Idream media
Idream media
తెలంగాణలో సీఎం కేసీఆర్ కొంతమంది నాయకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇతర పార్టీలలో పదవులు వదులుకుని వచ్చిన నాయకులకు అలాగే సొంత పార్టీలో ఉన్న సీనియర్లకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవులు కానుకగా ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ పార్టీలో తనను నమ్ముకున్న వారికి సీట్లు కేటాయించారు. కాసేపటి క్రితం టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ల పేర్లు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
మాజీ మంత్రి కడియం శ్రీహరి, అలాగే మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, రవీందర్ రావు, యువనేత పాడి కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, ఎల్ రమణ, గవర్నర్ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవుల కు ఎంపిక చేశారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. అయితే 2019 తర్వాత ఆయనకు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ చోటు కల్పించలేదు. దీనితో వరంగల్ జిల్లాలో ఆయన వర్గం కాస్త అసంతృప్తిగా ఉందని ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలు రావడంతో సీఎం కేసీఆర్ జాగ్రత్తపడ్డారు.
ఆయనతో పాటుగా మాజీ స్పీకర్ భూపాలపల్లి నియోజక వర్గానికి చెందిన మధుసూధనాచారికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అదేవిధంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన కోటిరెడ్డి కి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కాస్త ఆసక్తికరంగా మారింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడానికి కోటిరెడ్డి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించిన నేపథ్యంలో ఆయనను ఎమ్మెల్సీ పదవికి కేసీఆర్ ఎంపిక చేశారు. అలాగే మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా మరోసారి శాసన మండలికి వెళ్లనున్నారు.
వారితో పాటుగా టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన ఎల్.రమణకి కూడా సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అదేవిధంగా హుజురాబాద్ యువనేత పాడి కౌశిక్ రెడ్డి ని సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి పార్టీ విజయం కోసం ప్రయత్నం చేసినా సరే ఫలితం భిన్నంగా వచ్చింది. అయినా సరే ముందు ఇచ్చిన మాట ప్రకారం కౌశిక్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేయడంతో ఆయన వర్గం సంతోషంగా ఉంది. ముందు కౌశిక్ రెడ్డి ని గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేయాలని భావించిన సరే గవర్నర్ అభ్యంతరం తెలపడంతో ఆయన స్థానంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ని పంపించి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కోటా లో ఎంపిక చేశారు.