iDreamPost
android-app
ios-app

జయహో ఐలవరం స్కూల్.. ప్రభుత్వ పాఠశాలలో skype ద్వారా విదేశీ టీచర్లతో బోధన

జయహో ఐలవరం స్కూల్..  ప్రభుత్వ పాఠశాలలో skype ద్వారా విదేశీ టీచర్లతో బోధన

స్కైప్ యాప్ ద్వారా కొన్నేళ్ల క్రితం నుండే వీడియో కాలింగ్ వినియోగిస్తుండడం అందరికీ తెలిసిందే. అయితే ఈ యాప్ సాయంతో మారుమూల పాఠశాల విద్యార్థులు విదేశీ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ అక్కడి సంస్కృతీ, సంప్రదాయాలు తెలుసుకుంటున్నారు. 50కి పైగా దేశాల్లోని టీచర్లతో ఇక్కడి విద్యార్ధులు ఇంటరాక్ట్ అవుతున్నారు. సాధారణంగా ఇలాంటి సంఘటనలు చూసినపుడు ఎవరికైనా భావోద్వేగం కలుగుతుంది. మన పిల్లలా మజాకా.. మట్టిలో మాణిక్యాలురా అనుకుంటాం అంతేకానీ వాళ్లకోసం ఏదైనా చేసే పరిస్థితిని కల్పించుకోం.. పేద విద్యార్ధులకు అన్ని అవకాశాలు అందుబాటులోకి రావాలని స్పీచులివ్వడం తప్ప మనం చేసేదేమీ ఉండదు.

స్వాతంత్రం వచ్చి డబ్బై మూడేళ్లవుతున్నా.. స్కూళ్ళు లేని ఊళ్ళు ఎన్నో ఉన్నాయి. స్కూళ్ళున్నా బడికిరాని ఉపాధ్యాయులున్నారు. బడికి వచ్చినా చిత్తశుద్ధితో పాఠాలు చెప్పకుండా సమయం గడిపేవాళ్లూ ఉన్నారు. కానీ సామాజిక బాధ్యతగా మనమెవ్వరం మన భావిభారత పౌరులకోసం ఏమీ చేయం.. అవసరం ఉన్నా లేకపోయినా అవకాశం వస్తే మాత్రం అందరిపై నిందలేస్తూ ఉంటాం.. కానీ మట్టిలోని మాణిక్యలకోసం మనం ఎలాంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేయం..

కానీ ఐలవరం అధ్యాపకులు మనలా ఆలోచించలేదు.. వారు చేస్తున్న ప్రయత్నం ద్వారా పిల్లలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఐలవరం పిల్లలకు గ్రామర్, ఉచ్చారణతో కూడిన ఆంగ్ల భాషను బోధించగలుగుతున్నారు. పిల్లలకు ఇంగ్లీష్ పై ఉండే భయాన్ని పోగొడుతున్నారు. విదేశీ విద్యార్థులు, ఉపాధ్యాయుల సహకారంతో పలు మెలకువలను చెప్పిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ బాగా చదివే ముగ్గురు పేద విద్యార్థులను విదేశీయులను దత్తత తీసుకుని వారి చదువులకు ఆర్థికసాయం చేస్తున్నారు. విదేశీ విద్యార్థులు ఇక్కడి పిల్లలకు లేఖలు రాస్తున్నారు. వారి ఇక్కడ విద్యార్థులు అర్ధం చేసుకుంటున్నారు. వారితో ఉత్తర, ప్రత్యుత్తరాల వల్ల ఇక్కడి పిల్లల భాషా నైపుణ్యం మెరుగుపడింది. స్కైప్ నుండి వీడియో కాలింగ్ చేయడం ద్వరా పాఠశాల ఇక్కడి విద్యార్థులు, టీచర్లు విదేశీ విద్యార్థులు, టీచర్లతో మాట్లాడుతున్నారు. అసలు ఐలవరంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా దొరకవు. అలాంటి కుగ్రామంలో ప్రభుత్వం పాఠశాలలకు ప్రభుత్వం ఫైబర్ నెట్ సౌకర్యం కల్పించడం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ పాఠశాల కృషిని ఇటీవల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు గుర్తించారు. రాష్ట్రంలోని విద్యాశాఖలో ఇది వినూత్నమని వారు చేస్తున్న కృషిని అభినందించారు.

మొదట 2017లో హరికృష్ణ అనే ఇక్కడి ఇంగ్లీష్ టీచర్ వేసవి సెలవుల్లో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించారు. కానీ పిల్లల్లో ఆశించిన తగినంత మార్పు రాలేదు. దీంతో ఇంగ్లీష్ మాట్లాడే వివిధ దేశాల టీచర్లు, స్టూడెంట్లను ఫేస్ బుక్ ద్వారా సంప్రదించారు. వారూ అంగీకరించడంతో అప్పటినుంచి సులభమైన పద్ధతుల్లో బోధిస్తున్నారు. పిల్లలు కూడా హాయ్ మేడమ్, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ లతో మొదలు పెట్టి ఇప్పుడు ఏకంగా సబ్జెక్టులే డిస్కస్ చేస్తున్నారు. స్కూల్లోని 8, 9, 10 తరగతుల్లో ఏకంగా 300 మంది పిల్లలు ఇంగ్లీష్ చదవడానికి మాట్లాడటానికి పోటీ పడుతున్నారు.

ఈ స్కూల్ అధ్యాపకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోయే ఆంగ్ల మాధ్యమ తరగతులకు సిలబస్ రూపకల్పన వంటి విషయాల్లో భాగస్వాములు కావాలని ఇటీవలే విద్యాశాఖ కమిషనర్ పిలిచి కోరడం కూడా జరిగింది. అయితే సామాజిక బాధ్యత కలిగిన ఏ వ్యక్తీ ఇవి చూసి తెలుసుకుని వదిలేయడం కరెక్ట్ కాదు.. రాష్ట్రంలోని ఇతర పాఠశాలల్లోని టీచర్లు కూడా వీళ్లను చూసి స్పూర్తి పొందాలి. తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయాలి.. పేద, మద్య తరగతి పిల్లలకు మెరుగైన జీవితం అందించాలనే ఆలోచన లేకపోవడం దురదృష్టకరం.. బాధ్యతారాహిత్యం. అయినా, ఉపాధ్యాయ వృత్తిని బాధ్యతగా స్వీకరించి ఇలా మట్టిలో మాణిక్యాలను తయారు చేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం శిరస్సు వంచి నమస్కరించాల్సిందే. మీలాంటి వాళ్ళే ఈ సమాజానికి అవసరం. జీతం కోసం మాత్రమే ఉపాధ్యాయ వృత్తి అని కాకుండా ఐలవరం ఉపాధ్యాయుల స్పూర్తి మిగతావారికి ఆదర్శప్రాయం కావాలి.

పాలకులు ప్రణాళికల రూపకల్పనలో గ్రామీణ ప్రాంతాల ప్రజలపై దృష్టి పెట్టి విద్యార్ధులను తీర్చిదిద్దాలి. ప్రస్తుతం ఉన్న స్కూళ్లలో కంప్యూటర్ స్రీన్ల సంగతి అటుంచితే బ్లాక్ బోర్డులు కూడా లేని బడులున్నాయి. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియంలో బోధన వంటి కార్యక్రమాలుతో ప్రభుత్వ విద్య వ్యవస్థ ప్రక్షాళన జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే..ఐలవరం విద్యార్థుల్లాగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య లభిస్తుంది.