Krishna Kowshik
Krishna Kowshik
ప్రముఖ పేర్లు చెప్పి.. మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. పలానా ఎంపీ, ఎమ్మెల్యేలకు పీఎం, అసిస్టెంట్లమని చెప్పి డబ్బులు వసూలు చేస్తుంటారు. తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి.. ఈ సంస్థ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తి పేరును కూడా వినియోగించాడో కేటుగాడు. అయితే సుధా మూర్తి పేరుతో డబ్బులు గుంజిందీ సైబర్ నేరగాడే.. ఇతర క్రిమినల్సో కాదూ.. గుడిలో పూజలు చేసుకునే ఓ పూజారి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సుధామూర్తి పేరుతో డబ్బు వసూలు చేస్తూ పట్టుబడ్డాడో బెంగళూరుకు చెందిన పూజారి. ఫిర్యాదులు రావడంతో దర్యాప్తు చేపట్టి నగరానికి సమీపంలోని మల్లేశ్వరంలో అరుణ్ కుమార్‌ను అరెస్టు చేశారు జయా నగర్ పోలీసులు.
అమెరికాలోని మిల్ పిటాస్‌లో సెప్టెంబర్ 26న సేవా ఇంటర్నేషనల్ అనే స్వచ్చంద సంస్థ ఓ ఈవెంట్ నిర్వహించింది. దీంతో సోషల్ మీడియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ డాక్టర్ సుధా మూర్తి’ ఈవెంట్‌ను తప్పుడు ప్రచారం చేశారు. ఈవెంట్‌కు టికెట్ ధర రూ. 3,300 నిర్ణయించారు. అలాగే అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలోని నిర్వహించబోయే కార్యక్రమానికి సుధామూర్తిని ముఖ్య అతిధిగా తీసుకువస్తానని కన్నడ కూటా నుండి అరుణ్ కుమార్ రూ. 5 లక్షలు వసూలు చేశాడు. అయితే సదరు సంస్థ నుండి ఏప్రిల్‌లో వచ్చిన ఆహ్వానాన్ని సుధామూర్తి తిరస్కరించారు. అయినప్పటికీ హాజరవుతున్నట్లు ఓ మహిళ ఫోటోలు, వీడియోలను వైరల్ చేసింది. దీంతో గుర్తించిన పోలీసులు దీనికి కారణం అరుణ్ కుమార్ అని నిర్ధారించి అరెస్టు చేశారు.