేసుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆ ఫ్లాన్ అప్లై చేశారు ఇంట్లోని వ్యక్తులు. ఆమె తలకు తుపాకీ గురి పెట్టి.. బెదిరించి.. ఆభరణాలతో పాటు నగదును దోచేశారు. ఇంట్లో పని చేసే వ్యక్తులు నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ..ఇంత దారుణానికి పాల్పడటంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనను చంపేస్తానంటూ బెదిరించడంతో ఏమీ చేయలేకపోయానని నికితా అన్నారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నికితా రావత్ చేసినవి తక్కువ సినిమాలే అయినా.. బడా హీరోల పక్కన చేసింది. తెలుగు సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది.