iDreamPost
android-app
ios-app

బిల్లు ఎగ్గొట్టేందుకు డ్రామాలు.. ఏకంగా 20 రెస్టారెంట్లకు..

బిల్లు ఎగ్గొట్టేందుకు డ్రామాలు..  ఏకంగా 20 రెస్టారెంట్లకు..

చేతిలో చిల్లి గవ్వ లేదు..ఆకలేస్తుందని రెస్టారెంట్లు, హోటల్స్‌కు వెళ్లి, పీకల దాకా తిని.. చివరల్లో కిళ్లీనో, ఐస్ క్రీమో చప్పరించి, బ్రావ్ అని అరిచాక బిల్లు దగ్గరకు వస్తుంది కదా అప్పుడు చూసుకుందాములే అని ఆర్డర్ పెట్టేస్తారు. మొత్తం తినేశాక.. బిల్లు గుర్తుకు వచ్చి చివర్లో బొద్దింకే, బల్లో, వెంట్రుకో పడ్డాయంటూ నాటకాలు చేస్తుంటారు. పక్క కస్టమర్లు కూడా ఏం జరుగుతుందో తెలియక.. వినోదం చూసినట్లు చూస్తుంటారు. ఈ రాద్దాంతాన్ని గమనించిన మేనేజర్.. అక్కడ్నించి పంపించేసేందుకు బిల్లు కట్టక్కర్లేదని చెబుతాడు. ఈ తతంగమంతా ఎన్ని సినిమాల్లో చూసుంటాం. నిజ జీవితంలో అయితే ఊరుకుంటారా.. ఉతికి ఆరేస్తారు. లేదంటే పిండి రుబ్బించడాలు, ప్లేట్టు కడిగించడాలు చేస్తుంటారు. కానీ సినిమాలోని ఈ సీన్ నిజ జీవితంలో అప్లై చేశాడో వ్యక్తి. చివరకు అడ్డంగా దొరికిపోయాడు.

స్పెయిన్ లోని బ్లాంకా ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి.. పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్లి.. ఖరీదైన, తనకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ పెడతాడు. మొత్తం తిన్నాక.. బిల్లు కట్టే దగ్గరకు వచ్చేసరికి గుండె పోటు అంటూ మెలికలు తిరుగుతూ కింద పడిపోతాడు. ఇక యాజమాన్యం బిల్లు గురించి పట్టించుకోకుండా.. అతడికి ఏమైందని ఆసుపత్రికి తరలిస్తుంటారు. వారు వెళ్లిపోయాక.. తాపీగా ఇంటికి చేరుకుంటాడు. మళ్లీ ఆకలేసినప్పుడు ఇదే డ్రామాను అప్లై చేస్తుంటాడు. ఇలా 20 రెస్టారెంట్లను మోసం చేశాడు. తాజాగా ఓ రెస్టారెంట్‌కు వెళ్లి బాగా మెక్కి, మెల్లిగా జారుకునేందుకు ప్రయత్నించగా.. సిబ్బంది పట్టుకున్నారు. అంతలోనే మూర్చపోయినట్లు, గుండెపోటు వచ్చినట్లు నటించాడు.

అంబులెన్స్‌కు కాల్ చేయాలని కోరాడు. అయితే అతడు నాటకాలు ఆడుతున్నారని గ్రహించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తి చర్యలను ఫోటోలు తీసి.. స్పెయిన్ లోని అన్ని రెస్టారెంట్లకు పంపించారు. మరెవ్వరూ మోసపోకుండా అన్నిఫైవ్ స్టార్ హొటళ్లకు అతడి ఫోటోలను, చర్యలకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. అతడు రెస్టారెంట్లలో మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. అతడిని కోర్టులో హాజరు పర్చగా.. ఫైన్ వేశారు. అతడు కట్టేందుకు నిరాకరించడంతో.. 42 రోజుల పాటు శిక్ష విధించారు. ఈ స్కాంకు పాల్పడిన వ్యక్తిపై బాధిత రెస్టారెంట్లు ఉమ్మడిగా ఫిర్యాదు చేయాలన్న యోచనలో ఉన్నాయి. ఇలా చేస్తే.. రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.