ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. కానీ, జ్ఞానాన్ని సంపాదించేందుకు మాత్రం వయసు అడ్డంకి కానే కాదు. ఈ మాటను అక్షరాలా నిజం చేసి చూపిస్తున్నారు కొచ్చికి చెందిన 80ఏళ్ళ ఇంజనీర్ నందన్ కుమార్ మేనన్.
వృత్తిరిత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన నందన్ కుమార్ కు డేటా సైన్స్ పై అభ్యాసం చేయాలనే ఆలోచన వచ్చింది. కొత్త తరం కోర్సుల ద్వారా తనని తాను అప్ డేట్ చేసుకోవాలని అనుకున్నారు. అందుకే 80 ఏళ్ళ వయుసులోనూ ఐఐటీ మద్రాసులో ప్రవేశానికి పరీక్ష రాశారు.
ఈ పరీక్షకు నాలుగు పేపర్లు ఉండగా, ఇంకా రెండు పేపర్లు రాయాల్సి ఉందని తెలిపారు మేనన్. చదువుకోవాలని అనే ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే పరీక్షా కేంద్రంలోకి అడుగుపెట్టినప్పుడు గార్డు ఆయన్ని ఒక విద్యార్థిగా చూడలేదని, అడ్డుపడ్డాడంటూ తమాషా సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు.
మీనన్ త్రివేండ్రంలోని ఒక కళాశాల నుండి ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ చదివారు. 1966 లో న్యూయార్క్ లోని సిరక్యూస్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ చేశారు. నాసా మద్దతుతో ఫెలోషిప్ పై తాను న్యూయార్క్ వెళ్లానని చెప్పుకొచ్చారు మేనన్. సైన్స్ నేర్చుకునేందుకు తన వల్ల యువత ప్రేరణ పొందగలిగితే సంతోషిస్తానని అంటున్నారు.