Krishna Kowshik
Krishna Kowshik
ప్రస్తుత జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ వెరసి చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురౌతున్నారు. 30 సంవత్సరాలు కాదూ కదా.. 20 లోపు వారిని కూడా హార్ట్ ఎటాక్ బలితీసుకుంటుంది. ముక్కు పచ్చలారని, ఎంతో జీవితాన్నిచూడాల్సిన టీనేజర్లును మింగేస్తూ.. తల్లిదండ్రుల ఆశలపై సమాధి కడుతోంది. తుళ్లుతూ, నవ్వుతూ, నవ్విస్తూ మన కళ్ల ముందే తిరుగుతున్న వారిని.. కను రెప్ప మూసి తెరిచేలోగా.. మాయం చేసేస్తుంది హార్ట్ స్ట్రోక్. మొన్నటికి మొన్న ఎస్ఐ పరీక్షల్లో భాగంగా పరుగు పందెంలో పాల్గొన్న గుంటూరు చెందిన సచివాలయ ఉద్యోగి స్పృహ తప్పి పడిపోగా.. ఆసుపత్రికి తరలించే సరికి చనిపోయిన సంగతి విదితమే. తాజాగా ఓ యువకుడు వ్యాయామం చేస్తూ చనిపోయాడు.
వ్యాయామం నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ సిటీలోని ఓ జిమ్‌కు వెళ్లిన యువకుడు.. థ్రెడ్ మిల్ పై వాకింగ్ చేస్తుండగానే గుండెపోటుకు గురై మరణించాడు. ఈ దృశ్యాలు వ్యాయామ శాలలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. శనివారం మధ్యాహ్నం థ్రెడ్ మిల్ పై రన్నింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా గుండె పోటు రావడంతో..తనకు ఏం జరుగుతుందో తెలుసుకునేలోగా.. ఆ మిషన్‌పైనే కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న ఇద్దరు అతడ్ని చూడగా.. అప్పటికే స్పృహలో లేడు. చివరకు ఆసుపత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు. అతడు బీహార్‌కు చెందిన సిద్దార్థ్ కుమార్ సింగ్‌గా గుర్తించారు.