iDreamPost
android-app
ios-app

రౌడీషీట్లు ఓపెన్ చేసినా అచ్చెన్నాయుడు ఎందుకు మాట్లాడలేదబ్బా?

రౌడీషీట్లు ఓపెన్ చేసినా అచ్చెన్నాయుడు ఎందుకు మాట్లాడలేదబ్బా?

ఆయ‌న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు. అందులోనూ ఆ జిల్లాలో ఆయ‌న కుటుంబానిది తిరుగులేని ఆధిప‌త్యం. ఆయ‌న‌పై కానీ, కుటుంబంపై కానీ అధికార‌పార్టీ ఆరోప‌ణ‌లు చేస్తేనే తెలుగు త‌మ్ముళ్లు తెగ ఆవేశ ప‌డిపోయేవారు. ఆయ‌నే శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన కింజ‌రాపు అచ్చెన్నాయుడు. విచిత్రం ఏంటో కానీ అచ్చెన్న కుటుంబంపై తాజాగా రౌడీషీట్లు న‌మోదైనా ఎవ‌రూ కిమ్మ‌న‌లేదు.

అచ్చెన్నను అరెస్ట్‌ చేసిన సమయంలో నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలియజేసిన తెలుగు తమ్ముళ్లు కామైపోయారు. పార్టీ నేతల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఈ చర్యలపై అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు సైతం స్పందించడానికి ఆసక్తి చూపించలేదు. ఏం మాట్లాడాలో కూడా పార్టీ నేతలకు ఆదేశాలు ఇవ్వలేదట. ఈ పరిణామాలే జిల్లా రాజకీయాలలో చర్చగా మారాయి.

Also Read:పీసీసీ పదవి – ఓటుకు నోటులాంటిదే అంటున్న కాంగ్రెస్ ఎంపీ

శ్రీకాకుళం జిల్లాలో తిరుగులేని టీడీపీ కుటుంబంగా పేరు గ‌డించిన కింజార‌పు కుటుంబానికి 2019 నుంచి గ‌డ్డు కాలం మొద‌లైంది. తొలుత ఆ కుటుంబం నుంచి పేరొందిన నేత కింజరాపు ఎర్రన్నాయుడు.టెక్కలితోపాటు జిల్లాలోనూ వారి హ‌వా సాగేది. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఎర్రన్న తనయుడు రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం ఎంపీ. ఆయన కుమార్తె ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే. ఇంతటి బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నప్పటికీ కింజరాపు కుటుంబానికి 2019 ఎన్నికల తర్వాత రాజకీయంగా వరస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా టెక్కలిలో ఎమ్మెల్యేగా గెలిచి చురుకైన పాత్ర పోషిస్తోన్న అచ్చెన్నాయుడు ఏసీబీ కేసులో జైలుకెళ్లాల్సి వచ్చింది.

ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత పంచాయతీ ఎన్నికల్లోనూ కేసులతో నలిగిపోయారు. ప్రస్తుతం అచ్చెన్న కుటుంబానికి చెందిన ముగ్గురిపై రౌడీషీట్స్ తెరిచారు. అచ్చెన్న అన్నయ్య హరివరప్రసాద్‌తోపాటు హరిప్రసాద్‌ కుమారుడు సురేష్‌, సమీప బంధువు కృష్ణమూర్తిపై కోటబొమ్మాళి పోలీసులు రౌడీషీట్లు తెరిచారు. హరివరప్రసాద్‌, కృష్ణమూర్తిపై 2088, 2010లో క్రిమినల్‌ కేసులున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో ఓ రేంజ్‌లో పొలిటికల్‌ రగడ జరిగింది. వైసీపీ బలపర్చిన కింజరాపు అప్పన్నను నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడంతో నాటకీయ పరిణామాలు సంభవించాయి.

Also Read:లోకేష్ నియోజకవర్గం మారుతున్నాడా?

ఆ సమయంలో పోలీసుల విధినిర్వహణకు ఆటంకం కల్పించారని ఆరోపణలు రావడంతో అచ్చెన్న కుటుంబసభ్యులు 22 మందిపై నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు నమోదయ్యాయి. అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేయగా హరివరప్రసాద్, సురేష్‌లు బెయిల్ తెచ్చుకున్నారు. అప్పట్లో హరివరప్రసాద్‌, సురేష్‌, అచ్చెన్నాయుడి సమీప బంధువు కృష్ణమూర్తిపై కోటబొమ్మాళి పోలీసులు బైండోవర్లు ఓపెన్ చేశారు. సీన్‌ కట్ చేస్తే ఈ కేసులు పెట్టిన 4 నెలల తర్వాత ఇప్పుడు రౌడీషీట్లు ఓపెన్ చేయడం చర్చగా మారింది.

బైండోవర్‌ రూల్స్ ఉల్లంఘించడంతోపాటు పాత కేసులు ఉండటంతో అచ్చెన్న కుటుంబ స‌భ్యుల‌పై పోలీసులు రౌడీషీట్లు ఓపెన్ చేశారు. అయితే ఇది కక్షపూరిత చర్యగా ఆరోపిస్తోంది టీడీపీ. కింజరాపు కుటుంబంపై ఈగవాలినా ఊరుకోని తెలుగు తమ్ముళ్లు.. ఈ ఎపిసోడ్‌లో మాత్రం కిమ్మనకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. జిల్లాలో టీడీపీకి అనేక మంది ముఖ్యనేతలు ఉన్నా.. ఒక్కరూ స్పందించలేదు. పార్టీలో చిన్న కార్యకర్తపై కేసుపెడితే అక్రమం అని రోడ్డెక్కే నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదట. మన ప్రభుత్వం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే ధోరణిలో అచ్చెన్నాయుడు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే రౌడీషీట్లపై ఆయన నో కామెంట్‌ అన్నారట. నాయకుడే మౌనంగా ఉంటే మనకెందుకు.. మనమూ మౌనంగా ఉంటే సరిపోతుందని ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్‌ అయ్యారట పార్టీ శ్రేణులు.