iDreamPost
android-app
ios-app

హెల్త్ హాబ్స్ 50% ఆరోగ్యశ్రీకి – జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..

హెల్త్ హాబ్స్ 50% ఆరోగ్యశ్రీకి –  జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..

పేద‌ల ఆరోగ్య కోసం ఇంత‌లా ఆలోచించే ప్ర‌భుత్వం బ‌హుశా.. ఇప్ప‌టి వ‌ర‌కూ లేద‌నే చెప్పొచ్చు. తండ్రి వైఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌వేశ పెట్టిన ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని అంత‌కంత‌కూ ప‌టిష్టం చేస్తూ వ‌స్తున్నారు త‌న‌యుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. వైఎస్ ఆర్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకంలో మొత్తం 2,434 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందిస్తోంది. వైద్య ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే చాలు.. ఆస్ప‌త్రి బిల్లు మొత్తం ప్రభుత్వమే భ‌రిస్తోంది. క‌రోనా చికిత్స‌ను కూడా ఈ ప‌థ‌కం ద్వారా ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ వైద్యం చేయించుకునే అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. హెల్త్ హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం 50 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ రోగులకు ఇవ్వాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు జ‌గ‌న్.

డెంగీ జ్వరంతో పాటు గైనకాలజీ, పల్మనరీ, డయాబెటిక్ ఫుట్ వంటి వ్యాధులకు అందించే చికిత్సలను కూడా ఆరోగ్య శ్రీ‌లో చేర్చారు. ఈ చికిత్సల్లో దేనికైనా సరే వైద్యం పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుంటే.. ‘ఆరోగ్య ఆసరా’ పేరుతో రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా రూ.5వేల ఆర్ధిక సాయం అందిస్తారు. డాక్టరు నిర్ణయించిన మేరకు విశ్రాంతి రోజులకు లెక్కించి ఆసరా సొమ్ము ఇస్తారు. ఆరోగ్య శ్రీకి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాధి తీవ్రతను బట్టి రూ.రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పెన్షన్లు ఇస్తోంది. లెప్రసీ, తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు, పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారికి, వీల్‌ ఛైర్లకు పరిమితమైన వారికి రూ.10 వేల వరకు పెన్షన్‌ ప్రభుత్వం చెల్లిస్తోంది.

రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అత్యాధునిక వైద్యం అందించ‌డ‌మే త‌న ధ్యేయ‌మని ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా చెప్పిన‌ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆ దిశ‌గానే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వాసుపత్రికి వచ్చేలా వైద్య సదుపాయాలు మెరుగుప‌ర్చ‌డంతో పాటు, హెల్త్ హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం 50శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ రోగులకు ఇచ్చేలా తాజాగా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆరోగ్యబీమా కంపెనీలు చెల్లిస్తున్న చార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయన్నారు. ఎవరెక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్ హ‌బ్స్ లో ప్రాధాన్యం ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం ద్వారా ఆస్ప‌త్రి యాజ‌మాన్యాలు పేద‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చేలా వ్యూహాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

అదేవిధంగా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు వ్యాక్సినేషన్ హెల్త్ హబ్స్ ఆస్పత్రుల నిర్వహణ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. హెల్త్ హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉండేలా చూస్తున్నారు. రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి మంచి వైద్యసేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్ హబ్స్ ద్వారా నెరవేరుతుందన్నారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రామాణికం కానుంది. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఏపీలోనే అత్యుత్త‌మ సేవ‌లు అందేలా సీఎం జగన్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది.