Idream media
Idream media
ఫిబ్రవరి 10,1952 భారత క్రికెట్ చరిత్రలో మరపురాని రోజు. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు తన మొదటి టెస్టు విజయాన్ని నమోదు చేసిన రోజు అది. భారత జట్టు తన మొదటి టెస్టు మ్యాచ్ 1932లో ఇంగ్లాండులో ఆ జట్టు మీద ఆడి, టెస్టు హోదా పొందిన ఆరవ దేశంగా గుర్తింపు పొందినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. భారత క్రికెట్ జట్టుకు టెస్టు హోదా పొందే సత్తా లేకపోయినా తన పాలనలో ఉన్న దేశం కాబట్టి ఇంగ్లాండు తన ఆధీనంలో ఉన్న ఎంసిసితో టెస్టు హోదా ఇప్పించిందని విమర్శలు వచ్చాయి. జట్టులో ఉన్న పదకొండు మంది సభ్యులలో తొమ్మిది మందికి పిచ్ మీద క్రికెట్ ఆడిన అనుభవం లేకపోయినా భారత బౌలర్లు బలమైన ఇంగ్లాండు జట్టుని బాగా కట్టడి చేశారు. అయితే బ్యాటింగ్ బలహీనత వల్ల భారత జట్టు ఆ మ్యాచ్ ఓడిపోయింది.
ఆ తరువాత ఇరవై సంవత్సరాలు ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లతో స్వదేశంలో, విదేశాల్లో ఇరవై మ్యాచ్ లాడి అందులో పదకొండు ఓడిపోయి, తొమ్మిది డ్రా చేసుకుని మొదటి విజయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇంగ్లాండు జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా లో జరిగిన మొదటి మూడు మ్యాచ్ లు డ్రా కాగా, కాన్పూర్ లో జరిగిన నాలుగవ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. చివరి మ్యాచ్ ఆడడానికి ఇరు జట్లు మద్రాసు నగరం చేరుకున్నాయి.
ద్వితీయ శ్రేణి జట్టుతో వచ్చిన ఇంగ్లాండు
అప్పటివరకూ ఒక్క టెస్టు కూడా గెలవని భారత జట్టుని ఇంగ్లాండు క్రికెట్ సంఘం సీరియస్ గా తీసుకోలేదు. లెన్ హట్టన్, అలెక్ బెడ్సర్, డెనిస్ కాంప్టన్, జిమ్ లేకర్ లాంటి హేమాహేమీలకు విశ్రాంతి ఇచ్చి, టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం లేని ఎనిమిది మంది కొత్తవారికి అవకాశం ఇచ్చింది. కెప్టెన్ నైజెల్ హోవార్డ్ తో సహా జట్టులో ఒక్కరికి కూడా తొమ్మిది కన్నా ఎక్కువ మ్యాచ్ లు ఆడిన అనుభవం లేదు. ఈ ద్వితీయ శ్రేణి జట్టు కూడా భారత జట్టుతో మొదటి మ్యాచ్ లు, డ్రా చేసుకుని, నాలుగో మ్యాచ్ గెలిచి, సిరీస్ విజయం మీద గట్టి నమ్మకంతో, నాటి మద్రాసు నగరం లోని, చెపాక్ స్టేడియంలో ఫిబ్రవరి 6,1952 న అయుదో మ్యాచ్ కోసం అడుగు పెట్టింది. జట్టు కెప్టెన్ హోవార్డ్ నాలుగో మ్యాచ్ లో గాయపడడంతో, ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు డొనాల్డ్ కార్ నాయకత్వంలో బరిలో దిగగా భారత జట్టుకు విజయ్ హజారే నాయకత్వం వహించాడు.
Also Read : ధోనీ రికార్డును అధిగమించిన రిషబ్ పంత్
మన్కడ్ మాయాజాలం
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ కార్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ ఫ్రాంక్ లాసన్ భారత ఆల్ రౌండర్ దత్తూ ఫడ్కర్ బౌలింగ్ లో ఒక పరుగుకే బౌల్డ్ అయినా, స్పూనర్, రాబర్ట్ సన్, గ్రావెనీ ముగ్గురు హాఫ్ సెంచరీలు సాధించారు. వీరిలో స్పూనర్ హజారే బౌలింగ్ లో, మిగిలిన ఇద్దరితో పాటు వాట్కిన్స్ భారత స్పిన్నింగ్ ఆల్ రౌండర్ వినూ మన్కడ్ బౌలింగ్ లో అవుటయ్యారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండు జట్టు 5 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది.
మొదటి రోజు ఆట ముగిసిన కొద్ది సమయానికి ఇంగ్లాండు రాజు ఆరవ జార్జి మరణించిన వార్త తెలిసింది. అప్పట్లో టెస్టు మ్యాచ్ మూడు రోజుల తర్వాత ఒక రోజు విశ్రాంతి దినంగా ఉండేది. ఈ మ్యాచ్ కి ఫిబ్రవరి 9 విశ్రాంతి దినం. అయితే చక్రవర్తి మరణానికి సంతాపం తెలియజేయడానికి విశ్రాంతి దినాన్ని ఫిబ్రవరి 7కు మార్చారు అధికారులు ఇరుపక్షాల అంగీకారంతో.
ఫిబ్రవరి 8 న ఆట మొదలయ్యాక వినూ మన్కడ్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. మూడు అంగలతో ఎక్కువ రనప్ లేకుండా, ఆఫ్ స్టంప్ లైన్ తో, గాలిలో ఎక్కువ ఫ్లైట్ ఉండేలా, లూజ్ బాల్స్ లేకుండా ఉన్న మన్కడ్ బౌలింగ్ ని ఎదుర్కోవడానికి ఇంగ్లాండు బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఎక్కువ సేపు బంతి గాలిలో ఉండడంతో షాట్లు కొట్టడానికి అనువుగా ఉందని భావించిన బ్యాటర్లు ముందుకు రావడం, బంతి పిచ్ మీద పడగానే స్పిన్ అయి అందకుండా పోవడం. ఇలా నలుగురు ఇంగ్లాండు బ్యాటర్లు వికెట్ కీపర్ ఖోకన్ సేన్ చేతిలో స్టంప్ అవుట్ అయ్యారు. మొదటి రోజు స్కోరుకి మరో 42 పరుగులు చేసి ఇంగ్లాండు జట్టు ఆలౌట్ అయింది. రెండవ రోజు అయిదు వికెట్లు మన్కడ్ తీసుకుని, ఇన్నింగ్స్ లో 55 పరుగులిచ్చి 8 వికెట్లు తీసి అప్పటికి భారత జట్టు తరఫున అత్యుత్తమ బౌలింగ్ రికార్డు సృష్టించాడు.
సెంచరీలతో చెలరేగిన పంకజ్ రాయ్, పాలీ ఉమ్రిగర్
భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన ముస్తాక్ ఆలీ, పంకజ్ రాయ్ లు మొదటి వికెట్ కి 53 పరుగులు జోడించిన తర్వాత ముస్తాక్ ఆలీ అవుటయ్యాడు. తరువాత విజయ్ హజారే, వినూ మన్కడ్ లు అండగా నిలవడంతో ధాటిగా ఆడిన పంకజ్ రాయ్ సెంచరీ సాధించి జట్టు స్కోరు 191 ఉండగా, 111 పరుగులు చేసి అవుటయ్యాడు. జట్టు స్కోరు 216 ఉన్నప్పుడు సీనియర్ ఆటగాడు లాలా అమర్ నాథ్ అయిదో వికెట్ గా అవుటయ్యాక యువ ఆటగాడు పాలీ ఉమ్రిగర్ క్రీజులో ఉన్న దత్తు ఫడ్కర్ తో కలిశాడు. హేము అధికారి గాయపడడంతో చివరి నిమిషంలో జట్టులో స్థానం సంపాదించుకున్న ఉమ్రిగర్ అప్పటికి జట్టులో స్థానం కోసం పోరాడుతూ ఉన్నాడు. అందుకే జాగ్రత్తగా దూకుడుతో ఆడే తన సహజమైన ఆటను అదుపులో పెట్టుకుని, బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా ఫడ్కర్ తో కలిసి 104 పరుగులు, స్థానిక ఆటగాడు గోపీనాథ్ తో కలిసి 93 పరుగులు జోడించి, తన కెరీర్ లో మొదటి సెంచరీ నమోదు చేశాడు.
