iDreamPost
iDreamPost
హీరో, కమెడియన్ కలసి మొత్తం విలన్ గ్యాంగ్‌ను చితక్కొట్టేశారు అన్నట్టు ఉంది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్. ఆంధ్రప్రదేశ్‌లో నందమూరి తారకరామారావు నుంచి నారా చంద్రబాబునాయుడు పాలన వరకు రాష్ట్రంలో 52 లక్షల ఇళ్లు నిర్మించారు అంటున్న ఆయన.. అందులో చంద్రబాబునాయుడు 14 ఏళ్ల పాలనలో ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పి ఉంటే బావుండేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన అచ్చెన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ 30 నెలల కాలంలో ఎన్ని ఇళ్లు నిర్మించారో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం ఇవ్వాలంటూ ప్రశ్నించారు. మేం కట్టిన ఇళ్లపై ఇప్పుడు నీ రిజిస్ట్రేషన్ ఏమిటి.. ఎవరికి కావాలంటూ ఆయన ఓటీఎస్ పథకంపై వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పుట్టినరోజు నాడు పేదవాడిపై భారం మోపే పథకాలు పెట్టడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.
అవి మీ ఖాతాలో వేసేస్తారా?
మేం కట్టిన ఇళ్లపై ఇప్పుడు నీ రిజిస్ట్రేషన్ ఏమిటి అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న అచ్చెన్న చంద్రబాబు హయాంలో ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పకుండా విమర్శలు చేయడమే వింతగా ఉంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు అనగానే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ సీఎం ఎన్టీఆర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారు కాని చంద్రబాబును ఎవరూ తలచుకోరు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇళ్లు నిర్మిస్తున్నాం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, అధికారంలో ఉన్నప్పుడు వాటి గురించి పట్టించుకోకపోవడం ఆయన నైజం అన్నది అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల ముందు కూడా అలాగే టిడ్కో ఇళ్లు అంటూ పబ్లిసిటీ చేసి వాటిని అర్ధాంతరంగా వదిలేశారు. తర్వాత వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వాటి నిర్మాణాలను పూర్తిచేసి, విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రారంభానికి సిద్ధం చేసింది. అచ్చెన్న చెబుతున్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పాలన వరకు పరిగణనలోకి తీసుకున్నా…ఎక్కువ ఇళ్ల నిర్మాణం వైఎస్సార్ పాలనా కాలంలోనే జరిగింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందిరమ్మ, రాజీవ్ గృహకల్ప ఇళ్లు పెద్ద ఎత్తున నిర్మించి పేదలకు వైఎస్సార్ పంపిణీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అవన్నీ చంద్రబాబు ఖాతాలో వేసేయడానికి అచ్చెన్న పడుతున్న తాపత్రయాన్ని జనం గమనించడం లేదనుకుంటున్నారు.
Also Read : ఓటీఎస్‌ను ప్రారంభించిన సీఎం.. జరిగే మేలును పూసగుచ్చినట్లు వివరించిన జగన్
జగన్ చేసింది కనిపించడం లేదా?
రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది పేదలకు తమ ప్రభుత్వం ఒకేసారి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చిన సంగతి అచ్చెన్నకు కనిపించడం లేదా అని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు లేనిచోట్ల ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేసి మరీ రాష్ట్రంలో అర్హులందరికీ ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. అందులో మొదటి దశగా 16 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి కూడా. కళ్ల ముందు ఈ వాస్తవాలు కనిపిస్తున్నా 30 నెలల్లో జగన్ ఎన్ని ఇళ్లు నిర్మించారో చెప్పాలంటూ ప్రశ్నించడాన్ని బట్టే అచ్చెన్నకు ఉన్న పరిజ్ఞానం అర్థం అవుతోందని వైఎస్సార్ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
టీడీపీ మాటలకు వాల్యూ ఉంటుందా?
జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో ఇచ్చే రిజిస్ట్రేషన్‌కి వాల్యూ లేదని.. తక్కువకి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నానంటూ పేదవాళ్ల నుంచి రూ.5 వేల కోట్లు దండుకోవడానికి పూనుకోవడం చాలా దారుణం అంటూ ఆవేశపడిన అచ్చెన్న ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థం అవుతోందా అన్న సందేహం వస్తోంది. ఒక ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇంటిపై హక్కు ధ్రువీకరణ పత్రం అందిస్తే దానికి వాల్యూ లేదని చెప్పడాన్ని బట్టే అచ్చెన్న జనాన్ని పక్కదోవ పట్టించడానికి విమర్శలు చేస్తున్నారని అర్థమవుతోంది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే వాల్యూ లేదు ,ఉండదుకానీ, టీడీపీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా ఇంటిపై హక్కులు కల్పిస్తామని చెప్పే మాటలకు వాల్యూ ఉంటుందా? ఎప్పుడూ ఇచ్చిన మాట నిలబెట్టుకోని చంద్రబాబు సారథ్యంలోని టీడీపీని జనం నమ్మడం మానేశారు. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలుగా చేసుకొని పరిపాలనా రథాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి జనంలో ఆదరణ పెరుగుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవు అనే భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు అచ్చెన్న తీరును దుయ్యబడుతున్నారు.
Also Read : బాబు, రామోజీ, ఆర్‌కేలకు ప్రజల ద్వారా జగన్ ప్రశ్నావళి