Idream media
Idream media
విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెడుతూ పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్న వైఎస్ జగన్ సర్కార్ మరో సంచలనానికి సిద్ధమైంది. ప్రజలకు వేగంగా సరళమైన సేవలు తక్కువ సమయంలో అందేలా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం.. వాటిని ఆధారంగా చేసుకుని మరిన్ని సేవలను అక్కడ నుంచే అందిస్తోంది. రిజిస్ట్రేషన్ సేవలు కూడా గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. భూముల రీ సర్వే పూర్తయిన చోట గ్రామ సచివాలయల్లోనే భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించింది.
సచివాలయాల్లో ఆధార్ సేవలు..
గ్రామ సచివాలయాల్లో 536 రకాల సేవలను ప్రజలకు అందిస్తున్న జగన్‌సర్కార్.. తాజాగా ఆధార్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా.. దశల వారీగా ఆయా సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదటి దశలో 500 చోట్ల ఆధార్ సేవలు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు చేపట్టారు. పట్టణాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో మొదటి దశలో ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత మిగిలిన గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఈ సేవలను ప్రవేశపెట్టాని ప్రభుత్వం భావిస్తోంది.
తప్పనున్న తిప్పలు..
ప్రజల జీవనంలో ఆధార్ ఒక భాగమైంది. ఆధార్ కార్డు తీసుకోవడం, దానికి ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్ అనుసంధానం తప్పనిసరైంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తుండడంతో అడ్రస్ మార్పులు అవసరం అవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు లభించాలంటే ఆధార్‌తో ఫోన్ నంబర్ తప్పని సరిగా అనుసంధానించుకోవాలి. ఈ సేవలు పొందేందుకు ప్రస్తుతం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణాలు, నగరాల్లోని హెడ్‌పోస్టాఫీసు లేదా ఎంపిక చేసిన బ్యాంకులలో మాత్రమే ప్రస్తుతం ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ కూడా రోజుకు పరిమిత సంఖ్యలో మాత్రమే సేవలు అందిస్తున్నారు. ఉదయం వెళ్లి టోకెన్లు తీసుకోవాలి. ఫలితంగా ప్రజలు విలువైన సమయాన్ని, డబ్బును నష్టపోతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. ప్రజలకు వేగవంతమైన సేవలు త్వరితగతిన అందుతాయి.
Also Read : స్టాలిన్ సంచలన నిర్ణయం – రఘురామ రాజన్ ,అరవింద్ సుబ్రమణ్యన్ లతో ఆర్ధిక సలహా మండలి ఏర్పాటు