iDreamPost
android-app
ios-app

అచ్చెం నాయుడు లెక్క.. టీడీపీకి మరీ అన్ని సీట్లా..?

అచ్చెం నాయుడు లెక్క.. టీడీపీకి మరీ అన్ని సీట్లా..?

పార్టీని నడపడంలో అధికారంలో ఉన్న పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ నడక పూలదారిలో సాగుతుంటే.. ప్రతిపక్ష పార్టీ బాటలో రాళ్లు, ముళ్లు ఉంటాయి. పూలు అసలే కనపడవు. ఐదేళ్ల పాటు పార్టీని నడపడం, నేతలు, శ్రేణులలో భవిష్యత్‌పై భరోసాను కల్పిస్తూ ముందుకు నడిపించడం కత్తిమీద సాములాంటిది. మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాను క్యాడర్‌లో నింపేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు నిత్యం ఏదో ఒక ప్రకటన చేస్తుంటారు. అధికార పార్టీ గ్రాఫ్‌ తగ్గిందనో, సర్వేల పేరుతో మనకు ఇన్ని సీట్లు వస్తాయనో.. ఇలా రకరకాల గారడీలు చేయాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా ఇప్పుడు ఇదేపని చేస్తోంది. పార్టీ క్యాడర్‌లో జోష్‌ నింపేందుకు రకరకాల జిమ్మిక్కులు, ప్రకటనలు చేస్తోంది. తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. కేవలం గెలుపుపైనే కాదు.. ఎన్ని సీట్లు వస్తాయో కూడా అచ్చెం నాయుడు జోష్యం చెప్పారు. వైఎస్‌ జగన్‌ తమ పార్టీని అంతం చేయాలని చూస్తున్నారని, తమ నాయకులు ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు అచ్చెం నాయుడు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బకు దెబ్బతీస్తామని హెచ్చరించారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని చెప్పిన అచ్చెం నాయుడు రాబోయే ఎన్నికల్లో మనం 155 సీట్లు గెలుస్తామని జోష్యం చెప్పారు.

Also Read : చంద్రబాబు దురాఘాతానికి 21 ఏళ్లు

టీడీపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే చంద్రబాబు, లోకేష్‌లు కూడా ఇలాంటి ప్రకటనలే చేశారు. అయితే ఎన్ని సీట్లు వస్తాయో చెప్పింది మాత్రం అచ్చెం నాయుడే. టీడీపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేయడం వెనుక బలమైన కారణమే ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ చతికిలపడింది. విజయం వైసీపీదేనని తెలిసినా.. ఆ పార్టీ అనూహ్యమైన విజయం సాధించింది. 175 సీట్లకు గాను ఏకంగా 151 సీట్లు గెలిచింది. ఈ లెక్క చూసిన టీడీపీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడ్డాయి. నియోజకవర్గ ఇంఛార్జి పదవులు చేపట్టేందుకు కూడా పలు నియోజకవర్గాల్లో నేతలు ఆసక్తి చూపడంలేదు. కొంత మంది ఇంఛార్జిలుగా ఉన్నామంటే.. ఉన్నామనేలా వ్యవహరిస్తున్నారు.

ఈ పరిస్థితి నుంచి బయడపడేందుకు, నేతలు, క్యాడర్‌లో జోష్‌ నింపేందుకు టీడీపీ పెద్ద నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల వైసీపీ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని టీడీపీ అనుకూల మీడియా, సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయో చెబుతూ సర్వే పేరుతో హడావుడి చేశారు. తాజాగా అచ్చెం నాయుడు 155 సీట్లు వస్తాయని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలసి పోటీ చేస్తేనే ఆ పార్టీకి వచ్చిన సీట్లు 107. ఇందులో బీజేపీకి వచ్చిన సీట్లు 4 మినహాయించగా టీడీపీ గెలిచింది 103.

బహిరంగంగా ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా చంద్రబాబు చరిత్రలో తొలిసారి ఒంటరిగా పోటీ చేస్తే 2019లో వచ్చిన సీట్లు 23. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీలు అమలు చేయకపోవడం వల్ల వచ్చిన నష్టాన్ని డ్వాక్రా మహిళలు, రైతులు ఇప్పటికీ మోస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ.. పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజల మన్ననలు పొందారని ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలిపోయింది. ఏ లెక్కన చూసినా టీడీపీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. అయినా అచ్చెం నాయుడు 155 సీట్లు గెలుస్తామని ఏ ధీమాతో చెప్పారో..?

Also Read : టీడీపీలో కలకలం.. దర్శి ఇంఛార్జి పదవికి పమిడి గుడ్‌బై