iDreamPost
android-app
ios-app

వైద్యం ఖర్చు వేయి దాటితే ఆరోగ్యశ్రీ.. మరో ఆరు జిల్లాలో వర్తింపు..

వైద్యం ఖర్చు వేయి దాటితే ఆరోగ్యశ్రీ.. మరో ఆరు జిల్లాలో వర్తింపు..

కరోనా కష్ట కాలంలో ఆంద్రప్రదేశ్ ప్రజలకు భారీ ఉపశమనం కలిగేలా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటతే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు చేయడం మరో ఆరు జిల్లాలకు విస్తరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో అమలవుతోన్న ఈ పథకం ఈ నెల 16వ తేదీ నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించారు.

వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆ చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ఎన్నికల సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఈ హామీని అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు 2020 జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇందులో భాగంగా అప్పటి వరకూ ఉన్న 1,059 చికిత్సలకు మరో వెయ్యి చేర్చి 2,059 చికిత్సలకు ఆరోగ్యశ్రీని వర్తింప చేశారు. ప్రస్తుతం చికిత్సల సంఖ్యను 2,059 నుంచి 2146కు పెంచారు. ఆరోగ్యశ్రీ కింద 54 క్యాన్సర్‌ చికిత్సలనూ చేర్చారు. మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.