iDreamPost
android-app
ios-app

ఆప్‌కు అవకాశం ఉంది.. కానీ ఇప్పుడు కాదట

ఆప్‌కు అవకాశం ఉంది.. కానీ ఇప్పుడు కాదట

జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తిపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. మూడో కూటమి ద్వారానో లేదా ఏదైనా పార్టీ ద్వారానో ప్రత్యామ్నాయ శక్తి రూపుదాల్చుతుందనే చర్చ సాగుతోంది. అయితే ఇవీన్న కేవలం చర్చలకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో కూటమి కోసం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

కేసీఆర్, మమతల ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో 2024 ఎన్నికల నాటికి తెలుస్తుంది. అయితే ఆప్‌ పరిస్థితి ఇప్పుడిప్పుడే అంచనా వేయలేం. జాతీయ స్థాయిలో ప్రభావం చూపి లోక్‌సభలో ఎక్కువ సీట్లు ఆప్‌ గెలవాలంటే ముందు పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించాలని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) చెబుతున్నారు.అప్పుడే ఆప్‌ అనుకున్న లక్ష్యం సాధించగలదని పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో విస్తరించేందుకు ఆప్‌కు ఇంకా 15–20 ఏళ్ల సమయం పడుతుందని పీకే అంచనా వేయడం గమనార్హం. అప్పటి వరకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకే దేశ వ్యాప్తంగా ప్రభావం చూపగలిగే శక్తి ఉందని పీకే చెబుతున్నారు.

పీకే అంచనా నిజమేకావచ్చు.ఆప్‌ ఏర్పడి పదేళ్లు అవుతోంది. నిన్న, మొన్నటి వరకూ ఆ పార్టీ ఢిల్లీకే పరిమితమైంది. ఢిల్లీలో సమర్థవంతమైన పాలన అందించడం ద్వారా.. ఇటీవల పంజాబ్‌లో అధికారంలోకి రాగలిగింది. అక్కడ ఆప్‌ రెండో ప్రయత్నంలో అధికారం సాధించింది. పంజాబ్‌ రాష్ట్రం ఢిల్లీకి అనుకుని ఉండడం, ఢిల్లీలో ఉండే పంజాబీల ఓటు హక్కు స్వరాష్ట్రంలో ఉండడంతో ఆప్‌కు లాభించింది. ఇలాంటి పరిస్థితి దేశం మొత్తం మీద హర్యానాలో ఉండే అవకాశం ఉంది. ఆ రాష్ట్రం మినహా ఇతర రాష్ట్రాలలో ఆప్‌ కు సానుకూల పరిస్థితులు ఇప్పటికైతే లేవనే చెప్పాలి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేసిన ఆప్‌.. పంజాబ్‌లో విజయం సాధించగా..గోవాలో రెండు సీట్లను గెలుచుకుంది. ఉత్తరాఖండ్, మణిపూర్, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లలో ఖాతా తెరవలేదు. ఈ ఏడాది జరగబోయే గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లోనూ ఆప్‌ బరిలోకి దిగబోతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే తెలంగాణపైనా ఫోకస్‌ పెట్టింది. అయితే రెండు, మూడు పర్యాయాలు ప్రయత్నిస్తేగానీ ఆప్‌కు చెప్పుకోదగ్గ సీట్లు వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో కేజ్రీవాల్‌ ఢిల్లీలో అధికారం నిలబెట్టుకోవాలి. వరుసగా ఇతర రాష్ట్రాలలోనూ అంతో ఇంతో ప్రభావం చూపి, సీట్లు గెలుచుకోవాలి. ఈ తరహాలో ఆప్‌ ప్రగతి ఉంటే.. 15–20 ఏళ్లకు జాతీయ స్థాయిలో ఆప్‌ కీలక పాత్ర పోషించగలదు. ఈ కాలంలో ఆప్‌ ప్రగతి తగ్గినా, మందగించినా.. జాతీయ కల కలగానే మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.