అచ్చెన్న అరెస్ట్: సీపీఎం అలా.. సీపీఐ ఇలా!

ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించే పరిణామాలు మరిన్ని ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీ శాసనసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడిని అవినీతి కేసులో అరెస్ట్ చేయడం పట్ల పలు వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం ముఖ్యంగా బీసీ కార్డ్ ప్రయోగించే ఫలితం చేయడం చాలామందిని విస్మయానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఈఎస్ఐ కుంభకోణం- అచ్చెన్న అరెస్ట్ పై సీపీఎం సూటిగా స్పందించింది. కార్మికుల సంక్షేమం కోసం, వారి కుటుంబీకుల ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సిన నిధులను కాజేసిన వైనంపై కఠిన చర్యలు అవసరం అని సీపీఎం తేల్చేసింది.

ఈ వ్యవహారంలో మాజీ మంత్రి అరెస్టు పై టీడీపీ నేతల తీరుని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తప్పుబట్టారు. బీసీల పేరుతో అచ్చెన్న అరెస్టుని కులాలకు ముడిపెట్టడాన్ని నిరసించారు. ఈఎస్ఐలో జరిగిన అవినీతిని తాను గతంలోనే వెలుగులోకి తెచ్చానని మధు అన్నారు. నాటి సీఎం కి లేఖ రాసినా స్పందన లేదన్నారు. ఆ తర్వాత జగన్ కి ముఖ్యమంత్రి బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత రాసిన లేఖపై కూపీ లాగడం మొదలయ్యిందన్నారు. ఇందులో అవినీతిపరులందరినీ శిక్షించాలన్నారు. కులం, మతం పేరుతో అవినీతి కప్పిపుచ్చే యత్నం సరికాదన్నారు. టీడీపీ నేతల వి చౌకబారు యత్నాలన్నారు.

Also Read:అరాచకంలోకి దిగజారుతున్న అనుభవం

అదే సమయంలో సీపీఐ మాత్రం భిన్నమైన స్పందనతో ముందుకొచ్చింది. ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఈ అరెస్ట్ ని ఖండించారు. అందుకు ఆయన చెప్పిన కారణం కూడా విస్మయకరంగా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు అరెస్ట్ చేయడం సరికాదంటున్నారాయన. అనేక సమస్యలను చర్చించాల్సిన వేదిక అసెంబ్లీ ఉండగా నోటీసులు లేకుండా అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. తద్వారా ఈఎస్ఐ కుంభకోణం విషయంలో అరెస్టుల పట్ల సీపీఐ నేతల తీరు చాలామందిని ఆశ్చర్యపరిచింది.

గత కొంతకాలంగా ఈ రెండు వామపక్ష పార్టీలు అనేక విషయాల్లో విభిన్నంగా స్పందిస్తున్నాయి. అదే పరంపరలో అచ్చెన్న వ్యవహారం కనిపిస్తోంది. టీడీపీ తో సీపీఐ దాదాపుగా అంటకాగుతుందనే అభిప్రాయం లెఫ్ట్ శ్రేణుల్లో ఉంది. అమరావతి విషయంలో గానీ, ఇతర అన్ని సందర్భాల్లోనూ టీడీపీ నేతల వ్యాఖ్యలనే సీపీఐ వల్లిస్తోంది. దాంతో ఇరు పార్టీలు ఒకే గూటి పక్షుల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Also Read:అచ్చెం నాయుడు తరువాత ఎవరు..?! ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోస్యం నిజమవుతుందా..?

కానీ సీపీఎం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పలు సందర్భాల్లో జగన్ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతోంది. అదే సమయంలో విధానపరంగా టీడీపీకి దూరంగా వ్యవహరిస్తోంది. మూడు రాజధానుల అంశంలో కూడా సీపీఎం తన విధానాన్ని చెప్పినప్పటికీ టీడీపీకి చేరువయ్యేందుకు ససేమీరా చెప్పింది. అదే సమయంలో అమరావతిలో అసలు దోషులు టీడీపీ, బీజేపీ అని కూడా తేల్చేసింది. కాగతా ఇప్పుడు ఈఎస్ఐ స్కామ్ విషయంలో కూడా నిందితుల అరెస్ట్ ని హర్షిస్తూ పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. దాంతో ఈ రెండు పార్టీల మధ్య సఖ్యతకు ఇలాంటి అంశాల మూలంగా సమస్య ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి.

Show comments