iDreamPost
android-app
ios-app

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూ

  • Published Sep 16, 2022 | 3:27 PM Updated Updated Dec 14, 2023 | 6:58 PM

ఇతని గత రెండు సినిమాలు వి, శ్రీదేవి సోడా సెంటర్ ఫలితాలు నిరాశ పరచడంతో ప్రయోగాలు మానేసి ఈసారి క్లీన్ లవ్ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్నాడు.

ఇతని గత రెండు సినిమాలు వి, శ్రీదేవి సోడా సెంటర్ ఫలితాలు నిరాశ పరచడంతో ప్రయోగాలు మానేసి ఈసారి క్లీన్ లవ్ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్నాడు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూ

మహేష్ బాబు కుటుంబ సభ్యుడిగా కెరీర్ మొదలుపెట్టినప్పటికీ తనదంటూ ఒక ముద్ర వేయడానికి బాగా కష్టపడుతున్న హీరో సుధీర్ బాబు. ఇతని గత రెండు సినిమాలు వి, శ్రీదేవి సోడా సెంటర్ ఫలితాలు నిరాశ పరచడంతో ప్రయోగాలు మానేసి ఈసారి క్లీన్ లవ్ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్నాడు. సెన్సిబుల్ దర్శకుడిగా పేరున్న ఇంద్రగంటి మోహనకృష్ణ మూడోసారి తనతో జట్టు కట్టడంతో ఫలితం మీద కాన్ఫిడెన్స్ కనిపించింది. మైత్రి లాంటి పెద్ద బ్యానర్ తో కృతి శెట్టి గ్లామర్ ప్రధాన ఆకర్షణగా యూత్ ని బాగానే టార్గెట్ చేసుకుంది. ఓపెనింగ్స్ వీక్ గా మొదలైన ఈ సినిమా పూర్తిగా మౌత్ టాక్ నే నమ్ముకుంది. మరి దానికి తగ్గట్టే ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నవీన్(సుధీర్ బాబు) కొత్త మూవీ కోసం హీరోయిన్ ని వెతుకుతూ ఉంటాడు. అనుకోకుండా తారసపడిన కంటి డాక్టర్ అలేఖ్య(కృతి శెట్టి)తప్ప తాను రాసుకున్న కథకు ఇంకెవరూ న్యాయం చేయలేరని గుర్తించి ఆమె వెంటపడతాడు. అయితే ఆ అమ్మాయికి ఇష్టం ఉండదు. తల్లితండ్రులకేమో సినిమాలన్నా పరిశ్రమ అన్నా విపరీతమైన ద్వేషం. దీంతో ఎలాగైనా వాళ్ళను ఒప్పించాలని నవీన్ కంకణం కట్టుకుంటాడు. ఈలోగా అలేఖ్యకు సంబంధించి షాక్ కలిగించే నిజం తెలుస్తుంది. అసలతను ఎందుకు ఆమెనే కోరుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీని చివరికి ఎలా కన్విన్స్ చేశాడనే ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి
Let me tell you about that girl review
నటీనటులు

రెగ్యులర్ కథలను ఎంచుకోకుండా విభిన్న ప్రయత్నాలు చేస్తున్న సుధీర్ బాబుని సబ్జెక్ట్ సెలక్షన్ విషయంలో మెచ్చుకోవచ్చు. ఫలితాలు ఎలా ఉన్నా మాస్ ట్రాప్ లో పడకుండా తనకు సూటయ్యే వాటినే చేస్తున్నాడు. తనేమి వర్సటైల్ యాక్టర్ కాదు. దేహధారుడ్యం, చూడదగ్గ రూపం ఉన్న సుధీర్ ఇందులో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో బాగానే చేశాడు. కొంత కామెడీ కూడా ట్రై చేయించారు కానీ అదేమంత గొప్పగా లేదు. ఎమోషనల్ సీన్స్ లోనూ పర్వాలేదనిపించుకున్నాడు. మొత్తానికి నవీన్ పాత్ర ఏం కోరుకుందో దాన్ని ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ కాలేదు. కెరీర్ బెస్ట్ గా నిలవదు కానీ ఎక్స్ పరిమెంట్ చేసిన వి లాంటి వాటికన్నా నయమనే చెప్పాలి.

టైటిల్ రోల్ పోషించిన కృతి శెట్టికి చాలా ప్రాధాన్యం ఉన్న రోల్ దక్కింది. దానికి తగ్గట్టే చక్కగా చేసింది. నటన మరీ గొప్పగా అని చెప్పలేం కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ల కృషి వీళ్ళ పెర్ఫార్మన్స్ ని ఎలివేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతోంది. తనకు ఇచ్చిన ట్విస్ట్ ఎక్స్ పెక్ట్ చేయం. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణల కామెడీ ఓకే. శ్రీనివాస్ అవసరాలది క్యామియోనే. శ్రీకాంత్ అయ్యంగార్ ఇలాంటి క్యారెక్టర్స్ లో అప్పుడప్పుడు ఓవర్ ది బోర్డ్ వెళ్లినట్టు అనిపిస్తుందెందుకో.ఎక్కువ క్యాస్టింగ్ లేకపోవడంతో కథంతా లీడ్ పెయిర్ మీద నడిచిపోయింది. మిగిలినవాళ్లంతా అలా కనిపించి ఇలా వెళ్లిపోయేవాళ్లే. ప్రత్యేకంగా చెప్పుకునేలా పెద్దగా గుర్తుండరు.

డైరెక్టర్ అండ్ టీమ్

సున్నితమైన భావాలతో కథలను తెరకెక్కించడం అంత సులభం కాదు. ఎందుకంటే ఇవి ఒక వర్గం ప్రేక్షకులకే రీచ్ అవుతాయి. మాస్ కి ఎక్కవు. ఎప్పుడో ఓటిటిలోనో టీవీలోనో చూసినప్పుడు అరె బాగుంది కదాని అనుకుంటారు. ఇంద్రగంటి మోహనకృష్ణ సమ్మోహనం, గోల్కొండ హై స్కూల్ లాంటివి కమర్షియల్ గా పెద్ద స్కేల్ కు వెళ్లకపోవడానికి కారణం ఇదే. జెంటిల్ మెన్ ఒక్కటే నాని ఇమేజ్ ప్లస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ వల్ల కొంత బెటర్ రేంజ్ తెచ్చుకుంది. తాను ఎందులో స్పెషలిస్టో తిరిగి అదే స్కూల్ కు తిరిగి వచ్చారు ఇంద్రగంటి. లైన్ గా చూసుకుంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ మెయిన్ ట్విస్టు తప్ప మిగిలినదంతా మరీ గొప్పగా చెప్పుకునే స్థాయిలో ఉండదు
Let me tell you about that girl review
ఫస్ట్ హాఫ్ లో వేగంగా క్యారెక్టరైజేషన్స్ ని పరిచయం చేసిన ఇంద్రగంటి విశ్రాంతి ముందు వరకు ఎలాగోలా టైం పాస్ చేయించాలి కాబట్టి అక్కడ దాకా గంటసేపు సాగే ఫిల్లింగ్ ఎపిసోడ్స్ చాలా సాధారణంగా ఉండటం బోర్ కొట్టిస్తాయి. అలేఖ్య ఎవరో తెలుసుకునే క్రమం కానీ ఆమెకు దగ్గరయ్యే విధానంగా కానీ చప్పగా ఉంటుంది. ఏదైనా ఎంటర్ టైనింగ్ గానో హిలేరియస్ గానో ఉంటే ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అష్టా చెమ్మా, అమీ తుమీ తరహాలో డిజైన్ చేసుకుంటే బోర్ కొట్టకుండా సాఫీగా గడిచిపోయేది. కేవలం ఇద్దరు కమెడియన్లను హీరో పక్కన పెట్టి ఏదో మేనేజ్ చేద్దామనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. ఇంకోలా ఉంటే ఇంప్రెషన్ మారిపోయేది

