Idream media
Idream media
మాజీ మంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడుకు జైలు జీవితం తప్పడం లేదు. స్వగ్రామం నిమ్మాడలో పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైన వ్యక్తిని బెదిరించిన కేసులో అచ్చెం నాయుడును ఈ నెల 2వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం అచ్చెంనాయుడుకు ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని అచ్చెంనాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలను విన్న శ్రీకాకుళం జిల్లా సోంపేట న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కేసు డైరీ న్యాయస్థానానికి రాని కారణంగా విచారణ వాయిదా పడింది. దీంతో అచ్చెం నాయుడు సోమవారం వరకు జైలు జీవితం గడపక తప్పడం లేదు.
బెదిరించిన కేసులో..
స్వగ్రామం నిమ్మాడలో నాలుగు దశాబ్ధాలుగా అచ్చెం నాయుడు, ఎర్రన్నాయుడులు చెప్పిందే వేదం. సంచాయతీ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకునేవారు. పోటీకి వచ్చిన వారిని అడ్డతొలిగించుకునేందుకు సామదానబేధదండోపాయలను ప్రయోగించేవారు. అయితే ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి రావడం, అచ్చెం నాయుడు కుటుంబంపై ఉన్న వ్యతిరేకతల నేపథ్యంలో అచ్చెం నాయుడు సమీప బంధువు కింజారపు అప్పన్న పోటీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను పోటీ నుంచి తప్పించేందుకు అచ్చెం నాయుడు బెదిరింపులకు దిగారు. అయినా వినని అప్పన్న నామినేషన్ వేసేందుకు సిద్ధమవగా.. నామినేషన్ కేంద్రం వద్దే అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలో అచ్చెం నాయుడు, ఆయన సోదరుడు హరిప్రసాద్ సహా 22 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగానే అచ్చెం నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సారి జైలులో ఎక్కువ రోజులు..
అచ్చెం నాయుడు జైలు జీవితం గడపడం ఇది రెండో సారి. ఈఎస్‌ఐ స్కాంలో గత ఏడాది అచ్చెం నాయుడు అరెస్ట్ అయ్యారు. ఫైల్స్ కారణంగా ఆయన జుడీషియల్ రిమాండ్‌లో ఉంటూ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. గుంటూరు జీజీహెచ్ నుంచి డిశ్చార్జి చేసిన తర్వాత ఐదు రోజుల పాటు విజయవాడ సబ్ జైలులో ఉన్నారు. ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదంటూ, తనను గుంటూరు రమేష్ ఆస్పత్రికి తరలించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అచ్చెం నాయుడు అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ వచ్చే వరకూ కూడా అచ్చెం నాయుడు ఆస్పత్రిలోనే ఉన్నారు. తాజాగా కేసులోనూ రిమాండ్‌లో ఉన్న అచ్చెం నాయుడు ఈ సారి ఏసీబీ కేసు కన్నా ఎక్కువ రోజులు జైలులో ఉండబోతున్నారు. ఈ నెల 2వ తేదీన జైలుకు వెళ్లిన అచ్చెం నాయుడు బెయిల్ పిటిషన్ ఈ నెల 8వ తేదీకి వాయిదా పడడంతో అప్పటి వరకు ఆయన జైలులోనే ఉండబోతున్నారు. సోమవారం బెయిల్ లభిస్తుందా..? లేదా తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా వేచి చూడాలి. ఒక వేళ పోలీసు కస్టడీకి కోర్టు అనుమతిస్తే.. మరి రోజులు అచ్చెం నాయుడు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది.