iDreamPost
iDreamPost
ఇటీవల కొంతమంది వాళ్ళే తప్పు చేసి రోడ్ మీద పోలీసులపై ఆగ్రహం చూపించడం, వాళ్ళతో వాదులాడటం చేస్తున్నారు.తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలోని డియోలీ రోడ్ ఏరియాలో ఓ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్‌తో ఒక మహిళ అనుచితంగా ప్రవర్తించి, అతనిపై దాడికి దిగింది.
ఉదయం 10 గంటలకు డియోలి రోడ్ ప్రాంతంలో రద్దీ ఉన్న సమయంలో అక్కడ రాజేంద్ర సింగ్ అనే ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఇద్దరు మహిళలు మరియు ఒక పురుషుడు రోడ్డుకు రాంగ్ సైడ్‌లో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, అది కూడా తలపై హెల్మెట్ లేకుండా వెళుతుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసి ఆపాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, ట్రిపుల్ సీటుతో ప్రయాణించడం, రాంగ్ సైడ్‌లో నడపడం మరియు హెల్మెట్ లేకుండా రైడింగ్ చేయడం.. ఇలా ఇవన్నీ ఉండటంతో వారిని అక్కడే ఆపి స్కూటర్‌ని స్వాధీనం చేసుకోవడానికి క్రేన్ ని పిలిచాడు పోలీస్.
అయితే ఆ మహిళ తన తప్పు అంగీకరించకపోగా కోపంతో ట్రాఫిక్ పోలీసుతో వాగ్వాదానికి దిగింది. ఇది తీవ్ర వివాదానికి దారి తీయడంతో అక్కడ జనం గుమిగూడారు. ఆ మహిళ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్‌ను కొట్టింది కూడా. దీంతో గొడవ పెద్దది అవ్వడంతో అక్కడే ఉన్న ఇతర పోలీసులు వచ్చి దాన్ని ఆపారు. ఇదంతా అక్కడ ఉన్న వాళ్ళు వీడియోలు తీయగా అవి వైరల్ గా మారాయి. ఆ తర్వాత చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని డ్యూటీలో ఉన్న పోలీసు ఇన్‌ఛార్జ్‌లతో దురుసుగా ప్రవర్తించినందుకు ఇద్దరు మహిళలు మరియు స్కూటర్ నడుపుతున్న వ్యక్తితో సహా మొత్తం అందర్నీ ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.