Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు విచారం వ్యక్తం చేశారు. పొరపాటైందని, క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన కమిటీకి తెలిపారని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్థన్ రెడ్డి చెప్పారు.
ఈ రోజు కమిటీ ముందు విచారణకు హాజరైన అచ్చెం నాయుడు.. వ్యాఖ్యలపై తన వివరణ ఇచ్చారు. ప్రెస్‌నోట్ తయారు చేసి కార్యాలయంలో పెట్టిన సమయంలో.. తనకు తెలియకుండానే అది బయటకు వెళ్లిందని కమిటీకి వివరణ ఇచ్చారు. తనకు తెలియకుండా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జారీ అయిన ప్రెస్‌నోట్‌లో తన పేరు ఉన్న నేపథ్యంలో.. దానికి బాధ్యత వహిస్తున్నానని అచ్చెం నాయుడు చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన చెప్పారని కాకాని గోవర్థన్ రెడ్డి వెల్లడించారు.
అచ్చెం నాయుడు సేఫ్ అయినట్లేనా..?
స్పీకర్ తమ్మినేని సీతారంపై అచ్చెం నాయుడుతోపాటు మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. గత నెల 31వ తేదీన జరిగిన సమావేశానికి ఇద్దరూ హాజరుకాలేదు. అచ్చెం నాయుడు ముందుగానే సమాచారం ఇవ్వగా.. కూన రవికుమార్ మాత్రం ముందస్తు సమాచారం లేకుండానే గైర్హాజరయ్యారు.
ఈ రోజు జరిగిన సమావేశానికి అచ్చెం నాయుడు హాజరై.. క్షమాపణలు కూడా చెప్పడంతో ఈ వివాదం నుంచి ఆయన బయటపడినట్లుగా చెప్పవచ్చు. అచ్చెం నాయుడు ఇచ్చిన వివరణను కమిటీ సభ్యులందరికీ పంపిన, వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్థన్ రెడ్డి చెప్పారు.
Also Read: బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్, నాడు – నేడు అన్నట్టుగా సాగుతున్న పనులు
తగ్గిన అచ్చెం నాయుడు…
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన నోటీసులను కూడా అచ్చెం నాయుడు తప్పుబట్టారు. తనకు నోటీసులు ఇచ్చే అధికారం ప్రివిలేజ్ కమిటీకి లేదని అన్నారు. అయితే ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గారు. అచ్చెం నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా కమిటీ వివరణ తీసుకుంది. తనకు రూల్ తెలియదని, తనకున్న అవగాహన ప్రకారం అలా అన్నానని అచ్చెం నాయుడు వివరణ ఇచ్చినట్లు.. కాకాని చెప్పారు.
కూనపై సీరియస్..
గత సమావేశానికి హాజరుకాని కూన రవికుమార్‌పై ప్రివిలేజ్ కమిటీ సీరియస్‌గానే ఉన్నట్లు కాకాని వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. అందుబాటులోకి ఉండి కూడా.. విచారణకు హాజరుకాకుండా తప్పించుకోవడానికి కూన రవికుమార్ అబద్ధాలు చెప్పారని కమిటీ భావిస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా కమిటీ వద్ద ఉన్నట్లు కాకాని చెబుతున్నారు. ఆయా ఆధారాలను పరిశీలించిన తర్వాత కూర రవికుమార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామన్నారు.
ఈ నెల 21వ తేదీన మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని కాకాని తెలిపారు. మరో అవకాశం ఇస్తే.. హాజరవుతానని కూన రవికుమార్ అడిగారని తెలిపారు. విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇస్తారా..? లేదా..? అనేది కాకాని వెల్లడించకపోవడంతో.. కూనపై చర్యలకే ప్రివిలేజ్ కమిటీ సిద్ధమయినట్లు తెలుస్తోంది.
Also Read: పని రాక్షసుడు.. ఆస్కార్ ఫెర్నెండేజ్