Also Read : 144 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో మూడవ పర్ఫెక్ట్ టెన్
జట్టు స్కోరు 457/9 వద్ద 191 పరుగుల ఆధిక్యంలో ఉండగా, ఆ రోజు ఆట మరికొన్ని నిమిషాలు ఉందనగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు విజయ్ హజారే. అప్పటికి పాలీ ఉమ్రిగర్ 130 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఆ రోజు మిగిలిన ఆటను వికెట్ కోల్పోకుండా ముగించింది ఇంగ్లాండు జట్టు.
ఫిబ్రవరి 10 న నాలుగవ రోజు ఆట మొదలైన కాసేపటిలోనే ఇంగ్లాండు ఓపెనర్లు డిక్ స్పూనర్, ఫ్రాంక్ లాసన్ లను భారత బౌలర్లు దత్తు ఫడ్కర్, రమేష్ దివేచాలు తక్కువ స్కోరుకి అవుట్ చేశాక గులామ్ అహ్మద్, వినూ మన్కడ్ లు చెరో నాలుగు వికెట్లు తీసుకుని 183 పరుగులకే ఇంగ్లాండు జట్టుని ఆలౌట్ చేయడంతో భారత జట్టు మరోసారి బ్యాటింగ్ చేయవలసిన అవసరం లేకుండా ఇన్నింగ్స్ 8 పరుగులతో తన మొదటి టెస్టు విజయం సాధించింది. మ్యాచ్ లో 108 పరుగులు ఇచ్చి 12 వికెట్లు సాధించిన మన్కడ్ ఆ సిరీస్ లో 34 వికెట్లు తీసి, బ్యాటింగ్ లో కూడా రాణించి 223 పరుగులు చేశాడు.
భారత విజయాన్ని ముందుగానే ఊహించి, గ్యాలరీలలో నిండిపోయిన అభిమానులు కరతాళ ధ్వనులతో రచ్చ చేస్తుంటే మైదానంలో ఆటగాళ్లు ఒకరి వీపు మీద మరొకరు చేతితో తట్టి తమ డ్రస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయారు.
ఆటగాళ్లకి లభించిన పారితోషికం 240 రూపాయలు
అప్పట్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకి ఇప్పటిలా డబ్బు కానీ పరపతి కానీ లేదు. చారిత్రాత్మక విజయం సాధించిన జట్టు సభ్యులకు వారికి ఒక మ్యాచ్ ఆడినందుకు ఇచ్చే 240 రూపాయలు తప్ప అదనంగా ఎలాంటి రివార్డులు దక్కలేదు. నవంబర్ 27,2009 న ఎమ్మెస్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు శ్రీలంక మీద తన 432వ మ్యాచ్ లో వందవ టెస్టు విజయం నమోదు చేసినప్పుడు ఒక్కో ఆటగాడికి 25 లక్షల రూపాయలు బహుమతిగా ఇచ్చింది క్రికెట్ బోర్డు.
భారత జట్టు టెస్టు క్రికెట్ ఆడడం మొదలు పెట్టిన యాభై సంవత్సరాల వరకూ ఆటగాళ్లు డబ్బు కోసం కాకుండా కేవలం గేమ్ మీద ప్రేమతోనే ఆడారు. 1983లో ప్రపంచ కప్ గెలిచి, 1987లో భారతదేశంలో ప్రపంచ కప్ నిర్వహించిన తర్వాతే భారత క్రికెట్ లో ధన ప్రవాహం మొదలైంది.
1952లో మొదటి టెస్టు విజయం సాధించిన భారత జట్టు ఆ సంవత్సరమే భారత పర్యటనకు వచ్చిన పాకిస్తాన్ జట్టు మీద 2-1 తేడాతో మొదటి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. విదేశీ గడ్డ మీద విజయం కోసం మరో ఒకటిన్నర దశాబ్దాలు ఆగవలసి వచ్చింది. 1967లో పటౌడీ నాయకత్వంలో న్యూజిలాండ్ పర్యటనలో 2-0 తేడాతో విదేశీ గడ్డమీద మొదటి టెస్టు, మొదటి సిరీస్ విజయాలను నమోదు చేసింది.
Also Read : రెండు టికెట్ల కోసం పంతంతో క్రికెట్ ప్రపంచ కప్పును భారతదేశానికి తీసుకొచ్చిన బిసిసిఐ అధ్యక్షుడు