iDreamPost
android-app
ios-app

ABN Andhra Jyothi, YCP Leader – వైసీపీ నేత పేరుతో ఆంధ్రజ్యోతి మరో కొత్త డ్రామా

ABN Andhra Jyothi, YCP Leader – వైసీపీ నేత పేరుతో ఆంధ్రజ్యోతి మరో కొత్త డ్రామా

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని బద్నాం చేసేందుకు టీడీపీ కన్నా ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్న ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ.. సరికొత్త డ్రామాలకు తెరలేపుతూ వైసీపీ నేతల పేర్లతో అసత్య కథనాలను వండి వారుస్తోంది. ఈ నెల 12వ తేదీన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకల్లో.. సుబ్బారావు గుప్తా అనే వైసీపీ నేత మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటూ, చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారని, దాని వల్ల పార్టీ 20 శాతం ఓటు బ్యాంకు కోల్పోయే పరిస్థితి నెలకొందంటూ మాట్లాడారని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది.

బాలినేని వెంట తిరిగే వారికే పదవులు ఇస్తున్నారని, నిజమైన నేతలు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, ఇలా అయితే అధికారంలోకి రాలేమని, ఒక వేళ టీడీపీ అధికారంలోకి వస్తే కర్రలు పట్టుకుని వెంటపడి తరుముతారని సుబ్బారావు గుప్తా మాట్లాడిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోందని ఆంధ్రజ్యోతి మరో సరికొత్త డ్రామాకు తెరలేపింది. దీనికి కొనసాగింపుగా.. ఈ రోజు సుబ్బారావు గుప్తా ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారని, కొడాలి నానిని దూషించే స్థాయి మీక్కెడదని దూషించారని, సుబ్బారావు కనిపించడం లేదని, అతని భార్య ఆందోళనకు గురవుతున్నారంటూ మరో కథనం అల్లేసింది.

ఎవరీ సుబ్బారావు… వైసీపీతో ఏం సంబంధం..?

ఆంధ్రజ్యోతి రాస్తున్నట్లుగా సుబ్బారావు గుప్తా వైసీపీ నేత కాదు. ఒంగోలు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు గానీ, కార్పొరేషన్‌ అయిన తర్వాత గానీ కనీసం కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా కూడా పోటీ చేయలేదు. వైసీపీలో డివిజన్‌ అధ్యక్షుడు కూడా కాదు. కనీసం డివిజన్‌ కమిటీలో సభ్యుడు కూడా కాదు. సుబ్బారావు గుప్తా ఓ వ్యాపారి. వివిధ పార్టీల జెండాలు, కండువలు, ఇతర ప్రచారా సామాగ్రి తయారీ చేసి విక్రయిస్తుంటారు. గతంలో ఎన్టీ రామారావు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చిత్రాలతో ఉన్న పెన్నులను విక్రయించి సొమ్ము చేసుకున్నారు.

Also Read : పడిగట్టు పదాలు..ఏడుపుగొట్టు రాతలు

వ్యాపార వ్యవహారాల కోసం.. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేతగా సుబ్బారావు గుప్తా చెలామణి అవుతుంటారు. అందుకోసం తనకు తానుగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ.. వ్యాపార ఉనికిని కాపాడుకుంటూ ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతగా చెలామణి అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పార్టీలో కనీసం సభ్యత్వం లేకపోయినా.. వ్యాపార వ్యవహారాల కోసం హడావుడి చేస్తుంటారు. గతంలో ఆంధ్రజ్యోతి వైఎస్‌ జగన్, ఆయన సోదరి వైఎస్‌ షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయంటూ కథనం రాసినప్పుడు.. ఓ నలుగురు వ్యక్తులతో వెళ్లి ఒంగోలు ఆంధ్రజ్యోతి యూనిట్‌ కార్యాలయం వద్ద ఆ పత్రిక ప్రతులను తగులబెట్టి హడావుడి చేశారు. తనకు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలతో పరిచయాలు ఉన్నాయంటూ. వారిని తరచూ కలుస్తానంటూ స్థానికంగా చెప్పుకుంటూ వ్యాపారం చేసుకుంటుంటారు.

జన్మదిన వేడుకలకు బాలినేని దూరం..

మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకల్లో సుబ్బారావు గుప్తా.. ఈ వ్యాఖ్యలు చేశారంటూ, ఆ సమయంలో బాలినేని, ఇతర నేతలు వేదికపై ఉన్నారనేలా అర్థం వచ్చేలా ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. కానీ వాస్తవం వేరు. అసలు బాలినేని జన్మదిన వేడుకలే చేసుకోరు. బాలినేని జన్మదినం రోజునే.. ఆయన తల్లి కాలం చేయడంతో.. అప్పటి నుంచి పుట్టిన రోజు వేడుకలకు బాలినేని దూరంగా ఉంటున్నారు. ఒంగోలులో ఉంటే కార్యకర్తలు,అభిమానులు వస్తారనే భావనతో ఆ రోజు హైదరాబాద్‌కి వెళతారు. ఈ నెల 12వ తేదీ కూడా బాలినేని హైదరాబాద్‌లోని ఇంటికి వెళ్లారు. అక్కడకు కూడా కొంత మంది నేతలు రావడంతో వారిని కలిసిన అనంతరం.. అక్కడ నుంచి కుటుంబంతో కలిసి కేరళ వెళ్లారు.

జన్మదిన వేడుకలంటూ కార్యక్రమం..

జన్మదిన వేడుకలకు బాలినేని దూరంగా ఉన్నా.. జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేక్‌లు కట్‌ చేసి, సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. పార్టీ నేతగా చెలామణి అయ్యేందుకు ఇలాంటి సందర్భాలను ఉపయోగించుకునే సుబ్బారావు గుప్తా కూడా.. జన్మదిన వేడుకలంటూ కార్యక్రమం ఏర్పాటు చేసి హడావుడి చేశారు. పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఏ పదవీ, కనీసం సభ్యత్వంలేని సుబ్బారావు గుప్తాను వైసీపీ నేతగా ప్రొజెక్ట్‌ చేస్తూ తనకు నిచ్చినట్లుగా ఆంధ్రజ్యోతి చిలువలు పలువలుగా కథనాలు వండివారుస్తోంది. 

అనేక సందర్భాల్లో ప్రజాభిప్రాయం పేరుతో తమకు అనుకూలమైన వ్యక్తులతో టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా వీడియోలు చేయిస్తూ.. వాటిని ప్రజా బాహుళ్యంలో పెడుతోంది. ఈ క్రమంలోనే మంత్రి బాలినేని వాసును ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే.. వాసు, ఇతర వైసీపీ నేతలు ఎవరూ లేకుండా సుబ్బారావుతో బర్తేడే వేడుకల పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేసి, అతని చేత మాట్లాడించి ప్రచారానికి వాడుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేశారనే అనుమానం ఒంగోలు వైసీపీ నేతలు, క్యాడర్‌లో నెలకొంది.

Also Read : తిరుపతి సభ మీద ABN దమ్ములేని ఆక్రోశపు కథనాలు..