iDreamPost
android-app
ios-app

ఫ్రీ ఫోన్ తో జగన్ సర్కారీ నిఘా అంట !!!

ఫ్రీ ఫోన్ తో జగన్ సర్కారీ నిఘా అంట !!!

ఫ్రీ ఫోన్ తో సర్కారీ నిఘా పేరుతో ఆంధ్రజ్యోతి ఒక వార్తను ప్రచురించింది…

ఫోన్‌ ఇచ్చారు.. పీక పట్టారు.. వారి ఫోన్లలో ఎండీఎం సాఫ్ట్‌వేర్‌, గోప్య సమాచారం గుప్పిట్లో.. కోట్లాది ప్రజల డేటా సర్వర్‌లకు
ప్రైవేటుకు చేరితే ఏమిటి గతి?.. టెక్‌ నిపుణుల తీవ్ర ఆందోళన ఇలా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రతీ అక్షరంలో వెళ్లగక్కిన ఆంధ్రజ్యోతి అంతిమంగా మరోసారి అవాస్తవ వార్తను ప్రచురించింది.

గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శి, సర్వేయర్‌, వలంటీర్‌, పట్టణ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఇటీవల 2.64 లక్షల స్టార్ట్‌ఫోన్లు ఇచ్చింది.

ప్రభుత్వం పేదలకోసం భారీగా సంక్షేమ పథకాలు అంటే అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఇంటిస్థలాలు, రైతు భరోసా, రేషన్‌కార్డు తదితర సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుల వివరాలు గ్రామ సచివాలయాల్లో భద్రపరిచారు. ఈ డేటాను నిక్షిప్తం చేయడానికి ప్రతి గ్రామ సచివాలయానికి కంప్యూటర్‌, స్కానర్‌, ప్రింటర్‌ను సమకూరుస్తున్నారు. డేటా సేకరణ, ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం తెలుసుకోవడంతోపాటు, సచివాలయానికి వచ్చే సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించేందుకు ఈ స్మార్ట్‌ఫోన్లు ఇచ్చారు. ఇందులో పంచాయతీరాజ్‌, పురపాలక శాఖలకు సంబంధించిన అప్లికేషన్లు ఎలాగూ ఉన్నాయి. వీటిద్వారా ప్రభుత్వానికి కావాల్సిన రిపోర్టులు వెళుతుంటాయి.

ఆంధ్రజ్యోతిలో ఈ స్మార్ట్ ఫోన్లను సచివాలయ ఉద్యోగులకు ఇవ్వడం, ఆ ఫోన్ లపై ప్రభుత్వ నిఘా ఉందని ఒక రుచికరమైన వార్తను వార్చి వండారు.. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల జీవితల్లోకి ప్రభుత్వం తొంగి చూస్తుందని, ఆ స్మార్ట్ ఫోన్లలో సమాచారం ప్రభుత్వానికి చేరవేసేందుకు ఎండిఎం సాఫ్ట్ వేర్ నిక్షిప్తం చేసారని, దీనితో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం మొత్తం ప్రభుత్వం గుప్పిట్లోకి వెళ్లిపోతుందని ఆంధ్రజ్యోతి సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్ల తరపున మొసలి కన్నీరు కారుస్తూ విపరీతంగా బాధపడిపోయింది..

కానీ ఇందులో ఉన్న చిన్న మెలిక ఆంధ్రజ్యోతికి అర్థం కాకపోవడం చాలా విచిత్రంగా ఉంది.. ప్రభుత్వం ఉద్యోగులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చింది తమ వ్యక్తిగత వినియోగం కోసం కాదు,కేవలం విధి నిర్వహణలో భాగంగా మాత్రమే స్మార్ట్ ఫోన్లను ఇచ్చారని జర్నలిజంలో పత్రికా రంగంలో ఎంతో అనుభవమున్న ఆంధ్రజ్యోతికి తెలియకపోవడం శోచనీయం..మళ్ళీ అవాస్తవ వార్తను ప్రజల మెదళ్లలో ఇంజెక్టు చేయాలని చూడటం చూస్తుంటే జర్నలిజం ఎంత విషపూరితంగా మారిపోయిందనేది అర్థం చేసుకోవచ్చు..

స్మార్ట్ ఫోన్లు ఇచ్చింది వ్యక్తిగత వినియోగానికి కాదు.. డేటా సేకరణ, ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం తెలుసుకోవడంతోపాటు, సచివాలయానికి వచ్చే సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించేందుకు ఈ స్మార్ట్‌ఫోన్లు ఇచ్చారు. అంతేకానీ వాటితో ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉద్యోగులు కాలక్షేపం చేయడానికి వాటిని ఇవ్వలేదు.. కేవలం ఉద్యోగ నిమిత్తం మాత్రమే వాటిని ఉద్యోగులకు ఇచ్చారు.. వేరే ఇతరత్రా కార్యకలాపాలు చేయకూడదని ముందుగానే సచివాలయ ఉద్యోగులను, వాలంటీర్లను అధికారులు హెచ్చరించారు.. ఈ ఫోన్లపై నిఘా ఉంటుందని..మీ వ్యక్తిగత కార్యకలాపాలు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లలో చేయొద్దని..దానికి అనుగుణంగానే ఉద్యోగులు కూడా ఆ స్మార్ట్ ఫోన్లను ఉద్యోగ నిమిత్తం మినహా వ్యక్తిగత అవసరాలకు వాడటం లేదు..

కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఒక అవాస్తవ విషపూరితమైన వార్తను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచురించింది..టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో లేక ఆంధ్రజ్యోతి ఆందోళన వ్యక్తం చేస్తుందో వార్త చదివిన మరుక్షణమే ప్రజలకు నిజం అర్థం అవుతుంది.. ప్రభుత్వంపై ఉన్న అక్కసును ఏదొక రూపంలో వెళ్లగక్కడం ఆంధ్రజ్యోతికి మొదటినుండి అలవాటే.. అలాంటి వార్తే  ఈ ఫ్రీ ఫోన్ తో సర్కారీ నిఘా అనేది.. ఇలాగే తప్పుడు వార్తలను ప్రచురిస్తూ పోతే ఆంధ్రజ్యోతి పత్రికను ప్రజలు పక్కన పెట్టడం ఖాయం..