Idream media
Idream media
రామాయణంలో సీతని అనుమానించే ఘట్టం అందరినీ కంట తడి పెట్టిస్తుంది. ఆ ఫార్ములా సినిమాల్లో కూడా వర్కవుట్ అయ్యింది. 1965లో వచ్చిన ఆడ బ్రతుకు ఇదే కథ. 1975లో వచ్చిన ముత్యాల ముగ్గు కూడా ఇదే. ఎమోషన్ మిస్ కాకుండా తీస్తే ఇది ఎప్పుడూ హిట్ స్టోరీనే.
జెమిని వాసన్ దగ్గర రవి అనే రచయిత ఉండేవాడు. మద్రాస్‌లో వచ్చిన ప్రతి ఇంగ్లీష్ సినిమాని శ్రద్ధగా చూసేవాడు. పనికొచ్చే పాయింట్‌ని వాసన్‌కి చెప్పేవాడు. అయితే ఒక సారి వాసన్ ఒక ఫ్రెంచి అనువాద నవల చదివాడు. చిన్న క్రైమ్‌తో ఫామిలీ డ్రామా. ఫస్ట్ హిందీలో తీద్దామనుకుని రామానంద్‌సాగర్ చేతిలో పెట్టారు. 1964లో జిందగి పెద్ద హిట్. అదే కథని తెలుగులో ఆడబ్రతుకుగా తీశారు. ఎన్టీఆర్ , దేవిక, కాంతారావు, SV రంగారావు లీడ్ యాక్టర్స్.
దేవిక నాటకాల్లో వేషాలు వేస్తూ ఉంటుంది. డైరెక్టర్ కాంతారావుకి ఆమె అంటే ఇష్టం. అయితే ఒక సందర్భంలో ఎన్టీఆర్, దేవిక లవ్‌లో పడతారు. ఇది ఎన్టీఆర్ తండ్రి SVRకి ఇష్టం లేదు. అయినా కొడుకుని కాదనలేక పెళ్లి చేస్తారు. ఇక్కడి వరకు మామూలు కథ. సజావుగా ఉన్న జీవితాల్లోకి ఒక నేరం చొరబడితే?
ఒక రోజు ఎన్టీఆర్, దేవిక కారులో వెళుతుంటే కారు పంక్చర్ అవుతుంది. ఎన్టీఆర్ కారు దిగి వెళతాడు. కారులో దేవిక ఉంటుంది. సడెన్‌గా ఏదో గొడవ జరిగి ఆ ఏరియాలో కర్ఫ్యూ పెడతారు. ఇద్దరు రౌడీలు తరుముతూ ఉంటే ఆమె రక్షణ కోసం ఒక ఇంట్లోకి వెడుతుంది. ఆ ఇల్లు కాంతారావుది. అనివార్యంగా ఆ రాత్రి అక్కడ ఉండిపోతుంది. మరుసటి రోజు ఇల్లు చేరుతుంది.
అదే రాత్రి థియేటర్ యజమాని రాజనాల హత్య జరిగితే అది కాస్తా కాంతారావు నెత్తిన పడుతుంది. ఆ రాత్రి అతనితో ఉన్న స్త్రీ ఎవరో కోర్టుకి చెప్పడానికి ఇష్టపడడు. నిరపరాధికి శిక్ష పడటం ఇష్టం లేని దేవిక కోర్టులో సాక్ష్యం చెబుతుంది. ఫలితంగా ఎన్టీఆర్ వదిలేస్తాడు. ఒక చోట ఆశ్రయం పొంది కొడుకుని ప్రసవిస్తుంది. చివరికి అపార్థాలు విడిపోయి కలుసుకుంటారు.
ఎమ్మెస్ విశ్వనాథం – రామ్మూర్తి సంగీతంలో నాలుగు సూపర్‌హిట్ సాంగ్స్ ఉన్నాయి. అన్నీ పీబీ శ్రీనివాస్ పాడడం విశేషం. దీన్ని తమిళంలో కూడా తీశారు. జెమిని గణేషన్ హీరో. దేవికే హీరోయిన్. అన్ని భాషల్లో హిట్.