iDreamPost
android-app
ios-app

నిబంధనలు అతిక్రమించిన కుటుంబం- 6 లక్షల జరిమానా

నిబంధనలు అతిక్రమించిన కుటుంబం- 6 లక్షల జరిమానా

లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత దేశంలో కరోనా ఉధృతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేస్తున్న కొందరు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారు. తాజాగా కరోనా వ్యాపించడానికి కారణమైన కుటుంబానికి 6 లక్షల జరిమానా విధిస్తూ ఒక కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాకు చెందిన గీసులాల్‌ రాఠీ ఈ నెల 13న తన కుమారుడి వివాహం జరిపించాడు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేవలం 50 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలన్న ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి భారీ సంఖ్యలో అతిథులను గీసులాల్‌ రాఠీ ఆహ్వానించాడు. వివాహానికి వచ్చిన అతిథుల్లో 15 మందికి కరోనా సోకింది. కరోనా కారణంగా ఒకరు మృతిచెందారు. నిబంధనలు అతిక్రమించి పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానించిన గీసులాల్‌ రాఠీ కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కరోనా సోకిన 15 మందిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందించారు. వీరి చికిత్సకు ప్రభుత్వానికి రూ.6,26,600 ఖర్చు అయింది. బాధితులకు చికిత్స అందించడానికి అయిన ఖర్చును కరోనా సోకడానికి కారణమైన గీసులాల్ కుటుంబం నుండి వసూలు చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజేంద్ర భట్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జరిమానా విధించిన డబ్బును సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు డిపాజిట్‌ చేయాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి కరోనా వ్యాప్తికి కారణం అయిన కుటుంబానికి జరిమానా విధించడం సరైన పనే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.