iDreamPost
iDreamPost
కోవిడ్ 19 మహమ్మారి పుట్టింది మొదలు ప్రజా జీవితాలను నిత్యం భయాందోళనల్లోకి నెట్టేసిందనే చెప్పాలి. దీనిని గురించి అందోళన చెందొద్దని, అవగాహనతో వ్యవహరించాలని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ వ్యాధి భారిన పడ్డవారిలో ఆందోళన తీవ్రమవుతూనే ఉంటోంది. ఇటువంటి వారికి భరోసానిచ్చే విషయం ఏంటంటే ఏపీలో 8లక్షల మందికిపైగా కోవిడ్ 19 భారిన పడి విజయవంతంగా కోలుకుని ఇళ్ళకు చేరుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.
మొత్తం 8,30,731 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీరిలో 8,02325 మంది చికిత్స అనంతరం కోలుకుని ఇళ్ళకు చేరుకున్నారు. 21,672 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. కాగా 6,734 మంది వైరస్ కారణంగా మృతి చెందారని బులిటెన్‌లో పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లోనూ 84,534 శాంపిల్స్‌ను సేకరించగా 2,849 మందికి కొత్తగా వైరస్ సోకినట్టు గురించారు. అదే సమయంలో చికిత్స పొందుతున్న వారిలో 3,700 మంది పూర్తిగా కోలుకుని ఇంటిబాట పట్టారు.
వ్యాధిని గురించి ఆందోళన చెందడాని కంటే దానిని గురించి పూర్తిగా అవగాహన పెంచుకుని వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ వ్యాధి భారిన పడితే అనవసర ఆందోళనలు చెందకుండా వైద్యుల సలహా మేరకు వ్యవహరించాలని విజ్ఞప్తి చేసారు. అలాగే మాస్కుధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలను పాటించాలని గుర్తు చేస్తున్నారు.