iDreamPost
android-app
ios-app

Acham naidu – ఔనా.. అచ్చెన్నా..!!

Acham naidu – ఔనా.. అచ్చెన్నా..!!

మాట్లాడితే కాస్త మీనింగ్ ఉండాలి. విన్న‌వారు న‌మ్మేలా ఉండాలి. ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు స్టేట్ మెంట్ల‌లో ఇవేమీ క‌నిపించ‌డం లేదు. పార్టీ అధినేత సుదీర్ఘ కాలంగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఓ మున్సిపాలిటీని గెలిపించుకోలేక పోయారు కానీ ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా రాష్ట్రంలో 150 ఎమ్మెల్యే సీట్ల‌ను గెలిచేస్తార‌ట‌. ఇది అచ్చెన్న‌వారి మాట‌. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఎన్నిక‌లైపోతే ఇక పార్టీ లేదు.. అదేదో లేదంటూ చెప్పినాయ‌న ఇప్పుడు 150 సీట్లు గెలిచేస్తామ‌ని ఎలా చెబుతున్నారో ఆయ‌న‌కే తెలియాలి. ఇప్పుడిదే ఇత‌రుల‌తో పాటు త‌మ్ముళ్ల‌లో కూడా పెద్ద జోక్ గా మారిపోయింది.

తెలుగుదేశాన్ని స్థాపించిన అత్యల్ప వ్యవధిలోనే.. అంటే కేవలం 9 నెలల్లోనే ఎన్నికలు ఎదుర్కొంది టీడీపీ. 1983 జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగి ఘన విజయం సాధించింది. అది సాధారణ విజయం కాదు. 294 స్థానాలకుగానూ 203 చోట్ల గెలుపొందింది. ఆంధ్ర ప్రదేశ్‌లో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు చరిత్ర సృష్టించారు. నాటి నుంచి మొత్తం 9 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న టీడీపీ ఐదు సార్లు గెలుపొంది.. 21 ఏళ్లు అధికారంలో ఉంది. గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో క‌లిపి నాలుగు సార్లు ఓట‌మిని చ‌విచూసింది. ఎలాంటి ఓట‌మి అంటే.. ఘోర అనే దానికంటే ఇంకా పెద్ద పదమేదైనా వాడాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ స్థాపించిన తర్వాత ఏ ఎన్నికల్లోనూ టీడీపీ ఇంత దారుణంగా ఓటమి చవిచూడలేదు.

విపక్ష హోదా కూడా ద‌క్కుతుందా లేదా అన్న టెన్ష‌న్ నాడు వెలువ‌డుతున్న ఫ‌లితాల స‌ర‌ళి క్ర‌మంలో ఆ పార్టీ నేత‌ల్లో చాలా మందికి క‌లిగే ఉంటుంది. అసెంబ్లీలో ఉన్న మొత్తం సీట్లలో పదిశాతం దక్కితేనే ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా లభిస్తుంది. 1994 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 26 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఉమ్మడి అసెంబ్లీలో ఉన్న సీట్లలో పదో వంతు కూడా రాకపోవడంతో ఆ పార్టీకి అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాకు కనీసం 30 సీట్లు రావాలి. ఇప్పుడు 175 సీట్లకు గాను 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. టీడీపీ ద‌గ్గ‌ర ‌ద‌గ్గ‌ర‌గా మాత్ర‌మే అంటే 23 సీట్లు వ‌చ్చాయి. దీంతో హ‌మ్మ‌య్యా.. ప్రతిపక్ష హోదా అయినా ద‌క్కింద‌ని సంతృప్తి ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ఈ దుస్థితికి కార‌ణం ప్ర‌జ‌ల్లో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అత్యంత స్థాయిలో పెరిగిన ఆద‌ర‌ణ‌. పాద‌యాత్రతో ప్ర‌జ‌ల్ని మంత్ర‌ముగ్దుల్నిచేసిన ఆయ‌నే.. ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. సంక్షేమ పాల‌న‌తో మైరిపిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన వ‌రుస ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూస్తే.. జ‌గ‌న్ కు ఉన్న ఆద‌ర‌ణ గ‌త రెండున్న‌రేళ్ల కంటే రెట్టింపు అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. టీడీపీ అంత‌కంత‌కూ దిగ‌జారింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇవ‌న్నీ క‌ళ్ల ముందే క‌నిపిస్తున్నా.. అచ్చెన్న అలాంటి స్టేట్ మెంట్లు ఇస్తుండ‌డం సాధార‌ణంగానే న‌వ్వు తెప్పించ‌క‌మాన‌దు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ.. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా టీడీపీ 150 సీట్లు గెలుస్తుంది అని ప్ర‌క‌టించారు. దీంతో ఔనా.. అచ్చెన్నా అని ఆశ్చ‌ర్య‌పోవ‌డం అంద‌రి వంతూ అవుతోంది.

Also Read : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం.. సీఐడీ నోటీసులు.. ఆస్పత్రిలో చేరిన లక్ష్మీనారాయణ