జనాలకు సినిమాల పిచ్చి ఎంత ఉన్నా నటీనటులకు సంబంధించిన రియల్ లైఫ్ ఎమోషన్స్, కష్టాలు, కన్నీళ్లు అనవసరం. అందుకే ఈ బ్యాక్ డ్రాప్ ఎంచుకునే సాహసం సాధారణంగా మన దర్శక రచయితలు చేయరు. అలా అని హిట్లు లేవని కాదు. దాసరి అద్దాల మేడకు డబ్బులొచ్చాయి. వంశీ సితారకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. కృష్ణవంశీ ఖడ్గంలో సెకండ్ హీరోయిన్ సంగీత, రవితేజల ట్రాక్ మొత్తం ఈ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. ఎవరిదాకో ఎందుకు ఇదే ఇంద్రగంటి సమ్మోహనంలో అదితి పాత్ర కనెక్ట్ అయ్యింది దానివల్లే కదా. వీటన్నింటిలో ఎంగేజ్ చేసే డ్రామా, పరిగెత్తించే కథాకథనాలు, మంచి పాటలు ఉంటాయి. కాబట్టే సక్సెస్ అయ్యాయి.

కానీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇవన్నీ ప్రాపర్ గా కుదరలేదు. ఎంతసేపూ ఒక అమ్మయిని సినిమాల్లోకి వెళ్లకుండా ఆపుతున్న తల్లితండ్రుల మనోగతం, అవకాశాలు రాక ఆత్మహత్యకు పాల్పడుతున్న అసిస్టెంట్ డైరెక్టర్ల వ్యథను హై లైట్ చేసి దాని ద్వారా భావోద్వేగం రాబట్టాలని చూశారు కానీ అది ప్రాపర్ గా సింక్ అవ్వలేదు. ఈ సంఘటనలు నిజంగానే జరుగుతున్నాయి. కాదనడం లేదు. కానీ ఇవన్నీ సగటు ఆడియన్స్ కి అక్కర్లేని వ్యవహారం. అలాంటప్పుడు ఎమోషన్ పేరుతో సన్నివేశాలను సాగదీసినప్పుడు ఆటోమేటిక్ గా చూసేవాళ్ల చూపు స్క్రీన్ నుంచి ఫోన్ కి షిఫ్ట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం బెటరనే ఫీలింగ్ కలగడానికి కారణం ఇదే.

ఎలాంటి అసభ్యత జోలికి వెళ్లని దర్శకుడిగా ఇంద్రగంటికున్న పేరు ఇందులోనూ కంటిన్యూ అయ్యింది. కాకపోతే కృతి శెట్టి క్యారెక్టర్ కు సంబంధించిన ట్విస్టునొకటే ఆధారంగా చేసుకున్న రెండున్నర గంటలపాటు జనాన్ని లీనమయ్యేలా చేసే మెటీరియల్ మాత్రం పూర్తిగా సెట్ చేసుకోలేకపోయారు. ఒకదశకొచ్చాక సుధీర్ కంటే కృతి మీదే ఫోకస్ ఎక్కువైపోవడం కథ ప్రకారమే కావొచ్చు కానీ అప్పటిదాకా హీరో కోణంలో నుంచే సినిమాను చూస్తున్న పబ్లిక్ కి ఉన్నట్టుండి అతను చేసే పనులు అతి సామాన్యంగా అనిపించడం వావ్ ఫ్యాక్టర్ ఇవ్వలేకపోయింది. పైగా ఆరు బ్లాక్ బస్టర్లు తీసిన దర్శకుడు అంతగా అమ్మాయి కోసం పరితపించడం ఇంకొంత కన్విన్సింగ్ గా ఉండాలి

గతంలో పలు సందర్భాల్లో చెప్పినట్టు మాములు కంటెంట్ కోసం థియేటర్లకు ఎవరూ రావడం లేదు. అందుకే ట్రైలర్ చూశాక కలిగిన ఒపీనియన్ వల్లే ఈ రోజు ఓపెనింగ్స్ వీక్ గా మొదలయ్యాయి. ఒకవేళ అది భలే ఉందే అనిపించి ఉంటే హీరో ఎవరని చూడకుండా టికెట్లు కొనే మెచ్యూర్డ్ ఆడియన్స్ మనకున్నారు. అసలే గ్రాండియర్లు అలవాటైన కళ్ళకు హైదరాబాద్ లో రెండు మూడు లొకేషన్లు, హీరో హీరోయిన్ల ఇళ్ల ఇంటీరియర్ మధ్యే మొత్తం కథ నడిపిస్తామంటే అంత సులభంగా ఒప్పుకోవడం లేదు. ఇది బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందేనన్న ఉత్సుకత కలిగించాలి. అలాంటప్పుడు ఇలాంటి అమ్మాయిలు ఆషామాషీగా ఉండకూడదు. స్పెషల్ అవ్వాలి

