iDreamPost
android-app
ios-app

సాంప్రదాయమా..? చట్టమా..? ఎంపీ సన్నాయి నొక్కులు !!

సాంప్రదాయమా..? చట్టమా..? ఎంపీ సన్నాయి నొక్కులు !!

సంక్రాంతి పండగ నెల ప్రారంభమైన వెంటనే ఉభయగోదావరి జిల్లాలో జరిగే కోడి పందెలపై కూడా చర్చ మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ, వ్యాపార వేత్తలు సంక్రాంతి కోడి పందేల కోసం ఉభయ గోదావరి జిల్లాలకు వస్తుంటారు. ప్రతి ఏడాది మూడు రోజుల పాటు జరిగే కోడి పందేలలో కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ప్రతి ఏడాది దాదాపు 300 నుంచి 500 కోట్ల రూపాయలు మేర పందేలు జరుగుతాయని అంచనా.

అయితే కోడి పందేలపై ఎప్పటి నుంచో నిషేధం ఉంది. అయినా ఆ మూడు రోజలు చట్టం ఉభయ గోదావరి జిల్లాల్లో వర్తించదు. మిగతా రోజుల్లో అడపా దడపా నిర్వహించే కోడిపందేలు రహస్యంగా సాగుతుంటే.. సంక్రాంతికి మాత్రం మూడు రోజల పాటు భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. కోడి పెందేలు నిర్వహణ అరికట్టడంపై హైకోర్టులో పిటిషన్లు వేయడం, విచారణ జరగడం, తిరిగి కోడి పందేలు జరగడం ప్రతి ఏడాది జరిగే తంతే.

ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందేల నిర్వహణపై ప్రతి ఏడాది ఒక వ్యక్తి వకాల్తా పుచ్చుకుంటారు. అతనే ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఈ ఏడాది కూడా ఆయనే ముందుకు వచ్చారు. కోడి పెందేలు నిర్వహణపై తన అభిప్రాయాన్ని మంగళవారం మీడియా సమావేశంలో సుతిమెత్తగా చెప్పారు. హింసకు తావులేకుండా కోడిపందేలు జరగాలని ఆకాక్షించారు. కోడి పందేలు గోదావరి జిల్లాల సంప్రదాయమని చెప్పుకొచ్చారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పేకాట నిర్వహించే క్లబ్బులను మూసేయించింది. ఈ క్లబ్లు కూడా ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో కోడి కత్తులు తయారీ ఖర్కాణాపై పోలీసులు దాడులు చేశారు. వేలాది కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కోడి పందేలు జరగడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎంపీనే కోడిపందేల నిర్వహణపై సన్నాయి నొక్కులు నొక్కుతుండడంతో పందేల నిర్వహణను అరికట్టడంపై ప్రభుత్వం గట్టిగానే ఉన్నట్లుగా అర్థమవుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోడి పెందేల నిర్వహణను అరికడుతుందా..? లేక యథావిధిగా ఎప్పటిలాగే హడావుడి చేసి చివరకు పందేల నిర్వహణకు మౌఖిక ఆదేశాలు ఇస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.