ఇవన్నీ పక్కనపెడితే ఇంద్రగంటిలో రచయిత కథ విషయంలో కొత్తగా అనిపించాడు కానీ దాన్ని విస్తరించే క్రమంలో, సంభాషణల తీరులో మునుపటి మేజిక్ చేయలేకపోయారు. కీలక మలుపు గురించి విడమరిచి చెప్పాల్సింది ఉంది కానీ ఒక్కసారైనా చూద్దామనుకునే వాళ్లకు ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది కాబట్టి రివీల్ చేయడం లేదు. క్లైమాక్స్ ని కొంత వరకు హార్ట్ టచింగ్ గా తీసిన ఇంద్రగంటి అంతకు ముందు వరకు నడిపించినది ఓ మోస్తరుగానే ఉండటంతో అక్కడా రావాల్సిన ఫీల్ తగ్గిపోయింది. ఓవరాల్ గా ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నో చెప్పాల్సిన ఫిలిం కాదు. అలాని థియేటర్లకు పొలోమని పరిగెత్తించే బాపతూ కాదు. మధ్యలో నిలిచింది

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఒకటి రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి కానీ ట్యూన్స్ విషయంలో ఇంకొంచెం మంచి అవుట్ ఫుట్ ఇచ్చి ఉంటే కనీసం వాటికోసమైనా వచ్చే వాళ్ళు ఉంటారు. పిజి విందా ఛాయాగ్రహణం ఎప్పటిలాగే టాప్ నాచ్ లో సాగింది. ఇంత లిమిటెడ్ బడ్జెట్ లోనూ తెరమీద క్వాలిటీ చూపించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఓ పది నిముషాలు కోత గురించి అలోచించి ఉండాల్సింది. ల్యాగ్ వచ్చింది రైటింగ్ అండ్ టేకింగ్ వల్ల కాబట్టి ఆయన పనితనాన్ని ఎత్తి చూపించలేం. నిర్మాణ విలువలు బాగున్నాయి. పదుల కోట్ల బడ్జెట్ డిమాండ్ చేసేది చేయలేదు కనక ఎంత అవసరమో అంత వ్యయం చేశారు

ప్లస్ గా అనిపించేవి

కృతి శెట్టి సుధీర్
ఇంటర్వెల్ ట్విస్టు
చివరి ఘట్టం

మైనస్ గా తోచేవి

నెమ్మదిగా సాగే కథనం
పాటలు
సంభాషణలు
ఫస్ట్ హాఫ్

కంక్లూజన్

సినిమా చిన్నదైనా పెద్దదైనా థియేటర్ కు వెళ్లే జనాలు ఎన్నో కొన్ని అంచనాలతోనే వెళ్తారు. అది కృతి శెట్టి కావొచ్చు లేదా ఇంద్రగంటికున్న బ్రాండ్ వేల్యూ కావొచ్చు లేదా సుధీర్ బాబు ఫాలోయింగ్ కావొచ్చు. వాటిని కనీస స్థాయిలో అందుకుంటే హిట్టు దక్కే ట్రెండ్ లో ఇలాంటి స్లో పేస్డ్ డ్రామాతో వాటిని అందుకోలేక అమ్మాయి అడుగు తడబడింది. ఎంత సున్నిత హృదయంతో చూసినా సరే ఉండాల్సిన మోతాదు ఫీల్ గుడ్ కన్నా బరువైన ఎమోషన్ ఆధిపత్యం చెలాయించడంతో ఓవరాల్ గా బిగ్ స్క్రీన్ అనుభూతిని సంతృప్తికరంగా ఇవ్వలేకపోయింది. కంటెంట్ ఎలా ఉన్నా ఈ పేరా మొదటి లైన్లో చెప్పిన మూడు కారణాల్లో ఒకటి చాలనుకున్నా ట్రై చేయొచ్చు

ఒక్క మాటలో – అతి మాములు అమ్మాయి

రేటింగ్ : 2.25 / 5